కిడ్నీ దానాలకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అవయవదానాలను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరో అడుగు ముందుకు వేసింది. మూత్రపిండాల(కిడ్నీల) దానం ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ శుక్రవారం నూతన మార్గదర్శకాలను విడుదలచేసింది. ఆ మేరకు నోటో(నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్) అధికారిక వెబ్ సైట్ www.notto.nic.in లో సంపూర్ణ వివరాలను పొందుపర్చింది.
కిడ్నీ దానాలకు సంబంధించి సభ్య సమాజం నుంచి మరిన్ని సూచనలు అవసరమని, అట్టి సలహాలను జనవరి 16లోగా వెబ్ సైట్ లో సూచించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. నూతన మార్గదర్శకాల ద్వారా కిడ్నీ గ్రహీతలు, దాతల సంఖ్యలో భారీ తేడాలు, అవయవ మార్పిడిలో రాష్ట్రాల మధ్య సమన్వయలోపం తదితర ఆటంకాలను అధిగమించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల్లో కొన్ని ముఖ్యాంశాలు
కిడ్నీల వ్యాధితో బాధపడుతూ, ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమైన రోగులు ముందుగా www.notto.nic.in ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి. అది కూడా ఒక ఆసుపత్రి ద్వారా ఒకసారి మాత్రమే రిజిస్టర్ చేయించుకోవాలి.
గ్రహీత వయసు 65 సంవత్సరాలు మించకూడదు.
ఆయా రాష్ట్రాలు, లేదా టెరిటరీల పరిధిలోని కిడ్నీ అడ్వయిజరీ కమిటీల ఆమోదంతో రోగుల పేర్లను ఆన్ లైన్ స్క్రోలింగ్ లో ఉంచుతారు.
అలాగే దాతల వివరాలను కూడా ఆన్ లైన్ లో ఉంచుతారు.
దాతలు, గ్రహీతల మధ్య సమన్వయం మెరుగుపర్చేలా ఒకే ప్రాంతంలో లేదా ఒకే రాష్ట్రం వారికి ముందుగా మార్పిడి అవకశం కల్పిస్తారు. ఒకవేళ సదరు రోగికి తగిన కిడ్నీ దాత ఆ రాష్ట్రంలో లేనట్లయితే మిగతా రాష్ట్రంలోని దాతలను సంప్రదిస్తారు. ఈ వ్యవహారాన్నంతటినీ రొటో నిర్వహిస్తుంది.