not attending
-
ప్రమాణస్వీకారానికి... మిషెల్ దూరం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మాజీ ప్రథమ మహిళా మిషెల్ ఒబామా దూరంగా ఉండనున్నారు. ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నా 150 ఏళ్ల సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ మిషెల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా మిషెల్ హాజరు కాని విషయం తెలిసిందే. దాంతో ఒబామా దంపతులకు విభేదాలొచ్చాయని, త్వరలో విడాకులు తీసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వారి సన్నిహిత వర్గాలు ఈ వార్తలను ఖండించాయి. ఫేక్ నవ్వులు నవ్వలేకే ప్రమాణ స్వీకారానికి మిషెల్ దూరంగా ఉంటున్నారని తెలిపాయి. ఆమెతో పాటు డెమొక్రాట్లు నాన్సీ పెలోసీ, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టేజ్ తదితరులు కూడా ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరవడం లేదు. నాలుగేళ్ల కిందట జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కూడా గైర్హాజరవడం తెలిసిందే. తద్వారా వైట్‌హౌస్ సంప్రదాయాన్ని ఆయన ఉల్లంఘించారు. -
అధికారులు రాకుంటే సమస్యల పరిష్కారమెలా?
గ్రీవెన్స్‌కు అధికారుల డుమ్మాపై ఎమ్మెల్యే రాజేశ్వరి ఆగ్రహం మెమోలు జారీచేయాలని ఆదేశం చింతూరు : ఐటీడీఏలో ప్రతి బుధవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు అధికారులు హాజరుకాకపోతే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతూరు ఐటీడీఏ వద్ద బుధవారం నిర్వహించిన మీకోసం ప్రజాసమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎంతోదూరం నుంచి ఐటీడీఏకు వస్తుంటే అధికారులు లేకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గైర్హాజరైన అధికారులకు వెంటనే మెమోలు జారీ చేయాలని ఆమె ఆదేశించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించేందుకు అధికారులంతా కృషి చేయాలని సూచించారు. ఇకపై ప్రతి బుధవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు తాను వచ్చి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని ఆమె పేర్కొన్నారు. అందిన ఫిర్యాదులపై ఆరా? ఇప్పటి వరకు నిర్వహించిన గ్రీవెన్స్లలో ఎన్ని ఫిర్యాదులు అందాయి? వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయో తనకు పూర్తి నివేదిక అందించాలని ఎమ్మెల్యే రాజేశ్వరి ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రీవెన్స్‌కు వచ్చిన లబ్దిదారుల సమస్యలను స్వయంగా తెలుసుకుని వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకొస్తే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు. అంగన్వాడీ వర్కర్ల, రోజువారీ పనివారి పెండింగ్ వేతనాలు, బిల్లులను త్వరితగతిన మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సీడీపీవోలను ఎమ్మెల్యే ఆదేశించారు. చింతూరు ఐటీడీఏ ఏర్పడి ఆరు నెలలైనా ఇంతవరకు రెగ్యులర్ పీవోను నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పీవో లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా పీవోను నియమించి గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.