భారీ నష్టాలనే అంచనావేసిన శాంసంగ్
భారీ నష్టాలనే అంచనావేసిన శాంసంగ్
Published Fri, Oct 14 2016 9:29 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
సియోల్ : గెలాక్సీ నోట్7 ప్రభావం దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్కు భారీగానే దెబ్బతీసేలా కనపిస్తోంది. మరోసారి తన ఆపరేటింగ్ లాభాల అంచనాలను సవరించింది. ఈ అంచనాల్లో ఇప్పటికే 2.3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 15,375కోట్లు) కోల్పోతున్నట్టు ప్రకటించిన శాంసంగ్, మరో 3 బిలియన్ డాలర్లు (రూ.20,053 కోట్లకు పైగా) నష్టపోయేటట్టు ఉన్నామని శుక్రవారం వెల్లడించింది. ఇదంతా గెలాక్సీ నోట్7 పేలుళ్ల ప్రభావమేనని తెలిపింది. వచ్చే రెండు త్రైమాసికాల్లో ప్రపంచవ్యాప్తంగా 5.3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.35438 కోట్లు) నష్టపోతున్నట్టు అంచనావేసింది.
ఆపిల్ ఇంక్ తాజా ఐఫోన్లకు పోటీగా ముందుగానే గెలాక్సీ నోట్7 ఫోన్లను శాంసంగ్ లాంచ్ చేసింది. ఆవిష్కరణ అయిన కొద్ది రోజుల్లోనే విపరీతంగా అమ్ముడుపోయిన గెలాక్సీ నోట్ 7 ఫోన్లు, రెండు నెలలు తిరక్కుండానే తీవ్ర ఇరకాటంలో కూరుకుపోయాయి. పేలుళ్ల ప్రభావంతో అత్యంత ప్రమాదకరమైన ఫోన్గా పేరు తెచ్చుకున్నాయి. కోల్పోతున్న రెవెన్యూలను కాపాడుకోవడానికి గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ వంటి ఫోన్ల అమ్మకాలపై శాంసంగ్ దృష్టిసారించనుంది. నాణ్యత హామీ ప్రక్రియల్లో కూడా మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. నోట్7 అమ్మకాలను, ఉత్పత్తిని ఆపివేయడంతో కంపెనీ షేర్లు అంతర్జాతీయంగా 8 శాతం మేర క్షీణించాయి.
Advertisement
Advertisement