సమ్మె విరమణకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నో
సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె విరమణకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిరాకరించింది. సమ్మె విరమించాలంటూ రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన విన్నపాన్ని తిరస్కరించింది. మంత్రి బొత్స శుక్రవారం రాత్రి యూనియన్ ప్రతినిధి బృందంతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్, ఈడీ వెంకటేశ్వరరావు, యూనియన్ ప్రతినిధులు పద్మాకర్, సోమరాజు, దామోదరరావు, ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీమాంధ్ర ప్రాంతంలో ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సమ్మెను విరమించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. దీనికి తాము సమ్మతించలేదని యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాలు, అప్పులు రూ. 5 వేల కోట్లకు చేరిన దృష్ట్యా వాటిని ప్రభుత్వమే భరించి రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ఆదుకోవాలని మంత్రిని కోరినట్టు వెల్లడించారు.
సీమాంధ్ర సమ్మె వల్ల ఆర్టీసీకి రూ. 200 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఎండీ ఏకే ఖాన్ వెల్లడించారు. రోజూ రూ. 13 కోట్లకుపైగా ఆర్టీసీకి నష్టం వస్తోందని తెలిపారు. దీంతో ఉద్యోగులు, కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని క్లిష్ట పరిస్థితుల్లో ఆర్టీసీ ఉందని చెప్పారు.