నేలకొరిగిన ఎన్టీఆర్ విగ్రహాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కృష్ణా, గంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో జనజీవనం స్తంభించింది. గాలివానకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.
విజయవాడ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపైకి పెద్ద ఎత్తున వర్షపునీరు చేరింది. గన్నవరం కీసరపల్లి దగ్గర రోడ్డు పక్కన ఉన్న భారీ ఎన్టీఆర్ విగ్రహాలు నేలకొరిగాయి. ఈదురు గాలులకు రోడ్డు మీదకు కొట్టుకొచ్చాయి. గుడవల్లి, కంకిపాడు, ఉయ్యూరులోనూ వర్షం పడింది.
గుంటూరు జిల్లాలోనూ పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. దుగ్గిరాల మండలం చింతలపూడి వద్ద చెట్లు కూలిపోయాయి. తెనాలి-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఒంగోలులోనూ ఈదురు గాలులు కల్లోలం రేపాయి.