ఫేస్బుక్ యుద్ధం!
బెంగళూరు: కర్ణాటకేతరులు కర్ణాటక రోడ్డు రవాణా శాఖపై ఫేస్బుక్ యుద్ధం చేశారు. ఇప్పుడు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు చట్టాల పేరుతో కర్ణాటకేతరుల వాహనదారులపై పన్ను మీద పన్ను వేసి వెన్ను వారి విరుస్తున్నారు. వాహనాన్ని కొన్న రాష్ట్రంలో అన్ని రకాల పన్నులు చెల్లించినా, కర్ణాటకలోకి ఆ వాహనం ప్రవేశించగానే మళ్లీ పన్నులు విధిస్తున్నారు. పన్ను చెల్లించకపోతే వాహనాన్ని తీసుకుపోతామని బెదిరిస్తున్నారు. ఉద్యోగులైతే వారి ఐడి కార్డులు తీసుకుని ఇచ్చేది లేదంటున్నారు. ఈ రకంగా వారిని అన్ని రకాలుగా వేధిస్తున్నారు.
ఏదైనా పనులపై కొద్ది కాలంపాటు కర్ణాటకకు వచ్చే వారితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వారం, పది రోజుల పాటు నగరంలో గడపడానికి వచ్చే వారు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. బాధితులలో కొందరు ఫేస్ బుక్ పేజీ తెరిచారు. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వేలాది మంది కర్ణాటకేతరులు ఫేస్బుక్లో తమ బాధలు వెళ్లడించి రోడ్డు రవాణా సంస్థపై యుద్ధం చేశారు. ఫలితంలేదు. దాంతో ఫేస్ బుక్ పేజీ ద్వారా అందరూ ఒక్కటిగా ఏర్పడ్డారు. కర్ణాటక రోడ్డు రవాణా శాఖపై న్యాయ పోరాటాన్ని ప్రారంభించారు. సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కర్ణాటక రోడ్డు రవాణా శాఖను ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం ఈనెల 10న విచారణకు రానుంది.
***