north coastal andhra
-
ధర్మాన మాటల్ని వక్రీకరించి.. సోషల్ మీడియాలో గోల..
ఇన్నాళ్లకొకరు (ధర్మాన ప్రసాదరావు) ఉత్తరాంధ్ర వివక్ష మీద గొంతు విప్పి మాటాడేరు. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటు చేయకుంటే కనీసం మా ఉత్తరాంధ్ర ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. అలా అయితే ఉత్తరాంధ్రకు గల సహజవనరుల సాయంతో, ఆర్థిక కేటాయింపులతో, పాలనా ఏర్పాటుతో... ఏ నగరానికీ లేని ఓడరేవు, విమానాశ్రయం; భారీ, మధ్యతరగతి పరిశ్రమలతో మహానగరంగా ఎదగాల్సిన విశాఖను రాజధానిగా చేసి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తామని రాజకీయ ప్రకటన చేశారు. విశాఖను పాలనా రాజధాని చేయాలన్నదే ప్రసాదరావు కోరుకునేది. అది మరింత బలంగా విన్పించడానికి విశాఖను పాలనా రాజధానిగా చేయకపోతే, కనీసం ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనన్నారు తప్పా ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనేమీ అనలేదు. అయినా ప్రసాదరావు మాటల్ని వక్రీకరించి, ఒక్కదాన్నే పట్టుకొని సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. నిజానికి ప్రసాదరావు ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేస్తే బాగుండేది. అయినా, ఈ సందర్భంలో ప్రసాదరావు ఆమాత్రం అనడం ఘనతే! ఇప్పటిదాకా ఇలాంటి ప్రకటనలు ఉత్తరాంధ్ర పౌరసమాజం నుండి అరాకొరా (కె.ఎస్.చలం, నల్లి ధర్మారావు, అట్టాడ అప్పల్నాయుడు తది తరులు) వచ్చేయి తప్పా రాజకీయశక్తుల నుంచి రాలేదు. పాలకవర్గ పార్టీల నుంచీ రాలేదు, కమ్యూనిస్టు, విప్లవకారుల నుంచీ రాలేదు. చాలా ఆశ్చర్యంగా ధర్మాన ప్రసాదరావు ప్రకటనపై విచ్చిన్నకారుడు, సమైక్య వ్యతిరేకి వంటి వ్యక్తిగత దాడి మాత్రమే కాక ప్రసాదరావు రాజకీయ ప్రయాణాన్నీ, ఆ ప్రయాణంలో ఉత్తరాంధ్రకు అతను చేసినదేమిటీ, ఇపుడెందుకిలా ప్రకటించాడంటూ... ఉత్తరాంధ్రేతరులే కాక ఉత్తరాంధ్రులూ ప్రశ్నిస్తున్నారు. విచిత్రంగా ఒక్క నల్లి ధర్మారావు తప్పా, ఉత్తరాంధ్ర గురించి తొలినాడు గొంతు విప్పిన కె.ఎస్. చలం గానీ ఇంకెవరుగానీ ఇపుడేమీ మాటాడడం లేదు. స్పందనా రాహిత్యం ఉత్తరాంధ్ర స్వభావంలోకి ఇంకిపోయినట్టుంది. తొలి తరం రచయితలు తప్పా వర్తమాన రచయితలెవరికీ ఉత్తరాంధ్ర జీవన సంక్షోభానికి కారణమయిన రాజకీయార్థిక విషయాలమీద అవగాహనా లేదు, ఆసక్తీ లేదు. అణు విద్యుత్ వ్యతిరేక పోరాటం, నిర్వాసితుల పోరాటాలు, విశాఖ ఉక్కు కర్మాగార కార్మిక పోరాటం వంటివాటిని వీరు సాహిత్యీకరించలేదు. అటు రచయితలుగానీ, ఇటు మేధావులుగానీ ఉత్తరాంధ్ర వివక్షమీద ప్రాంతీయవాద దృష్టితో స్పందించటం లేదు. విశాఖలో స్థిరపడిన (వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయాలు చేసి) వారు ఉత్తరాంధ్ర గురించి వ్యాఖ్యానిస్తుంటారు, ఉత్తరాంధ్రుల తరఫున బాధ్యత తీసుకుంటారు. రాజకీయాల్లో, సాహిత్య, సాంస్కృతికాంశాల్లో ఉత్తరాంధ్రపై వివక్ష చూపి, ‘వెనక బడిన జిల్లా’ అనే టాగ్ తగిలించి సానుభూతి చూపుతారు ఉత్తరాంధ్రేతరులు. పాతిక లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా ఎనిమిదిలక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పటికీ సాగునీరు అందుతోంది. నాగావళి, వంశధార వంటి పద్దెనిమిది నదులూ, అధిక వర్షపాతం వల్ల అయిదువందల టీఎంసీల నీరు లభ్యమవుతున్నా... సాగునీరందించే ప్రాజెక్టులు పూర్తికాక పోవటంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతోన్నవి. వ్యవసాయాధార పరిశ్రమలు లేక, ఉన్నవి మూత పడి ఇటు రైతులూ, అటు కార్మికులూ నష్ట పోతున్నారు. ఉపాధుల్లేక