నేడు జగనన్న ఆరోగ్య సురక్ష పైలట్‌ క్యాంప్‌లు | 26th On Jagananna Arogya Suraksha Pilot Camps | Sakshi
Sakshi News home page

నేడు జగనన్న ఆరోగ్య సురక్ష పైలట్‌ క్యాంప్‌లు

Published Tue, Sep 26 2023 4:04 AM | Last Updated on Fri, Sep 29 2023 4:02 PM

26th On Jagananna Arogya Suraksha Pilot Camps - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సన్నద్ధతలో భాగంగా మంగళవారం ప్ర­యో­గా­త్మకంగా పైలట్‌గా హెల్త్‌ క్యాంప్‌లను వైద్య శాఖ నిర్వహిస్తోంది. జిల్లాకు ఒక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ చొప్పున 26 జిల్లాల్లో హెల్త్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో సర్వే చేసి ప్రజల ఆరోగ్యంపై వాకబు చేసి సమస్యలను గుర్తిస్తున్నారు. సర్వేలో గుర్తించిన వివిధ సమస్యల బాధితులతో పాటు, వైద్య అవసరాలున్న వారికి ఈ నెల 30వ తేదీ నుంచి 45 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌ క్యాంప్‌లు నిర్వహించి సేవలు అందిస్తారు. ఈ నేపథ్యంలో 30వ తేదీన ప్రారంభించాల్సిన హెల్త్‌ క్యాంప్‌లపై ముందే పైలట్‌ క్యాంప్‌లు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా ఎంపిక చేసిన విలేజ్‌ క్లినిక్‌ల పరిధిలో క్యాంప్‌లు పెడతారు. ప్రతి క్యాంప్‌లో ఇద్దరు పీహెచ్‌సీలు వైద్యులు, ఇద్దరు స్పెషలిస్ట్‌ వైద్యులు ఉంటారు. క్యాంపుల్లో అవసరమైన చికిత్సలు, మందులు సమకూర్చుకోవడానికి పైలట్‌ కార్యక్రమం ఉపయోగపడనుంది. ప్రతి క్యాంప్‌లో 162 రకాల మందులు, 18 సర్జికల్‌ పరికరాలు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్స్‌ ఉంటాయి.

నేటి నుంచి వలంటీర్ల సర్వే..
ఐదు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. కాగా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలి్పంచడం కోసం వలంటీర్, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు ఇంటింటి సందర్శన, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో), ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు సర్వే రూపంలో రెండు దశల ప్రక్రియ ప్రారంభించారు.

గ్రామం, పట్టణంలో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించడానికి మూడు రోజుల ముందు క్యాంప్‌ నిర్వహించే ప్రాంతం, సమయం ఇతర వివరాలను ప్రజలకు తెలియజేయడం కోసం మూడో దశలో వలంటీర్లు ఇంటింటి సందర్శన చేయాల్సి ఉంటుంది. ఈ నెల 30వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా తొలి క్యాంప్‌లు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు, పట్టణాల్లో మంగళవారం నుంచి వలంటీర్లు గృహాలను సందర్శించి క్యాంప్‌లపై ప్రజలకు మరోమారు అవగాహన కల్పించనున్నారు.

అన్ని ఏర్పాట్లు చేశాం!
ఆరోగ్య సురక్ష పైలట్‌ క్యాంప్‌ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. మందులు, ఇతర వనరులను సమకూర్చాం. 30వ తేదీ నుంచి ప్రారంభించే క్యాంప్‌లను ప్రతిబింబించేలా పైలట్‌ క్యాంప్‌లు నిర్వహణ ఉంటుంది.

నలుగురు వైద్యులు, సిబ్బంది క్యాంప్‌లలో ఉంటారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరం ఉంటే సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు రిఫర్‌ చేస్తారు. వైద్య పరీక్షలు అవసరం ఉంటే పీహెచ్‌సీలకు మ్యాప్‌ చేస్తారు. ఇలా రిఫర్, మ్యాపింగ్‌ చేసిన వారు అనంతరం ఆస్పత్రులకు వెళ్లారా? లేదా? పరీక్షలు చేయించుకున్నారా? లేదా? అన్న దానిపై ఫాలో అప్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పైలట్‌ క్యాంప్‌లు నిర్వహించే గ్రామాల్లో ప్రజలకు ఇప్పటికే వైద్య సిబ్బంది సమాచారం అందజేశారు. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement