సరికొత్త భయం.. నోమోఫోబియా!
మొబైల్ ఫోన్ లేకుండా మీరు ఉండలేకపోతున్నారా? లేదా.. స్మార్ట్‌ఫోన్‌లో డేటా ప్యాకేజి లేకపోవడం, వై-ఫై అందుబాటులో లేకపోవడం లాంటి పరిస్థితులు వస్తే అస్సలు భరించలేకపోతున్నారా? అయితే మీరు 'నోమోఫోబియా'తో బాధపడుతున్నట్లే. అవును.. ఇప్పుడు ప్రపంచంలో సరికొత్తగా వ్యాపిస్తున్న ఫోబియా ఇది. ఈ విషయాన్ని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. ఆనా పాల్ కొరెయా అనే అసోసియేట్ ప్రొఫెసర్, కాగ్లర్ ఇల్డిరిమ్ అనే పీహెచ్డీ విద్యార్థి కలిసి ఈ అంశంపై పరిశోధనలు చేశారు. ఈ కొత్త ఫోబియాలో కూడా నాలుగు కోణాలు ఉన్నాయట.
ఇందుకోసం వాళ్లు చేసిన సర్వేలో పాల్గొన్నవారిని అడగిన ప్రశ్నలకు 1 (గట్టిగా వ్యతిరేకిస్తాను) నుంచి 7 (గట్టిగా అంగీకరిస్తాను) వరకు గ్రేడ్లు ఇవ్వాలని తెలిపారు. ఇందులో ఎక్కువ స్కోర్లు వచ్చినవాళ్లకు నోమోఫోబియా బాగా తీవ్రంగా ఉన్నట్లు లెక్కించారు. నా ఫోనుకు సమాచారం అందకపోతుంటే నేను చాలా ఇబ్బంది పడతాను, నేను కావాలనుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ కాకపోతే అస్సలు భరించలేను, ప్రపంచంలో ఏం జరుగుతోంతో ఫోన్లో తెలియకపోతే చాలా నెర్వస్‌గా ఫీలవుతాను.. ఇలాంటి ప్రశ్నలను వాళ్లకు ఇచ్చారు. వీటికి అవును అని చెప్పినవాళ్లకు నోమోఫోబియా ఉన్నట్లు లెక్కించారు. కాబట్టి.. మీకు కూడా ఇలాంటి ఫోబియా ఏమైనా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి మరి!!