ఏటా ఏభయి వేలమంది ఇక్కడినుంచి వలసలు పోతున్నారు. వలసల నివారణకుగానీ, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకుగానీ, విశాఖ వంటి నగరంలోని పరిశ్రమలను అభివృద్ధి చేయడానికిగానీ ప్రత్యేక రాజకీయ నిర్ణయాలు, ఆర్థిక కేటాయింపులూ, అధికార యంత్రాంగమూ ఉండాలి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు ఒనగూరలేదు. ప్రత్యేక రాష్ట్ర మయితే ఒనగూరే అవకాశాలుంటాయి, ఒనగూరకపోతే కనీసం వీటికోసం తమదయిన ప్రాంతంలో ప్రజలు ఉద్యమించగలరు. పాలనా యంత్రాంగాన్ని ప్రభావితం చేయగలరు. సమగ్ర ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రమనేది ఉపకరిస్తుందే తప్పా నష్టపెట్టదు. గనక ధర్మాన ప్రసాదరావేమీ విచ్చిన్నకారుడు కాడు, వారి ప్రకటనేమీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడలో భాగం కాదు. ఉత్తరాంధ్రుల లోలోపలి భావాన్నే ప్రసాదరావు పలికేరు. ఇపుడు కాకపోతే మరొకప్పుడయినా ఉత్తరాంధ్ర తన లోలోపలి ఆకాంక్షను కోటిగొంతులతో బహిరంగ పరచగలదు! (క్లిక్ చేయండి: అనూహ్య వ్యూహం ‘గృహ సారథి’) – వంశధార సూరి, శ్రీకాకుళం -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. అనంతరం ఉత్తర ఒడిశాకు ఆనుకుని పశ్చిమ, వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనించింది. ఆదివారం రాత్రికి జార్ఖండ్ వైపుగా వెళ్లి జంషెడ్‌పూర్‌కు 70 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం వరకు ఈ వాయుగుండం అదే దిశలో కదులుతూ.. అదే తీవ్రతను కొనసాగిస్తుందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం జార్ఖండ్ వైపు మళ్లడంతో దాని ప్రభావం రాష్ట్రం పైన, ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తగ్గిందని తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. -
ఉత్తర కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని పేర్కొంది. 11వ తేదీ సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే సూచనలున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులెవ్వరూ ఆంధ్ర, ఒడిశా తీరం వెంబడి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా, గడిచిన 24 గంటల్లో గుడివాడలో 11 సెం.మీ, కైకలూరులో 9, విజయవాడ, పాలేరు బ్రిడ్జిలో 8, గుంటూరు, వేలేరుపాడులో 6, నందిగామ, మంగళగిరిలో 5, భీమడోలు, అవనిగడ్డ, లామ్, విశాఖపట్నంలో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని ఇక్కడి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిమీ ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో.. ► ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆదివారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో రానున్న రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. ► తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ► ఉత్తర బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ► రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. ► సహాయక చర్యల కోసం రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలనూ సిద్ధం చేశామన్నారు. ‘ముసురు’కున్న రాష్ట్రం పలు జిల్లాల్లో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ముసురేసింది. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరరామచంద్రాపురంలో 10 సెంమీ, కూనవరంలో 8, కుక్కునూరు, వేలేరుపాటు, చింతూరులో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
చంద్రబాబు పర్యటన రద్దు వెనుక..
