మహిళలకు పనిప్రదేశాల్లో సమప్రాధాన్యం ఇవ్వాలి. మహిళలు, పురుషులు ఒకే అర్హతతో ఉంటే, ఇద్దరికీ సమాన వేతనం ఇవ్వాలి. బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో కచ్చితంగా మహిళలుండాలి. ఇవన్నీ ఎన్నో రోజులుగా పనిప్రదేశాల్లో వెల్లువెత్తుతున్న డిమాండ్లు. కానీ మగవారికి, ఏ మాత్రం తీసిపోకుండా మహిళలు చదువుకున్నా.. వారికి తగిన గౌరవమే కాదు, కనీసం తగిన వేతనం కూడా లభించడం లేదు. తాజాగా ప్రభుత్వం వెల్లడించిన సర్వేలో మగవారితో సమానంగా ఒకే విద్యార్హత ఉన్నప్పటికీ, మహిళలు 30 శాతం తక్కువ వేతనమే పొందుతున్నట్టు తెలిసింది. పట్టణ ప్రాంతంలో గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగి ఉన్న మహిళలు రోజుకు రూ.690.68 పొందుతుంటే, వారి కంటే 30 శాతం అధికంగా మగవారు రూ.902.45 ఆర్జిస్తున్నట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. వ్యవసాయరంగంలో కూడా మగవారికి తగ్గస్థాయిలో మహిళలు పనిచేస్తున్నప్పటికీ, వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని సర్వే తెలిపింది.
గ్రామాల్లో చదువుకోని మహిళలు రోజుకు రూ.88.2 వేతనం పొందుతుంటే, వారి కంటే 45 శాతం అధికంగా చదువుకోని మగవారు రూ. 128.52ను ఆర్జిస్తున్నట్టు వెల్లడైంది. అయితే కొన్ని రంగాల్లో మాత్రం మగవారి కంటే అధికంగా మహిళలే సంపాదిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగంలో పనిచేసే మహిళలు రోజుకు రూ.322 ఆర్జిస్తుంటే, వారి కంటే 13 శాతం తక్కువగా మగవారు రూ.279.15 పొందుతున్నట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. పట్టణ ప్రాంతంలో రవాణా, స్టోరేజ్ రంగాల్లో కూడా మహిళలే అధికంగా వేతనం పొందుతున్నారట. 15 నుంచి 59 ఏళ్ల మహిళలు, పురుషులుకు చెందిన సగటు రోజువారీ వేతనాలను తీసుకొని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ‘మెన్ అండ్ ఉమెన్ ఇన్ 2017’ రిపోర్టును రూపొందించింది.
ఈ రిపోర్టులోనే చదువుకోని వారి, చదువుకున్న వారి సంపాదనలను కూడా వెలువరించింది. చదువుకున్న మహిళలు, చదువుకోని మహిళల కంటే 5.8 సార్లు ఎక్కువగా సంపాదిస్తున్నారని రిపోర్టు పేర్కొంది. అలాగే చదువుకున్న మగవారు, చదువుకోని వారికంటే 3.6 సార్లు ఎక్కువగా ఆర్జిస్తున్నారని తెలిపింది. ఆశ్చర్యకరంగా చదువుకున్న తర్వాత కూడా మహిళలకు, పురుషులకు మధ్య వేతన చెల్లింపుల్లో చాలా వ్యత్యాసముంటుందని ఈ రిపోర్టు వెల్లడించింది. గ్రాడ్యుయేట్లు ఉన్నప్పటికీ మగవారి కంటే 24 శాతం తక్కువగా మహిళలు వేతనం పొందుతున్నారని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కువ వేతనం చెల్లించే రంగం నిర్మాణ రంగమని పేర్కొంది. మైనింగ్, క్వారింగ్‌లో మగవారికి ఎక్కువ వేతనాలు ఉంటున్నాయని రిపోర్టు చేసింది. అదే పట్టణ ప్రాంతాలకు వచ్చే సరికి మైనింగ్, క్వారింగ్ రంగాల్లో మగవారు ఎక్కువగా సంపాదిస్తుంటే, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ యుటిలిటీస్‌లో మహిళలు ఎక్కువ వేతనం పొందుతున్నారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment