Note 7 Failure
-
శాంసంగ్ లాభాలు ఎంత తగ్గాయంటే..
సియోల్: ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ వైఫల్యం సంస్థను భారీగానే దెబ్బతీసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మూడవ త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది. సంస్థ సవరించిన గైడెన్స్ అంచనాకనుగుణంగానే సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు వెలువడ్డాయి. ఆపరేటింగ్ లాభాలు 30 శాతం క్షీణించి 5.2 ట్రిలియన్లుగా నమోదు చేసింది. రూ.3056 కోట్ల (4.57 బిలియన్ డాలర్లు) ఆర్జించినట్టు శాంసంగ్ వెల్లడించింది. దీంతో ఆపరేటింగ్ లాభం రెండు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. జూలై-సెప్టెంబర్ కాలానికి శామ్సంగ్ నికర ఆదాయం 17 శాతం క్షీణించి 4.4 ట్రిలియన్ (3.9 బిలియన్ డాలర్లు) సాధించింది. మొబైల్ విభాగంలో 100 బిలియన్ల నిర్వహణా లాభాన్ని సాధించింది. గత ఏడాది 2.4 ట్రిలియన్ల ఆదాయంతో పోలిస్తే ఇది భారీ పతనం. గెలాక్సీ నోట్ 7 వివాదంతో సంస్థకు వెన్నుదన్నుగా నిలిచే మొబైల్ లాభం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 2008 నాలుగో త్రైమాసికం తరువాత ఇదే అత్యల్పం. ఇదంతా గెలాక్సీ నోట్7 పేలుళ్లు, రీకాల్ ప్రభావమేనని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ వ్యాఖ్యానించింది. కాగా మొబైల్ అమ్మకాల్లో రారాజు గా వెలుగొందిన శాంసంగ్ మొదట్లో 7.8 ట్రిలియన్ల లాభాన్ని అంచనావేసినా తరువాత రెండు దఫాలుగా ఆపరేటింగ్ లాభాల అంచనాలను సవరించింది. ప్రపంచ వ్యాప్తంగా గెలాక్సీ 7 రీకాల్ మూలంగా వచ్చే రెండు త్రైమాసికాల్లో ప్రపంచవ్యాప్తంగా 5.3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.35438 కోట్లు) నష్టపోతున్నట్టు అంచనావేసిన సంగతి తెలిసిందే. -
భారీ నష్టాలనే అంచనావేసిన శాంసంగ్
సియోల్ : గెలాక్సీ నోట్7 ప్రభావం దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌కు భారీగానే దెబ్బతీసేలా కనపిస్తోంది. మరోసారి తన ఆపరేటింగ్ లాభాల అంచనాలను సవరించింది. ఈ అంచనాల్లో ఇప్పటికే 2.3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 15,375కోట్లు) కోల్పోతున్నట్టు ప్రకటించిన శాంసంగ్, మరో 3 బిలియన్ డాలర్లు (రూ.20,053 కోట్లకు పైగా) నష్టపోయేటట్టు ఉన్నామని శుక్రవారం వెల్లడించింది. ఇదంతా గెలాక్సీ నోట్7 పేలుళ్ల ప్రభావమేనని తెలిపింది. వచ్చే రెండు త్రైమాసికాల్లో ప్రపంచవ్యాప్తంగా 5.3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.35438 కోట్లు) నష్టపోతున్నట్టు అంచనావేసింది. ఆపిల్ ఇంక్ తాజా ఐఫోన్లకు పోటీగా ముందుగానే గెలాక్సీ నోట్7 ఫోన్లను శాంసంగ్ లాంచ్ చేసింది. ఆవిష్కరణ అయిన కొద్ది రోజుల్లోనే విపరీతంగా అమ్ముడుపోయిన గెలాక్సీ నోట్ 7 ఫోన్లు, రెండు నెలలు తిరక్కుండానే తీవ్ర ఇరకాటంలో కూరుకుపోయాయి. పేలుళ్ల ప్రభావంతో అత్యంత ప్రమాదకరమైన ఫోన్‌గా పేరు తెచ్చుకున్నాయి. కోల్పోతున్న రెవెన్యూలను కాపాడుకోవడానికి గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ వంటి ఫోన్ల అమ్మకాలపై శాంసంగ్ దృష్టిసారించనుంది. నాణ్యత హామీ ప్రక్రియల్లో కూడా మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. నోట్7 అమ్మకాలను, ఉత్పత్తిని ఆపివేయడంతో కంపెనీ షేర్లు అంతర్జాతీయంగా 8 శాతం మేర క్షీణించాయి.