
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలకు ఎంపికైనట్లు ఏపీ జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ పి.అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని జాతీయ సేవా పథకం కింద వివిధ సేవలను సమర్థవంతంగా నిర్వహించినందుకు 2021–22గానూ కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ పురస్కారాలను ప్రకటించిందన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి వర్సిటీ పరిధిలోని జగన్స్ డిగ్రీ–పీజీ కళాశాలకు చెందిన పెళ్లకూరు సాత్విక, అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీకి చెందిన కురుబ జయమారుతి ఉత్తమ వలంటీర్లుగా ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 29న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము ఇద్దరు వలంటీర్లకు రూ.లక్ష నగదు, మెడల్, సర్టిఫికెట్‌తో కూడిన పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నారు.