‘రాజ్’కున్న ముట్టడి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలపై ఈడీ వేధింపులను నిరసిస్తూ, ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ గురువారం రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన ‘రాజ్‌భవన్ ముట్టడి’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్‌భవన్ వైపునకు వెళ్లకుండా పోలీసులు నాలుగంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.
వచ్చినవారిని వచ్చినట్టుగా అదుపు లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదాలు, తోపులాట, లాఠీచార్జి, అరెస్టులు తదితర ఘటనలతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తా అట్టుడికి పోయిం ది. ఉదయం 5:30 నుంచి ప్రారంభమైన ఈ ముట్టడి కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగడం తో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరకు పోలీసులు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలందరినీ అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
తెల్లవారుజాము నుంచే
టీపీసీసీ పిలుపు నేపథ్యంలో గురువారం తెల్లవారు జామునే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు పోలీసుల కళ్లుగప్పి రాజ్‌భవన్ వద్దకు చేరుకుని గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులు అతి కష్టం మీద వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత టీపీసీసీ మత్స్య కారుల కమిటీ చైర్మన్ మెట్టుసాయికుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుల నేతృత్వంలో కార్యకర్తలు 3 దఫాలుగా రాజ్‌భవన్ వద్దకు చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివసేనారెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన కాలు పోలీస్ వాహనం డోర్లో ఇరుక్కుపోయింది. దీంతో మరో కాలుతో ఆయన ఆ డోర్ అద్దాలను పగులగొట్టడంతో ఆయనతో పాటు ఒకరిద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
ఖైరతాబాద్ చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన.. నిలిచిపోయిన ట్రాఫిక్
జగ్గారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు గాయాలు
ఉదయం 10:45 సమయంలో రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్య క్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు ఖైరతాబాద్ చౌరస్తాకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే బైఠాయించారు. అదే సమయంలో ఆవేశా నికి లోనైన యూత్‌కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అక్కడ ఉన్న ఓ బైక్‌కు నిప్పు పెట్టారు. కాచిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.
ఈ గందరగో ళంలో రేవంత్ బృందం నాలుగో అంచె బారికేడ్ల వరకు చేరుకున్నారు. అయితే అక్కడ ముళ్లకంచెలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులు వారిని నిలువరించగలి గారు. భట్టి, రేవంత్‌రెడ్డితో పాటు ఇతర నేతలు కార్యకర్త లను అదుపులోకి తీసుకుని.. పోలీసు వాహనంలో తర లిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. టీపీసీసీ నేత చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ఐదుగురు పోలీసులు చుట్టుముట్టి లాఠీచార్జి చేయడంతో గాయాలయ్యాయి.
ఆయన్ను చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పోలీసులను తప్పించుకుని దాదాపు రాజ్‌భవన్ వరకు వెళ్లారు. అక్కడ బారికేడ్లను దాటే క్రమంలో ఆయన మోకాలికి గాయమైంది. జగ్గారెడ్డి తదితరులను కూడా పోలీసులు అక్కడినుంచి తరలించారు. మాజీ ఎంపీలు వి.హనుమం తరావు, మల్లురవి, బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, ఆది శ్రీనివాస్, కె.మదన్మోహన్రావు తదితరులను కూడా పోలీసులు రాజ్‌భవన్ వైపునకు వెళ్లకుండా అడ్డుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
రేణుక రాకతో మరోమారు ఉద్రిక్తత
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కొందరు మహిళా నేతలతో కలిసి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి రావడంతో మరోమారు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజ్‌భవన్ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులకు, రేణుకకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి చేయి తగలడంతో.. ఒక్కసారిగా ఆవేశానికి లోనైన ఆమె ఆయన కాలర్ పట్టుకుంది.. దీంతో వాతావరణం వేడెక్కింది. పోలీసులు అతికష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకోగలిగారు.
ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన చుట్టూ పురుష పోలీసులు ఉండడంతో దురదృష్టకరమైన ఘటన జరిగింది తప్ప తాను కావాలని చేయలేదని రేణుక వివరణ ఇచ్చారు. పోలీసులు తనను వెనకవైపు నుంచి నెట్టేయడం, గిల్లడం లాంటివి చేశారని, తనపైకి దూసుకు వస్తున్న ఎస్సైని రావొద్దంటూ చేయి పెట్టి అడ్డుకున్నానని, కాలర్ పట్టుకోలేదని వివరించారు. వాస్తవానికి గురువారం ఉదయం గవర్నర్ తమిళిసై నగరంలో లేరు. మధ్యాహ్నం పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసా గుతున్న సమయంలోనే రాజ్‌భవన్‌లోనికి వెళ్లారు.