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జనవరి 2, 3 తేదీల్లో విజయనగరం జిల్లాలో పర్యటించాలని తొలుత చంద్రబాబు నిర్ణయించారు. జీఎన్ రావు కమిటీ మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో టీడీపీ అవలంభిస్తున్న వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ తీరుపై సొంత పార్టీ నేతలతో పాటు మేధావులు, ప్రజలు మండిపడుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలన్న ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని పార్టీ నాయకులు స్వయంగా ఆయనతో చెప్పారు. ఈ సమయంలో పర్యటనకు రావడం మంచిది కాదని చంద్రబాబుకి చెప్పడంతో ఆయన పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఉత్తరాంధ్ర నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. (విశాఖకే తమ్ముళ్ల ఓటు) కాగా, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్న ప్రతిపాదనకు మద్దతుగా విశాఖ జిల్లా టీడీపీ నాయకులు తీర్మానించడం రాష్ట్ర నాయకత్వానికి ముందరి కాళ్ల బంధంలా మారింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, కొండ్రు మురళి సహా ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్న ప్రతిపాదనను గట్టిగా సమర్థించారు. దీంతో అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. అధికార వికేంద్రీకరణకు ఆయనను ఒప్పించేందుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు ఒప్పుకోకపోతే పార్టీని వీడేందుకు కూడా వెనుకాడబోమని కొంత మంది సీనియర్లు సూచనప్రాయంగా వెల్లడించడం గమనార్హం. (ఆ విషయం చంద్రబాబుకూ తెలుసు) -
ఉత్తరాంధ్ర కకావికలం
-
విలయం.. విధ్వంసం
* హుదూద్ బీభత్సం * ఉత్తరాంధ్ర కకావికలం * విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద * ఆదివారం మధ్యాహ్నం తీరం దాటిన పెను తుపాను * 195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల బీభత్సం.. విశాఖ నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం * వేల సంఖ్యలో నేలకూలిన వృక్షాలు, స్తంభాలు... కుప్పకూలిన ఇళ్లు... కొట్టుకుపోయిన రోడ్లు * విశాఖ విమానాశ్రయం ధ్వంసం.. దెబ్బతిన్న ఫిషింగ్ హార్బర్... స్తంభించిన రాడార్ వ్యవస్థ * సహాయ చర్యల్లో ప్రభుత్వ అధికార వ్యవస్థ విఫలం * ఉత్తరాంధ్రలో ముగ్గురు, ఒడిశాలో మరో ముగ్గురు దుర్మరణం... వేలాది మంది నిరాశ్రయులు హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తోంది. తుపాను కేంద్రానికి అతి సమీపంలోనే ఉన్న విశాఖ నగరాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య విశాఖపట్నం సమీపంలో తీరం దాటిన హుదూద్ పెను తుపాను.. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో ఈ సముద్ర తీర నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రికి గాలుల వేగం 120 కిలోమీటర్లకు తగ్గినప్పటికీ.. కుంభవృష్టి తోడవటంతో విశాఖ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. విద్యుత్ సరఫరా లేక అంధకారంలో, సమాచార వ్యవస్థ లేక.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియని, తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆదివారం రాత్రి వారికి కాళరాత్రిగానే మారింది. