నెల్లూరుకు షుగరు, బీపీ!
* వందకు 15 మంది మధుమేహ బాధితులు
* రక్తపోటు విషయంలోనూ అదే తీరు
* ఆ తర్వాత స్థానంలో కృష్ణా జిల్లా
* పల్లెల్లోనూ జీవన శైలి మార్పుతో జబ్బులు పెరిగినట్లు ప్రభుత్వ సర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: షుగరు, బీపీ రోగులకు నిలయాలుగా ఉన్న నగరాల జీవన శైలి ప్రస్తుతం పల్లెలకూ పాకింది. ప్రపంచ డయాబెటిక్ రాజధానిగా ఇప్పటిదాకా హైదరాబాద్ ఉండేది. ఇప్పుడా స్థానాన్ని నెల్లూరు, విజయవాడ, విశాఖ నగరాలు అందిపుచ్చుకునే దశకు చేరుకున్నాయి.
తాజాగా ప్రభుత్వం నాన్ కమ్యునికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ-జీవన శైలి జబ్బులు) మీద జరిపిన సర్వేలో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని పల్లెల్లో డయాబెటిక్ కేసులు భారీగా నమోదయ్యాయి. హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) కేసులూ అధికంగా నమోదు కావడం విస్మయ పరుస్తోంది. జీవన ప్రమాణాలు తగ్గడమే కాకుండా, కుటుంబ ఆర్థిక స్థితిగతులు దారుణంగా దెబ్బతింటున్నట్టు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చని చెబుతున్నారు.
కలవరపెడుతున్న రక్తపోటు
రాష్ట్రంలో రక్తపోటు రోగులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు, కృష్ణా ప్రథమ స్థానం సంపాదించుకున్నాయి. నెల్లూరులో ప్రతి వంద మందిలో 14 మందికి పైగా అధిక రక్తపోటుతో బాధపడుతుండగా, కృష్ణా జిల్లాలో వంద మందికి 11 మంది ఉన్నట్టు ప్రభుత్వ సర్వేలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికంగా మధుమేహం, హైపర్ టెన్షన్‌లపై 8 జిల్లాల్లో పరీక్షలు నిర్వహించారు. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో బీపీ, మధుమేహ బాధితులు ఎక్కువున్నట్టు తేలింది. నెల్లూరు జిల్లాలో ప్రతీ వంద మందిలో 15 మందికి మధుమేహం ఉంది.
కృష్ణ్లాలో ప్రతి వంద మందికి 11.2 మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారని స్పష్టమైంది. చిత్తూరులో అతి తక్కువ డయాబెటిక్ కేసులు నమోదయ్యాయి. వందకు కేవలం 4.95 మంది ఉన్నట్టు అధికార వర్గాలు తేల్చాయి. కృష్ణా జిల్లాలో 15.07 లక్షల మందికి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించగా 1,69,429 మందికి నిర్ధారణ అయ్యింది. నెల్లూరు జిల్లాలో ఇదే పరీక్షను 6.22 లక్షల మందికి నిర్వహించగా 98,953 మందికి నిర్ధారణ కావడం గమనార్హం.