'ఐదు నిమిషాల్లో ఢిల్లీని టార్గెట్ చేయగలం'
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో భారత్ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేయగలదని పాక్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పితామహుడు డా. అబ్దుల్ ఖాదీర్ ఖాన్ అన్నారు. న్యూక్లియర్ పరీక్షలు మొదలుపెట్టి 18వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1984లోనే మొదలు కావాల్సిన న్యూక్లియర్ పరీక్షలు అప్పటి ప్రెసిడెంట్ జనరల్ జియా ఉల్ హక్ కారణంగా 1998 వరకు ఆగాల్సి వచ్చినట్లు వివరించారు.
రావల్పిండిలోని కహుతా న్యూక్లియర్ పరీక్షల కేంద్రం నుంచి ఢిల్లీని ఐదు నిమిషాల్లో టార్గెట్ చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2004 నుంచి పాక్ న్యూక్లియర్ పరీక్షల్లో భాగస్వామిగా ఉన్న ఖాన్ కు అంతకుముందు జీవితకాలం హౌస్ అరెస్టు శిక్షను విధించారు. 2009లో ఇస్లామాబాద్ కోర్టు ఖాన్ ను స్వతంత్ర పౌరుడిగా ప్రకటించింది. తన సహకారం లేకుంటే పాకిస్తాన్ న్యూక్లియర్ శక్తిని సాధించిన మొదటి ముస్లిం దేశంగా చరిత్ర సృష్టించేది కాదని అన్నారు. మాజీ ప్రధాని ముషారఫ్ హయాంలో న్యూక్లియర్ శాస్త్రజ్ఞులకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పారు. దేశం నుంచి న్యూక్లియర్ ప్రయోగాలకు అతి తక్కువ ప్రోత్సహం ఉంటోందన్నారు.