NSS awards
-
ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ఉత్తమ సేవా పురస్కారాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలకు ఎంపికైనట్లు ఏపీ జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ పి.అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని జాతీయ సేవా పథకం కింద వివిధ సేవలను సమర్థవంతంగా నిర్వహించినందుకు 2021–22గానూ కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ పురస్కారాలను ప్రకటించిందన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి వర్సిటీ పరిధిలోని జగన్స్ డిగ్రీ–పీజీ కళాశాలకు చెందిన పెళ్లకూరు సాత్విక, అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీకి చెందిన కురుబ జయమారుతి ఉత్తమ వలంటీర్లుగా ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 29న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఇద్దరు వలంటీర్లకు రూ.లక్ష నగదు, మెడల్, సర్టిఫికెట్తో కూడిన పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నారు. -
కేయూ క్యాంపస్: ‘సేవ’కు సెలవు..
సాక్షి, కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఏటా నిర్వహించే జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) కార్యక్రమాలు నిధుల లేమితో నిలిచిపోయాయి. ఈ విద్యాసంవత్సరం కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాల స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించలేదు. ప్రతి ఏటా కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగానికి సుమారు రూ.ఒక కోటి 60 లక్షల వరకు విడుదలవుతుం టాయి. ఆ నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేయూ పరిధిలో 363 ఎన్ఎస్ఎస్ యూనిట్లు.. నాట్ మీ బట్ యూ(నా కోసం కాదు నీ కోసం) అనే నినాదంతో జాతీయ సేవా పథకం ద్వారా కళాశాల స్థాయిలో విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంతో వారిలో వ్యక్తిత్వ వికాసం కూడా పెంపొందుతుంది. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ ,పీజీ కళాశాలల్లో మొత్తంగా 363 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు 100 మంది చొప్పున యూనివర్సిటీ పరి«ధిలో 36,300 మంది వలంటీర్లు ఉన్నారు. ఆయా కళాశాలల్లో ఎయిడ్స్ డే, పర్యావరణ దినోత్సవం తదితర ముఖ్యమైన రోజుల్లో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేగాక క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛ భారత్, హరితహారం కింద మొక్కలను నాటడంలాంటివి కూడా చేస్తుంటారు. ఇలా రోటీన్ కార్యక్రమాల నిర్వహణకుగాను ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్‌కు రూ.22 వేలు విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు తమ కళాశాల పరిధిలో ఎంపిక చేసిన గ్రామంలో ఏడు రోజులపాటు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తుంటారు. నిధుల లేమితో ఈ ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. ఈ విద్యాసంవత్సరంలో డిసెంబర్ మొదటి వారం దాటినా ఇంకా నిధులు విడుదల చేయలేదు. నిధుల విడుదల తర్వాతే అడ్వయిజరీ కమిటీ భేటీ.. ఈ విద్యాసంవత్సరంలో కేయూలో ఎన్ఎస్ఎస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఇందులో గత విద్యాసంవత్సరంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను సమీక్షించటంతోపాటు ఈ విద్యాసంవత్సరంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించి నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశం నిర్వహించి ఆయా జిల్లాల పరిధిలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. ఇందులోనే రోటీన్ కార్యక్రమాల కోసం రూ.22 వేల చొప్పున ప్రతి ప్రోగ్రాం ఆఫీసర్‌కు చెక్ అందజేస్తారు. నిధులు విడుదల కాకపోవడంతో ఇవేమి జరగడం లేదు. అయితే కళాశాలల్లో నిధులతో అవసరం లేని స్వచ్ఛ భారత్, హరితహారంలాంటి కార్యక్రమాలను మాత్రం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయి సమావేశంలో చర్చ.. ఇటీవల హైదరాబాద్‌లో అన్ని యూనివర్సిటీల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు కూడా ఈ ఏడాది నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని, ఇప్పటికే జాప్యమైందని రాష్ట్ర ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు కాగానే విడుదల చేస్తామని సదరు అధికారి సమాధానం చెప్పినట్లు సమాచారం. అయితే ఆ నిధులు ఎప్పుడొస్తాయనే విషయంలో స్పష్టత లేకపోవడంతో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోలేపోతున్నారు. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని, సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించే ఎన్ఎస్ఎస్కు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఇందిర ఎన్ఎస్ఎస్ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)లో విశిష్ట సేవలు అందించిన కళాశాలలు, ఎన్ఎస్ఎస్ యూనిట్లు, ప్రోగ్రామ్ అధికారులు, ఉత్తమ వలంటీర్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం సత్కరించి ఇందిరా గాంధీ జాతీయ సేవాపథకం అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 53 సంస్థలు, వ్యక్తులకు అవార్డులు అందచేశారు. తెలంగాణకు ఆరు, ఏపీకి 9 అవార్డులు దక్కాయి. అవార్డు గ్రహీతల వివరాలు.. ‘అప్‌కమింగ్’ వర్సిటీ విభాగంలో ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్. రాజు, వైస్ చాన్స్‌లర్(ఆంధ్రా వర్సిటీ), డాక్టర్ ఎన్.ఎ. ధరణి పాల్(ఆంధ్రా వర్సిటీ), ‘అప్రీసియేషన్’ విభాగంలో డాక్టర్ బి.సురేష్‌లాల్(కాకతీయ వర్సిటీ)లకు అవార్డులు లభించాయి. ఉత్తమ యూనిట్/ప్రోగ్రాం అధికారుల విభాగంలో ిసీహెచ్. శ్రీనివాస్-ప్రిన్సిపాల్, రాపోలు గోపీకృష్ణ(వివేకానంద డిగ్రీ- పీజీ కళాశాల, కరీంనగర్), బి.మధుసూదన్‌రెడ్డి-ప్రిన్సిపాల్, కల్వకుంట రామకృష్ణ(ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కరీంనగర్), ఎ.సుధాకర్-ప్రిన్సిపాల్, మద్దినేని సుధాకర్(ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చోడవరం, గుంటూరు), డి.సుధారాణి- ప్రిన్సిపాల్(ప్రెసిడెన్సీ డిగ్రీ కళాశాల, శివాజీపాలెం, విశాఖపట్నం), చిళ్ల ఆదినారాయణ(ప్రెసిడెన్సీ డిగ్రీ కళాశాల, శివాజీ పాలెం, గుంటూరు)లకు అవార్డులు దక్కాయి. ఉత్తమ ఎన్ఎస్ఎస్ వలంటీర్ విభాగంలో ఎన్.రాహుల్ పాల్(ఆంధ్రా వర్సిటీ), కె.కృష్ణ (శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ), కందూరి రోహిణి(జేబీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, కావలి), కె.అవంతి(వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల, కరీంనగర్) లకు పురస్కారాలు దక్కాయి.