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తంగా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. తుపాను విధ్వంసంలో ఉత్తరాంధ్రలో ముగ్గురు మృతిచెందారని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా వందలాదిమంది క్షతగాత్రులయ్యారు. ప్రాణనష్టం తక్కువగా ఉన్నప్పటికీ ఆస్తినష్టం అంచనాలకు అందని రీతిలో ఉంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు, టెలికమ్యూనికేషన్ టవర్లు నేలకొరిగాయి. భారీ సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీరమంతటా రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ లక్షలాది ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నష్టం ఎంత ఉంటుందన్నది ప్రభుత్వ యంత్రాంగానికే అంతుచిక్కడం లేదు. అసలు.. తుపానును ఎదుర్కొనేందుకు, నష్ట నివారణకు మూడు రోజులుగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కీలక సమయంలో చేతులెత్తేసింది. తుపాను విలయంలో చిక్కుకున్న లక్షలాది మంది సహాయం కోసం హాహాకారాలు చేస్తున్నా సర్కారు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. సాక్షి, విశాఖపట్నం: భయపడినంతా అయ్యింది. మూడు రోజులుగా తీవ్ర పెను తుపానుగా రూపుదాల్చి ఉగ్రంగా ఉరుముతున్న ‘హుదూద్’.. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలపై విరుచుకుపడింది. శనివారం రాత్రికి విశాఖపట్నానికి 210 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉన్న హుదూద్ స్థిరంగా పయనిస్తూ ఆదివారం ఉదయం తీరానికి సమీపంలోకి చేరుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచే తుపాను విధ్వసం పెరుగుతూ వస్తోంది. ఉదయం 11 గంటల 25 నిమిషాలకు విశాఖపట్నం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో పశ్చిమవాయవ్య దిశలో (పూడిమడక వద్ద) తీరాన్ని తాకింది. 11 గంటల 40 నిమిషాలకు తుపాను కేంద్రం (కన్ను) తీరాన్ని దాటింది. తీరాన్ని తాకే ముందు కొద్దిసేపు ప్రశాంతత కనబరిచిన తుపాను.. తీరానికి వస్తూనే మహోగ్రంగా పంజా విసిరింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా విశాఖ నగరంలో కనివినీ ఎరుగని తుపాను విధ్వంసం సృష్టించింది. శనివారం రాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో నగరమంతా అంధకారంలో మునిగిపోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మొదలైన విధ్వంసం ఆదివారం ఉదయానికి పతాకస్థాయికి చేరుకుంది. తుపాను గాలులకు ఇళ్ల తలుపులు, కిటికీలు కొట్టుకుని విరిగిపోతుంటే లక్షలాదిమంది రాత్రంగా కంటి మీద కునుకులేకుండా బితుకుబితుకుమని గడిపారు. తెల్లవారుజాము నుంచి 150 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న పెనుగాలులు సృష్టించిన విధ్వంసం మాటలకు అందనిది. తుపాను విశాఖపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉండగా పెనుగాలులు ఏకంగా 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాయి. రాత్రి నుంచీ ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు, సెల్‌ఫోన్ టవర్లు కూలిపోతుండటంతో సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. విద్యుత్ లేకపోవటంతో టీవీలు పనిచేయక.. సమాచార వ్యవస్థ స్తంభించిపోవటంతో ఫోన్లన్నీ మూగపోయి.. తుపానుకు సంబంధించిన సమాచారం తెలియక జనం తల్లడిల్లిపోయారు. ఇళ్ల చుట్టూ వృక్షాలు, స్తంభాలు కూలిపోతుండటం.. రేకులు, పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోతుండటంతో బయటకు అడుగు పెట్టే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య తుపాను తీరాన్ని దాటే సమయంలో పెను గాలుల వేగం 180 కిలోమీటర్ల నుంచి 195 కిలోమీటర్లను కూడా దాటిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ గాలుల తీవ్రతకు.. వందేళ్లుగా ఉన్న భారీ వృక్షాలతో సహా వేలాది చెట్లు కూకటి వేళ్లతో సహా నేలకొరిగిపోయాయి. వేలాది విద్యుత్తు స్తంభాలు, టెలిఫోన్ టవర్లు కూలిపోయాయి. తుపాను కారణంగా సముద్రం ఉప్పొంగి అలలు నాలుగు మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి. నిత్యం సందర్శకులతో కళకళలాడే విశాఖ నగరంలోని సుందరమైన రామకృష్ణ బీచ్ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. విశాఖ విమానాశ్రయం దాదాపుగా ధ్వంసమైంది. తీరంలోని ఫిషింగ్ హార్బర్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. పురాతనమైన విశాఖపట్నం కలెక్టరేట్ భవనం కూడా ధ్వంసమైంది. ఇక్కడ నుంచి సహాయక చర్యలు కూడా ఆగిపోయాయి. వర్షం ఆగితేగానీ సహాయక చర్యలు చేపట్టడం వీలుకాదని విశాఖపట్నం జిల్లా అధికారులు పేర్కొన్నారు. నగరంలోని దుకాణ సముదాయాలు భారీగా దెబ్బతిన్నాయి. తుపాను తీరం తాకే సమయంలో భారీ వర్షాలు లేనప్పటికీ.. ఆ తర్వాత వర్షాలు పుంజుకున్నాయి. గాలుల వేగం క్రమంగా 120 కిలోమీటర్లకు తగ్గగా.. వాటికి కుండపోత వర్షాలు తోడయ్యాయి. దీంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా విధ్వంసం కొనసాగుతోంది. ఒకవైపు గాఢాంధకారం.. మరోవైపు పెను గాలులు.. వాటికి తోడు ఎడతెరిపిలేని అతి భారీ వర్షాలు.. ఈ పరిస్థితుల నుంచి ప్రాణాలతో బయటపడతామా లేదా అన్న భయాందోళనలు విశాఖ ప్రజల్లో అలముకున్నాయి. ఉత్తరాంధ్ర అంతటా విధ్వంసం... ఒక్క విశాఖ నగరంలోనే కాదు.. తుపాను ప్రభావ ప్రాంతమైన ఉత్తరాంధ్ర అంతటా ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భారీ ఘీంకారంతో పెనుగాలులు వీస్తుంటే ప్రజానీకం నిలువునా వణికిపోయింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని రోడ్లు, సమాచార, విద్యుత్తు, రవాణా వ్యవస్థలు మొత్తం ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో 44 మండలాలు హుదూద్ విలయంలో చిక్కుకున్నాయి. 320 గ్రామాల్లోని మూడు లక్షల మందికిపైగా ప్రజలు దిక్కులేని దీనస్థితిలో పడిపోయారు. 1,35,262 మందిని 223 పునరావాస శిబిరాల్లోకి తరలించారు. మిగిలిన దాదాపు 1,40 లక్షల మందిని పట్టించుకునే నాథుడు లేక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. వందకు పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎక్కడ ఏం జరుగుతోందో, ఎవరికి ఏ ఆపద వచ్చిందో తెలియక అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. 12.40 సెం.మీ. నుంచి 24.50 సెం.మీ. వరకు భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ‘నష్టం అంచనాలకు అందనిది. ఊహించిన దానికంటే ఆస్తి, పంట నష్టం చాలా అధికంగా ఉంటుంది’ అని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. రెండు జిల్లాల్లో ముగ్గురు మృతి హుదూద్ ధాటికి చెట్లు, స్తంభాలు మీదపడి ఉత్తరాంధ్రలో ముగ్గురు దుర్మరణం చెందారు. విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొండ్రాం గ్రామానికి చెందిన జి.పంచవతి (50), పద్మనాభం మండలం బి.ఆర్.పాలవలసకు చెందిన ఎం.యర్రయ్య (58) చెట్లు పైన పడటంతో దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన గంటా యోగానందం (45) కూడా భారీ వర్షాల దాటితో విద్యుత్తు స్తంభం కిందపడి ప్రాణాలు విడిచారు. వేలాది ఇళ్లు నేలమట్టం ఉత్తరాంధ్రలో వేలసంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. అనేకచోట్ల పాత భవనాలు కూలిపోయాయి. విశాఖ నగరంలో రెండు భవనాలు నేలలోకి కుంగిపోయాయి. వందకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లెక్కకుమిక్కిలి ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. ఉత్తరాంధ్ర సముద్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వినియోగించే మరబోట్లు వందకు పైగా ధ్వంసమయ్యాయి. ఒక్కో బోటు ధర సగటున రూ. 