మా క్షిపణులతో చైనాను రౌండప్ చేసేస్తాం!
బీజింగ్: నానాటికి దూసుకుపోతున్న చైనాకు చెక్ పెట్టేవిషయంలో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వైఖరి వెల్లడించే రహస్య సంభాషణ ఒకటి వెలుగుచూసింది. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలను చైనా నిలువరించకపోతే.. ఆ దేశాన్ని తమ క్షిపణి రక్షణ వ్యవస్థతో చుట్టుముట్టేస్తామని హిల్లరీ క్లింటన్ ఓ ప్రైవేటు సంభాషణలో పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఆమె అమెరికా అధ్యక్షురాలైతే.. చైనాపై ఏ విధమైన వైఖరి అవలంబించనున్నారో ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న హిల్లరీ ప్రచార చైర్మన్ వ్యక్తిగత ఈమెయిల్‌ను హ్యాక్ చేసి.. ఆ వివరాలను వీకీలీక్స్ తాజాగా వెల్లడించింది. ఈ ఈమెయిల్స్‌లో హిల్లరీ ప్రైవేటు సంభాషణలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాలతోపాటు పలు ఇతర పత్రాలు ఉన్నాయి. వీటిని వెల్లడించడానికి హిల్లరీ ఇన్నాళ్లు నిరాకరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. హిల్లరీ అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు చైనీస్ అధికారులను ఎలా ఎదుర్కొన్న అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఉత్తర కొరియా ఈ ఏడాది ఐదోసారి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఆ దేశానికి వ్యతిరేకంగా క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరించాలని అమెరికా, దక్షిణ కోరియా భావిస్తుండగా.. ఈ చర్యను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, ఉత్తర కొరియా క్షిపణి ముప్పును నివారించడానికి అమెరికా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో మరిన్ని మిలిటరీ నౌకలను మోహరిస్తుందని చైనా అధికారులకు తాను స్పష్టం చేసినట్టు హిల్లరీ 2013లో ప్రైవేటుగా ఇచ్చిన ఓ ఉపన్యాసంలో వెల్లడించారు. 'ఉత్తర కొరియా విజయవంతంగా బాలిస్టిక్ క్షిపణులను పొందితే.. అది పసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాలకు ముప్పుగా మారుతుంది. అంతేకాకుండా అమెరికా పశ్చిమ తీరమైన హావాయ్ను ఆ క్షిపణులు ఢీకొట్టగలవు' అని క్లింటన్ పేర్కొన్నారు. "మేం చైనాను క్షిపణి రక్షణ వ్యవస్థను చుట్టుముట్టబోతున్నాం. ఆ ప్రాంతంలో మరింత నౌకాదళాన్ని మోహరించబోతున్నాం. చైనా.. నువ్వు వారిని (ఉత్తరకొరియా)ను నియంత్రించు.. లేదా మేం వారికి వ్యతిరేకంగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని ఆమె పేర్కొన్నారు.
వరుసగా అణ్వాయుధ పరీక్షలు చేపడుతూ.. అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తరకొరియాకు ఏకైక జీవనాధారంగా చైనా అండగా నిలబడుతోంది. ఆ దేశానికి సన్నిహిత దౌత్య, మిత్ర దేశంగా చైనా అన్ని రకాల సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాను చైనా నిలువరించడం లేదంటూ ఆ దేశంపై అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.