'తూటాలు కాదు.. పుస్తకాలు కావాలి'
'యుద్ధ సామగ్రి కోసం చేసే ఖర్చును ఒక్కవారం పాటు పుస్తకాలపై చేయండి. ప్రపంచంలోని చిన్నారులంతా 12 ఏళ్లపాటు ఉచితంగా చదువుకుంటారు' అని ప్రపంచ నేతలను కోరారు మలాలా యూసఫ్ జాయ్. 'తూటాలు కాదు.. పుస్తకాలు కావాలి' అంటూ ఈ పాకిస్తానీ బాలిక చేసిన నినాదానికి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇంతలా ప్రపంచ దేశాలను ప్రభావితం చేసిన మలాలాను స్వదేశంలో ఇప్పటికీ విమర్శిస్తుంటారు. అంతర్జాతీయ వేదికలపై తమ దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతోందని.. ఇంతకీ మలాలా నేపథ్యం ఏంటి?
అతి పిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్న మలాలా.. ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ కూడా. బాలికల విద్యపై నిరంతర పోరుతో ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఖ్యాతిని ఆర్జించింది. నిత్యం తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లే పాక్ ఆమెకు భద్రత కల్పించలేకపోవడంతో ప్రవాస పాకిస్తానీగా బ్రిటన్‌లో నివసిస్తోంది. అక్కడే చదువుకుంటూ ఉద్యమకారిణిగానూ రాణిస్తోంది.
బాల్యం..
1997 జూలై 12న పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో మలాలా జన్మించింది. సంప్రదాయ సున్నీ కుటుంబానికి చెందిన ఈమెకు ఇద్దరు తమ్ముళ్లున్నారు. ప్రఖ్యాత అఫ్ఘాన్ పోరాటయోధురాలు, కవయిత్రి ‘మెయివాండ్ మలాలాయ్’ పేరు మీదుగా తన కూతురికి ‘మలాలా’ అని నామకరణం చేశారు జియావుద్దీన్. యూసఫ్ జాయ్ అనేది స్వాత్ లోయలోని ప్రముఖ తెగ. మలాల తండ్రి జియావుద్దీన్ కవి. ఈయన విద్యావేత్త కూడా. కుశాల్ పబ్లిక్ స్కూల్స్ పేరిట పాఠశాలలను నిర్వహిస్తూ ఉంటారు.
లక్ష్యం..
మలాలా చిన్ననాటి నుంచి చురుకైన అమ్మాయి. బాగా చదువుకొని వైద్యురాలు కావాలని కలలు కనేది. అయితే, తండ్రి జియావుద్దీన్ మలాలాను రాజకీయవేత్తగా చూడాలనుకున్నారు. ఇదే విషయాన్ని మలాలాతో చర్చించేవారు. అర్ధరాత్రి దాటేంతవరకూ ఈమె తన తండ్రితో కలిసి రాజకీయాల గురించి చర్చించేవారు. ఫలితంగా 2008లో పెషావర్ ప్రెస్‌క్లబ్‌లో బాలికల విద్యపై ఉపన్యాసం ఇచ్చింది. ‘చదువుకోవడం మా హక్కు. దాన్ని లాక్కోవడానికి తాలిబన్లు ఎవరు?’ అని శ్రోతలను ప్రశ్నించింది. ఈ ప్రశ్నను పాక్‌లోని చానెళ్లు, పత్రికలు ప్రముఖంగా ప్రచారం చేయడంతో స్వాత్ లోయ మొత్తం ఆమె గొంతు ప్రతిధ్వనించింది. అప్పటి నుంచే మలాలా కుటుంబంపై తాలిబన్లు కక్ష గట్టారు.
పోరాటంలోకి..
ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ స్వాత్‌లోయ అనుభవాలను ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. దీనికోసం స్థానిక పాఠశాలల్లో చదివే బాలికలతో వ్యాసాలు రాయించాలని నిర్ణయించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ పనికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక్క మలాలా తప్ప. దీంతో మలాలా డైరీ ప్రారంభమైంది. ఇందులో ‘గుల్ మకాయ్’ (మొక్కజొన్న పువ్వు) పేరుతో తాలిబన్ల అరాచకత్వాన్ని ఆమె ప్రశ్నించడం మొదలు పెట్టింది.
దాడి..
మలాలాపై తాలిబన్ల ఆగ్రహం మరింత ముదిరింది. స్వాత్‌లోయలో బాలికల విద్యను నిషేధించినప్పటికీ పాఠశాలకు వెళ్తున్న ఆమెను తాలిబన్లు హెచ్చరించారు. చంపేస్తామంటూ బెదిరించారు. అయినా మలాలా బెదరలేదు. దీంతో 2012 అక్టోబర్ 9న తాలిబన్ల దాడికి గురికావాల్సి వచ్చింది. శరీరంలోకి తూటాలు దూసుకెళ్లడంతో మలాలా మృత్యువుకు చాలా దగ్గరగా వెళ్లింది. దీంతో ఈ బాలికను బ్రిటన్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. మరణంతో పోరాడిన ఈ సాహసి ఎట్టకేలకు గెలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా హర్షధ్వానాలు మార్మోగాయి.
పాక్ ఆహ్వానం..
తాజాగా నార్వే రాజధాని ఓస్లోలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ‘అభివృద్ధి కోసం విద్య’ సదస్సులో మలాలా పాల్గొంది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాధినేతలను విద్యకు సాయమందించాల్సిందిగా అభ్యర్థించింది. ‘‘యుద్ధ సామగ్రి కోసం చేసే ఖర్చును ఒక్కవారం పాటు పుస్తకాలపై చేయండి. ప్రపంచంలోని చిన్నారులంతా 12 ఏళ్లపాటు ఉచితంగా చదువుకుంటారు’’ అంటూ ప్రసంగించింది.
తూటాలు కాదు.. పుస్తకాలు (బుక్స్ నాట్ బుల్లెట్స్) పేరుతో ఆమె క్రియేట్ చేసిన హ్యాష్‌ట్యాగ్‌కు భారీ స్పందన లభిస్తోంది. ట్వీటర్లో చాలా మంది తమకు నచ్చిన పుస్తకాలను చేతపట్టుకుని సెల్ఫీలు దిగుతూ మలాలాకు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్, మలాలాను తమ దేశానికి ఆహ్వానించారు. పాకిస్తాన్‌కు మలాలా సేవలు చాలా అవసరమని, ఆమెకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని ఆయన చెప్పారు. మలాలా కూడా పాక్ వెళ్లేందుకు సిద్ధంగానే ఉంది. ‘నా దేశానికి సేవ చేయడం నా బాధ్యత. నాకోసం పాక్ ఎదురుచూస్తోందని నవాజ్ చెప్పారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. బహుశా ఈ వేసవి సెలవుల్లో ఈ శాంతి కపోతం నెత్తుటి నేలపై వాలే అవకాశముంది.
నోబెల్..
మరణాన్ని జయించిన పదిహేనేళ్ల మలాలాకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ‘డెస్మాండ్ టుటు’ ప్రతిపాదించారు. పిన్న వయసులో నోబెల్ పరిశీలనకు నోచుకున్న పేరు మలాలాదే. తాజాగా ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని కైలాశ్ సత్యార్థితో కలిసి అందుకుంది. బాలికల విద్యకోసం ఆమె పోరాటానికి గానూ పదిహేడేళ్ల వయసులోనే ఈ అత్యుత్తమ అవార్డు గెల్చుకుంది.