చిన్న పరిశ్రమలపై దృష్టి పెట్టండి
విజయవాడ (లబ్బీపేట) : విద్యార్థులు చదువు పూర్తవగానే ఉద్యోగాల కోసం చూడకుండా చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూ ఢిల్లీలోని ఎన్ఎస్ఐసీ రిసోర్స్ పర్సన్ జి.సుదర్శన్ సూచించారు. స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఎన్ఎస్ఐసీ ఆధ్వర్యాన బుధవారం కామర్స్ విద్యార్థులకు బుధవారం ఎంటర్ప్రెన్యూర్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న తరహా పరిశ్రమలను ఏ విధంగా ప్రారంభించాలి, ఫైనాన్స్‌ను ఏ విధంగా పొందాలి, ముద్ర, బ్యాంకులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎన్ఎస్ఐసీ నుంచి సహాయ సహకారాలు పొందే విధానం గురించి సుదర్శన్ వివరించారు. ఎంఎస్ఎంఈ, టీసీవో, డీఐసీ, ఎన్జీవోల నుంచి శిక్షణ కూడా పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా పరిశ్రమలు స్థాపించి సొంతగా అభివృద్ధి సాధించాలని, పది మందికి ఉపాధి కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ టి.విజయలక్ష్మి, కామర్స్ విభాగాధిపతి టి.రమాదేవి, ఇతర అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.