Government survey
-
జాతీయ కుటుంబ సర్వేలో ఆసక్తికర అంశాలు
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో లింగ సమానత్వంపై కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు, చైతన్యపూరిత కార్యక్రమాలు సత్ఫలితాలిచాయి. గతంతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ సర్వే వెల్లడించింది. రాష్ట్ర సంగటు కంటే జిల్లాలోనే మహిళ సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఐదేళ్ల క్రితం ప్రతి వేయి మంది పురుషులకు జిల్లాలో 1,007 మంది మహిళలు ఉంటే.. ప్రస్తుతం ఏకంగా ఆ సంఖ్య 1,053కు పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 నివేదికలో ఈ విషయాలను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ స్పష్టంచేసింది. 2019 జూన్ 30 నుంచి కేంద్ర కుటుంబ నవంబరు 14 వరకు 892 కుటుంబాల్లోని 911 మంది మహిళలు, 119 మంది పురుషులతో సర్వే నిర్వహించినట్లు ఆరోగ్య సంక్షేమశాఖ తెలియజేసింది. చదవండి: ఆ రాష్ట్రాల్లో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం తగ్గిన సిజేరియన్లు.. జిల్లాలో ప్రసవాలను పరిశీలిస్తే గతంలో కంటే సిజేరియన్ ప్రసవాలు తగ్గినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 2015–16లో నిర్వహించిన సర్వేలో సిజేరియన్ ప్రసవాలు 46.9 శాతంగా నమోదైతే.. ఐదేళ్ల తర్వాత అంటే 2019–20లో 43.2 శాతానికి తగ్గింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ ప్రసవాలు ఐదేళ్ల క్రితం 65.1 శాతంగా ఉండగా...2019–20లో 71.6 శాతానికి పెరగడం గమనార్హం. నవజాత శిశు మరణాలు నాలుగేళ్లలో 1000 మందికి 20 నుంచి 16.8 కి తగ్గాయి. నాలుగేళ్లలోపు వయసున్న శిశు మరణాలు 31.7 నుంచి 29.4కు తగ్గాయి. నాలుగేళ్లలోపు చిన్నారులకు సరైన పోషకాహారం లభించక ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరునెలల నుంచి నాలుగేళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. తగ్గని మధుమేహం.. జిల్లాలో పురుషులు, మహిళల్లో మధుమేహం (డయాబిటీస్) ఎక్కువగా ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బయటపెట్టింది. 141–160 ఎంజీ/డీఎల్ ఉన్నవారిలో మహిళలు 4.4 శాతం మంది, పురుషులు 6.3 శాతం మంది ఉన్నారు. 160 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 5.3, పురుషులు 8.7 శాతం మంది ఉన్నారు. మాత్రలు వేసుకున్నా 140 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 11.3 శాతం, పురుషులు 16.3 శాతం మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మరింత పెరిగే అవకాశం.. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఆడపిల్లలు, మహిళల భవిష్యత్‌పై ప్రభుత్వం అవగాహనా, చైతన్య కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో, విద్య, ఉద్యోగాలలో కూడా ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యమిస్తున్నది. గర్భిణులుగా ఉన్నప్పుడు స్కానింగ్ లాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవరిస్తున్నారు. వైద్యులు కూడా అబార్షన్లు చేయడంలేదు. ఐసీడీఎస్ ద్వారా ఆడపిల్లలను రక్షించాలనే నినాదంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. మున్ముందు బాలికల శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ‘బేఠీ బచావో–బేఠీ పడావో’ నినాదం కూడా బాలికల శాతం పెరగడానికి దోహదపడింది. – పద్మావతి, ఐసీడీఎస్ పీడీ జిల్లా వివరాలు 2015–16(శాతం) 2019–20(శాతం) ఆరేళ్లు, ఆపై వయస్సు గల వారు పాఠశాలకు వెళ్తున్న వారు 57 60.2 15 ఏళ్లలోపు చిన్నారుల జనాభా 26.1 24.1 మహిళల్లో అక్షరాస్యత 57 63.6 20 ఏళ్లలోపు బాలికల వివాహాలు 36.3 30.6 -
ఒకే అర్హత ఉంది, కానీ వేతనం మాత్రం...
