సీశాట్ వ్యతిరేక జ్వాలలు రగులుతున్నాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు దాదాపు నెల రోజుల నుంచి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలను నిర్వహిస్తూనే ఉన్నారు. శనివారం నాటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీసులు లాఠీ ఝళిపించడంతో వందలాదిమంది గాయపడ్డారు. న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)లో సీశాట్ విధానానికి వ్యతిరేకంగా ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ నివాసం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇదే అంశంపై గత బుధవారం ఉత్తర ఢిల్లీలోని నెహ్రూ విహార్ ప్రాంతంలో ఆందోళనకు దిగినవారిపై పోలీసుల దుందుడుకుతనానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినదించారు.
ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి మోహిత్ శర్మ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా యూపీఎస్‌సీతోపాటు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికివ్యతిరేకంగా నినదించారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో వందలాదిమంది గాయపడ్డారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఎన్‌ఎస్‌యూఐ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే మీడియాతో మాట్లాడుతూ అదుపులోకి తీసుకున్నవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమాయకులైన ఆందోళనకారులపై పోలీసుల బలప్రయోగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గత 25 రోజులుగా సీశాట్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎంతమాత్రం స్పందించడం లేదన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీశాట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు తొలుత భారీ సంఖ్యలో రాజ్‌నాథ్ నివాసానికి రావడాన్ని గమనించిన పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ బ్యారికేడ్లను ఏర్పాటుచేశారు. కొంతమంది ఆందోళనకారులను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలాఉంచితే యూపీఎస్‌సీ పరీక్షలో భాగంగా విద్యార్థులు సీశాట్ 1, సీ-శాట్ 2 అనే రెండు ప్రాథమిక పరీక్షలను రాయాల్సి ఉంటుంది. సీశాట్‌లో స్కిల్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. దీంతోపాటు ఎనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లం సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ , బేసిక్ న్యూమరసీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్సివ్ స్కిల్స్‌తదితరాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైన ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ పొందుతారు.
సరైన సమయంలో నిర్ణయం: కేంద్ర మంత్రి జితేంద్రసింగ్
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)లో సీశాట్ (సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్) విధానానికి తమ ప్రభుత్వం సరైన సమయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ స్పష్టంచేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదానికి సంబంధించి సరైన సమయంలో మా నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. అంతవరకూ విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని కోరారు. అంతకుముందు ఆయన ఈ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమై కొద్దిసేపు చర్చించారు. ఇదే అంశంపై బీజేపీ నాయకుడు జేపీ నడ్డా మాట్లాడుతూ దీన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చే ఆలోచనలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉందన్నారు.
సీశాట్ వ్యతిరేకోద్యమం ఉధృతం
Published Sat, Aug 2 2014 10:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement