సాలార్జంగ్ మ్యూజియం వద్ద...వేలాడే వంతెనా
నైట్ బజార్ కూడా..
సిటీకి సరికొత్త హంగులు
మెట్రోపొలిస్ సదస్సు కోసం రూ. 500 కోట్ల పనులు
సన్నద్ధమవుతున్న జీహెచ్ఎంసీ
అందే నిధులెన్నో.. చేసే పనులెన్నో?
సాక్షి, సిటీబ్యూరో: మెట్రోపొలిస్ సదస్సుకు సిటీని సరికొత్త హంగులతో తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. దాదాపు రూ. 500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా సాలార్జంగ్ మ్యూజియం వద్ద వేలాడే వంతెన, నైట్‌బజార్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. నగరంలో మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సు వచ్చే అక్టోబర్‌లో జరగనున్నందున ఈ లోపే పనులన్నీ పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచీ వీలైనన్ని నిధులు పొందాలని భావిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే వంద దేశాల విదేశీ ప్రతి నిధుల ఎదుట హైదరాబాద్‌ను షోకేస్‌గా చూపించేందుకు తహతహలాడుతోంది. ఇం దులో భాగంగా పాతబస్తీకి సంబంధించిన పలు పనులతోపాటు సాలార్జంగ్ మ్యూజియం వద్ద వేలాడే వంతెన, నైట్‌బజార్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ సూచించారు. అధికారులు ఆ దిశగా ప్రణాళిక.. అంచనా వ్యయం తదితరమైనవి రూపొందించే పనిలో పడ్డారు.
దీనితోపాటు చార్మినార్ వద్దకు చేరుకునే అప్రోచ్‌రోడ్ల వెంబడి గ్రీనరీని పెంపొందించడం, ఆయా మార్గాలకు వారసత్వ శోభనిచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక వీధిదీపాలు తదితరమైనవి ఏర్పాటు చేయనున్నారు. అంతా బాగానే ఉంది కానీ... సీఓపీ సందర్భంగా రూ. 150 కోట్ల పనులే చేయలేకపోయిన జీహెచ్ఎంసీ.. మెట్రోపొలిస్ సదస్సు కోసం రూ. 500 కోట్ల పనులను.. అదీ ఇంత తక్కువ సమయంలో ఎలా చేయగలుగుతుందో అంతుబట్టడం లేదు.
జీహెచ్ఎంసీ చేపట్టే పనుల్లో కొన్ని...
మీరాలం చెరువు సుందరీకరణ, కిషన్‌బాగ్ వద్ద అమ్యూజ్మెంట్ పార్కు
అన్ని ప్రధాన మార్గాల్లో రోడ్డు మార్కింగ్‌లు.. సైనేజీలు
వారసత్వ ప్రాముఖ్యమున్న అన్ని మార్గాల్లోనూ ప్రత్యేక వీధిదీపాల ఏర్పాటు
చాంద్రాయణగుట్టలో మల్టీపర్పస్ స్టేడియం
పాతబస్తీలో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులన్నీ పూర్తి
ఆరాంఘర్ నుంచి ఒవైసీ హాస్పిటల్ వరకు మిగిలిపోయిన ప్రాజెక్టు పనుల పూర్తి
చార్మినార్, మక్కామసీదు, మొజాంజాహీ మార్కెట్ ప్రాంతాల్లో సుందరీకరణ
చార్మినార్ వద్ద ఫొటోగ్యాలరీ ఏర్పాటుకు నిర్మాణ పనులు