మహిళలకు పనిప్రదేశాల్లో సమప్రాధాన్యం ఇవ్వాలి. మహిళలు, పురుషులు ఒకే అర్హతతో ఉంటే, ఇద్దరికీ సమాన వేతనం ఇవ్వాలి. బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో కచ్చితంగా మహిళలుండాలి. ఇవన్నీ ఎన్నో రోజులుగా పనిప్రదేశాల్లో వెల్లువెత్తుతున్న డిమాండ్లు. కానీ మగవారికి, ఏ మాత్రం తీసిపోకుండా మహిళలు చదువుకున్నా.. వారికి తగిన గౌరవమే కాదు, కనీసం తగిన వేతనం కూడా లభించడం లేదు. తాజాగా ప్రభుత్వం వెల్లడించిన సర్వేలో మగవారితో సమానంగా ఒకే విద్యార్హత ఉన్నప్పటికీ, మహిళలు 30 శాతం తక్కువ వేతనమే పొందుతున్నట్టు తెలిసింది. పట్టణ ప్రాంతంలో గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగి ఉన్న మహిళలు రోజుకు రూ.690.68 పొందుతుంటే, వారి కంటే 30 శాతం అధికంగా మగవారు రూ.902.45 ఆర్జిస్తున్నట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. వ్యవసాయరంగంలో కూడా మగవారికి తగ్గస్థాయిలో మహిళలు పనిచేస్తున్నప్పటికీ, వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని సర్వే తెలిపింది. గ్రామాల్లో చదువుకోని మహిళలు రోజుకు రూ.88.2 వేతనం పొందుతుంటే, వారి కంటే 45 శాతం అధికంగా చదువుకోని మగవారు రూ. 128.52ను ఆర్జిస్తున్నట్టు వెల్లడైంది. అయితే కొన్ని రంగాల్లో మాత్రం మగవారి కంటే అధికంగా మహిళలే సంపాదిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగంలో పనిచేసే మహిళలు రోజుకు రూ.322 ఆర్జిస్తుంటే, వారి కంటే 13 శాతం తక్కువగా మగవారు రూ.279.15 పొందుతున్నట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. పట్టణ ప్రాంతంలో రవాణా, స్టోరేజ్ రంగాల్లో కూడా మహిళలే అధికంగా వేతనం పొందుతున్నారట. 15 నుంచి 59 ఏళ్ల మహిళలు, పురుషులుకు చెందిన సగటు రోజువారీ వేతనాలను తీసుకొని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ‘మెన్ అండ్ ఉమెన్ ఇన్ 2017’ రిపోర్టును రూపొందించింది. ఈ రిపోర్టులోనే చదువుకోని వారి, చదువుకున్న వారి సంపాదనలను కూడా వెలువరించింది. చదువుకున్న మహిళలు, చదువుకోని మహిళల కంటే 5.8 సార్లు ఎక్కువగా సంపాదిస్తున్నారని రిపోర్టు పేర్కొంది. అలాగే చదువుకున్న మగవారు, చదువుకోని వారికంటే 3.6 సార్లు ఎక్కువగా ఆర్జిస్తున్నారని తెలిపింది. ఆశ్చర్యకరంగా చదువుకున్న తర్వాత కూడా మహిళలకు, పురుషులకు మధ్య వేతన చెల్లింపుల్లో చాలా వ్యత్యాసముంటుందని ఈ రిపోర్టు వెల్లడించింది. గ్రాడ్యుయేట్లు ఉన్నప్పటికీ మగవారి కంటే 24 శాతం తక్కువగా మహిళలు వేతనం పొందుతున్నారని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కువ వేతనం చెల్లించే రంగం నిర్మాణ రంగమని పేర్కొంది. మైనింగ్, క్వారింగ్‌లో మగవారికి ఎక్కువ వేతనాలు ఉంటున్నాయని రిపోర్టు చేసింది. అదే పట్టణ ప్రాంతాలకు వచ్చే సరికి మైనింగ్, క్వారింగ్ రంగాల్లో మగవారు ఎక్కువగా సంపాదిస్తుంటే, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ యుటిలిటీస్‌లో మహిళలు ఎక్కువ వేతనం పొందుతున్నారని తెలిపింది. -
నెల్లూరుకు షుగరు, బీపీ!
* వందకు 15 మంది మధుమేహ బాధితులు * రక్తపోటు విషయంలోనూ అదే తీరు * ఆ తర్వాత స్థానంలో కృష్ణా జిల్లా * పల్లెల్లోనూ జీవన శైలి మార్పుతో జబ్బులు పెరిగినట్లు ప్రభుత్వ సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: షుగరు, బీపీ రోగులకు నిలయాలుగా ఉన్న నగరాల జీవన శైలి ప్రస్తుతం పల్లెలకూ పాకింది. ప్రపంచ డయాబెటిక్ రాజధానిగా ఇప్పటిదాకా హైదరాబాద్ ఉండేది. ఇప్పుడా స్థానాన్ని నెల్లూరు, విజయవాడ, విశాఖ నగరాలు అందిపుచ్చుకునే దశకు చేరుకున్నాయి. తాజాగా ప్రభుత్వం నాన్ కమ్యునికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ-జీవన శైలి జబ్బులు) మీద జరిపిన సర్వేలో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని పల్లెల్లో డయాబెటిక్ కేసులు భారీగా నమోదయ్యాయి. హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) కేసులూ అధికంగా నమోదు కావడం విస్మయ పరుస్తోంది. జీవన ప్రమాణాలు తగ్గడమే కాకుండా, కుటుంబ ఆర్థిక స్థితిగతులు దారుణంగా దెబ్బతింటున్నట్టు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చని చెబుతున్నారు. కలవరపెడుతున్న రక్తపోటు రాష్ట్రంలో రక్తపోటు రోగులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు, కృష్ణా ప్రథమ స్థానం సంపాదించుకున్నాయి. నెల్లూరులో ప్రతి వంద మందిలో 14 మందికి పైగా అధిక రక్తపోటుతో బాధపడుతుండగా, కృష్ణా జిల్లాలో వంద మందికి 11 మంది ఉన్నట్టు ప్రభుత్వ సర్వేలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికంగా మధుమేహం, హైపర్ టెన్షన్లపై 8 జిల్లాల్లో పరీక్షలు నిర్వహించారు. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో బీపీ, మధుమేహ బాధితులు ఎక్కువున్నట్టు తేలింది. నెల్లూరు జిల్లాలో ప్రతీ వంద మందిలో 15 మందికి మధుమేహం ఉంది. కృష్ణ్లాలో ప్రతి వంద మందికి 11.2 మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారని స్పష్టమైంది. చిత్తూరులో అతి తక్కువ డయాబెటిక్ కేసులు నమోదయ్యాయి. వందకు కేవలం 4.95 మంది ఉన్నట్టు అధికార వర్గాలు తేల్చాయి. కృష్ణా జిల్లాలో 15.07 లక్షల మందికి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించగా 1,69,429 మందికి నిర్ధారణ అయ్యింది. నెల్లూరు జిల్లాలో ఇదే పరీక్షను 6.22 లక్షల మందికి నిర్వహించగా 98,953 మందికి నిర్ధారణ కావడం గమనార్హం.