రిలయన్స్ బోర్డులోకి అంబానీ వారసులు - ఆమోదం తెలిపిన షేర్ హోల్డర్స్
ఆయిల్ నుంచి టెలికామ్ వరకు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఈ సంస్థలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు వారి పిల్లలు కూడా ఒక్కో విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీ ముగ్గురూ కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ప్రారంభంలో వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన వారసత్వ ప్రణాళికను ఈ రోజు అధికారికం చేసింది. కంపెనీ బోర్డులో ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారులు ఆమోదించారు.
కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగటానికి షేర్ హోల్డర్ల నుంచి అంబానీ పిల్లలు ముగ్గురూ (ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ) వరుసగా 98.21 శాతం, 98.06 శాతం, 92.75 శాతం ఆమోదం పొందారు.
ఇదీ చదవండి: ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే..
ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లు
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లపాటు నిర్వహించనున్నారు. నీతా అంబానీ పదవీ విరమణ తరువాత కూడా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. దీనికి రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి ఆమోదం లబించింది.