ఎయిర్ ఇండియా వివాదాస్పద నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రతిష్ట అంతకంతకూ మసకబారుతోంది. నష్టాల్లో కూరుకుపోయిన ‘మహారాజా’ ఎయిర్ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారాన్ని రద్దు చేసింది. కేవలం శాకాహారమే ఇవ్వాలని నిర్ణయించింది. కాస్ట్ కట్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
నష్టాల ఊబిలో ఇరుక్కున్న ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాకు రంగం సిద్ధమైంది. మరోవైపు ఇపుడు ఎయిర్ఇండియా ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ముఖ్యంగా దేశీయ విమానాల్లో మాంసాహార భోజనం ఉండదని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో పేర్కొంది. వ్యర్థాలు, ఇతర వ్యయాలు తగ్గించడం, క్యాటరింగ్ సేవలను మెరుగుపరుచుకోవడం వంటివి చర్యలు తప్పనిసరని ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనీ లోహని చెప్పారు. ఎకానమీ క్లాస్ విమానాల్లో వెజిటేరియన్ ఆహారం మాత్రమే అందించనున్నామన్నారు. అయితే అంతర్జాతీయ విమానాల్లో మాత్రం నాన్‌వెజ్ కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ విమానాల్లో నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ వేస్ట్ అవుతోందని తెలిపింది. ఈ చర్య మూలంగా తమకు ఏడాదికి 7-8 కోట్లు ఆదా అవుతుందని ఎయిరిండియా వెల్లడించింది.
కాగా ఎయిరిండియా ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పుల భారంతో కుదేలైంది. ఈ నేపథ్యంలో ఈ నేషనల్ కారియర్‌ను వదిలించుకునే పనిలో ఉంది ప్రభుత్వం. ఎయిరిండియాలో వాటా అమ్మకానికి కేంద్ర క్యాబినెట్ సూత్రం ఆమోదంకూడా లభించింది. మరోవైపు ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా కొనుగోలు ప్రయివేట్ ఎయిర్‌లైన్స్ ఇండిగో సంసిద్ధతను వ్యక్తం చేయగా, టాటా గ్రూపు కూడా ఈ రేసులో ఉన్నట్టు నివేదికలు వెలువడుతున్నాయి.
అయితే ఈ నిర్ణయంపై ఎయిర్ ప్యాసెంజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి మహేష్ వై రెడ్డి నుంచి విమర్శలు గుప్పించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాసెంజర్ సర్వే నిర్వహించాలని కోరారు.