గారడీకాదు.. నిజం.. ముక్కులోంచి నోట్లోకి
ఇస్లామాబాద్: గారడీ కాదు, కనికట్టు అంతకన్నా కాదు... సజీవంగా ఉన్న పామును ముక్కులోంచి పంపించి, నోటి ద్వారా బయటికి తీస్తున్న వైనం ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్ కరాచీకి చెందిన ఇక్బాల్ చేస్తున్న ఈ సాహస ప్రదర్శన ఇపుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది.
పాములతో గారడీ చేయడం వాటిని ఒడుపుగా ఆడించడం మనకు తెలిసిందే. కానీ ఇక్బాల్ ప్రమాదకర ప్రదర్శన మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఓ పాము కాటు అతని జీవితాన్ని మార్చి వేసింది. పాముకాటుతో మూడు రోజుల పాటు మృత్యువు పోరాడిన ఇక్బాల్ సర్పాలతోనే ఈ సాహసం చేస్తున్నాడు. నిరంతరం అపాయకరమైన విద్యను ప్రదర్శిస్తూ, తన వృత్తిగా మలుచుకున్నాడు. బతికున్న పామునే ముక్కులోంచి లోపలికి పంపించి తిరిగి నోటి ద్వారా బయటికి తీస్తున్నాడు.
'భయంకరమైన విష సర్పం నన్ను కాటేసినప్పుడు వెంటనే స్పృహ కోల్పోయా... మూడు రోజుల పాటు మత్యువుతో పోరాడాను. ఆ సమయంలో మా టీచర్ నాకు ఈ విద్య నేర్పారు. అప్పటి నుంచి ఇలా కొత్త జీవితాన్ని ప్రారంభించాను' అంటూ చెప్పుకొచ్చాడు. ముగ్గురు కొడుకులు, అయిదుగురు ఆడపిల్లలు ఉన్న తన కుటుంబాన్ని పోషించుకునేందుకు గత 12 సంవత్సరాలుగా ఈ వృత్తి మీదనే ఆధారపడ్డానని చెప్పాడు. ఇది ప్రమాదకరం అని తెలిసినా.. తనకు వేరే గత్యంతరం లేదంటున్నాడు. ప్రతి ప్రదర్శనకు ముందు తను బతకాలని ఆ దేవుడ్ని కోరుకుంటానని, తన ప్రతిభను గుర్తించి ఆదుకోవాలని కోరుకుంటున్నాడు.