25 లక్షలు ఉంటుంది. మరో 300 బోట్లు వరకు స్వల్పంగా దెబ్బతిన్నాయి. చేపల షెడ్లు, బోట్లు, వలలు కొట్టుకుపోయాయి. లక్షల ఎకరాల్లో పంట ధ్వంసం ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. పెనుగాలులు, భారీవర్షాలతో వరి, జీడి, అరటి, కూరగాయలు తదితర పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. పంటలకు ఎంత నష్టం వాటిల్లిందన్నది వారం రోజుల తరువాత లెక్కతేల్చగలమని అధికారులు చెబుతున్నారు. పశు సంపదకు సైతం అపారనష్టం కలిగింది. ఎన్ని పశువులు మృత్యువాత పడ్డాయన్నది రెండు రోజులు గడిస్తేగానీ చెప్పలేని స్థితి నెలకొంది. విశాఖకు మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు న్యూఢిల్లీ: హుదూద్ తుపాను విశాఖ వద్ద తీరం దాటడంతో.. అక్కడి తమ దళాలను ఎన్డీఆర్ఎఫ్ రెట్టింపు చేసింది. మెుత్తం 13 బృందాలు విశాఖపట్నంలో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొననున్నారుు. వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం విశాఖ విమానాశ్రయం, ఫిషింగ్ హార్బర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. తుపాను హెచ్చరికల కేంద్రంలోకే నీళ్లు వచ్చేశాయి. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. వందల కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైపోయాయి. భారీ వృక్షాలు, హోర్డింగులు కూలిపోవడంతో అనేక మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రైలు ట్రాక్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్తు వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. వేల సంఖ్య లో స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరి గాయి. వీటి పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడుతుందన్నది చెప్పలేని స్థితి నెలకొంది. ఈపీడీసీఎల్ పరిధిలోని సిబ్బంది ఏమాత్రం సరిపోరు. అందుకే ఎస్పీడీసీఎల్ నుంచి వెయ్యిమంది నిపుణులను పంపించాలని నిర్ణయించారు. -
'భారత్-విండీస్ వన్డేను అడ్డుకుంటాం'
విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియం వద్ద ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్యవేదిక సభ్యులు ఆందోళన చేపట్టారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేకహోదా కల్పించకుంటే ఈనెల 14న ఇక్కడ జరగనున్న భారత్-వెస్టిండీస్ వన్డే మ్యాచ్ ను అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన హామీయిచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. భారత్-విండీస్ మూడో వన్డే విశాఖపట్నంలో జరగనుంది. ఆందోళనకారులు హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు మ్యాచ్ జరుగుతుందో, లేదోనని క్రికెట్ అ భిమానులు ఆందోళన చెందుతున్నారు. -
రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో భారీ వర్షాలు
విశాఖపట్నం: ఉత్తరకోస్తా, విదర్భ, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. అల్పపీడన పరిసర ప్రాంతాలలో ఉపరితల అవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. దాంతో రాగల 24 గంటల్లో ఉత్తరకోస్తా, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హచ్చరించింది. -
బలపడుతున్న అల్పపీడనం
బలమైన ఈదురుగాలులు ఉత్తర కోస్తాకు భారీవర్ష సూచన సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి పూర్తిస్థాయి అల్పపీడనంగా మారుతుందని విశాఖలోని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా మధ్య కొనసాగుతున్న దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదరుగాలులు వీస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీవర్షాలు, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆదివారం ఉదయం వరకు కోస్తాలో సాలూరు, పాడేరుల్లో 3 సెం.మీ., చింపతల్లి, అరకు వ్యాలీ, శృంగవరపుకోట, పోలవరం, మెంటాడ, బొబ్బిలిల్లో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తెలంగాణలో ్లభూపాలపల్లిలో అత్యధికంగా 7 సెం.మీ., పేరూరు, వెంకటాపురం, ఏటూరునాగారంలలో 6 సెం.మీ., చింతూరు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, వెంకటాపూర్, ఖానాపూర్, చెన్నూర్, మంథని, కాళేశ్వరంలలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.