ఇరాన్‌తో అణు ఒప్పందం
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీలతో చరిత్రాత్మక అగ్రిమెంట్
అణ్వస్త్ర తయారీని నిలిపేందుకు ఇరాన్ అంగీకారం
ఆర్థిక ఆంక్షల తొలగింపునకు అగ్రరాజ్యాల సంసిద్ధత
దేశంలోని అణుకేంద్రాల తనిఖీకి ఇరాన్ ఓకే
అమానవీయ, నిరంకుశ ఆంక్షల తొలగింపుపై ఇరాన్ హర్షం
చారిత్రక తప్పిదమన్న ఇజ్రాయెల్
వియెన్నా/వాషింగ్టన్: పశ్చిమ దేశాల ఆంక్షల ఫలితంగా తీవ్రస్థాయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్ ఆరు అగ్ర రాజ్యాలతో అణు ఒప్పందం కుదుర్చుకుంది. అణ్వాయుధ సాధన కార్యక్రమాన్ని నిలిపేందుకు సిద్ధమయింది. ప్రతిగా.. ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించేందుకు ఆరు అగ్ర రాజ్యాలు.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, రష్యా అంగీకరించాయి. ఆస్ట్రియా రాజధాని వియెన్నాలో 18 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన కీలక చర్చల అనంతరం మంగళవారం ఈ చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో అగ్ర రాజ్యాలతో ఇరాన్ వైరానికి విరామం లభించినట్లైంది. ఈ అణు ఒప్పందం ప్రపంచానికి ఒక ఆశావహ నూతనాధ్యాయమంటూ ఇరాన్, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు గొప్పగా ప్రశంసించగా.. ఇది చరిత్రాత్మక తప్పిదమంటూ ఇరాన్ శత్రుదేశం ఇజ్రాయెల్ అభివర్ణించింది. ఈ ఒప్పందం ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఆపలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై సైనిక చర్యకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ ఒప్పందం కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందన్న ఆశాభావాన్ని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ వ్యక్తం చేశారు. దేవుడు తమ ప్రార్థనలను ఆలకించాడని అన్నారు. ఈ ఒప్పందంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిన అత్యంత ఆమానవీయ, నిరంకుశ ఆంక్షలు తొలగిపోతాయన్నారు. ‘ఇది పరస్పర ప్రయోజనకర ఒప్పందం.
మా లక్ష్యాలు నెరవేరాయి. ఆర్థిక ఆంక్షలు తొలగుతాయి. పౌరఅణు కార్యక్రమం కొనసాగుతుంది’ అని ఇరాన్ అధికారిక టీవీలో ప్రకటించారు. ‘ఈ రోజు ప్రపంచం గొప్ప ఉపశమనం పొంది ఉంటుంది’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ.. ‘ఇరాన్ అణు బాంబు తయారుచేయబోదన్న విశ్వాసంపై కాకుండా.. మరో 15 ఏళ్ల పాటు ఇరాన్ అణ్వాయుధ తయారీకి ఉపక్రమించబోదని పరిశీలించి, నిర్ధారించుకున్న తరువాతే ఈ ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని అడ్డుకునే ఏ చర్యనైనా వీటో చేస్తానని కాంగ్రెస్‌ను హెచ్చరించారు. ఇరాన్‌పై ఆంక్షలను దశలవారీగా తొలగిస్తామన్నారు. ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను ఐరాస భద్రతామండలి తీర్మానంలో పొందుపరుస్తామన్నారు. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తే తక్షణమే ఆంక్షలను తిరిగి విధిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఒప్పందాన్ని సమీక్షించేందుకు రెండు నెలల గడువు ఉంటుంది. ఈ గడువులోగా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తొలగించడం ఒబామాకు వీలుకాదు. ఒబామా హెచ్చరిస్తున్న వీటోను అతిక్రమించేలా ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో మూడింట రెండువంతుల మెజారిటీ సాధించి, ఈ ఒప్పందం రద్దు అయేలా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంటు, ఐక్యరాజ్య సమితి భద్రతామండలి కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంది.
మీరు పిడికిలి వదులు చేస్తే..: ‘ఇరాన్ తన పిడికిలిని వదులు చేస్తే.. మా వైపు నుంచి స్నేహ హస్తం అందిస్తాం’ అంటూ ఆరేళ్ల క్రితం ఒబామా చేసిన శాంతి వ్యాఖ్యల అనంతరం ఈ ఒప్పందానికి సంబంధించి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అలాగే, 35 ఏళ్లపాటు అంతర్జాతీయ సమాజంలో ఏకాకిగా ఉంటూ, ఇబ్బందులు పడుతున్న ఇరాన్‌ను కష్టాల నుంచి ఒడ్డున పడేయాలన్న ఆ దేశాధ్యక్షుడు రౌహనీ సంకల్పం కూడా ఇందుకు తోడైంది.అమెరికా నేతృత్వంలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ దేశాలు ఇరాన్‌తో వియోన్నా, జెనీవాల్లో 20 నెలల పాటు సాగించిన లోతైన చర్చోపచర్చల అనంతరం ఒప్పందం ముసాయిదా సిద్ధమైంది. గత 18 రోజుల చర్చల తర్వాత ఒప్పందం తుది రూపునకు వచ్చింది.
రెండేళ్ల కష్టం..: ‘దశాబ్దాల శత్రుత్వం సాధించలేని దాన్ని అమెరికాతో పాటు మన మిత్రదేశాలు రెండేళ్ల పాటు సాగించిన చర్చల ద్వారా సాధించాం. అదే అణుబాంబు తయారీని నిరోధించేలా ఇరాన్‌తో కుదిరిన సమగ్ర దీర్ఘకాలిక ఒప్పందం’ అని ఒబామా వాషింగ్టన్లో విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మరో 15 ఏళ్ల పాటు ఇరాన్ అణుబాంబును తయారు చేయలేదు’ అని ఉపాధ్యక్షుడు జో బిడెన్ పక్కనుండగా సగర్వంగా ప్రకటించారు. ఒబామా ప్రసంగాన్ని ఇరాన్ అధికారిక టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. ‘ఇరాన్ విషయంలో మొదటి నుంచి మేం కోరుకుంటున్న అణ్వస్త్ర తయారీ నిరోధాన్ని మొత్తంమీద సాధించాం’ అని అసాధారణంగా మంగళవారం వేకువజామున్న విడుదల చేసిన ప్రకటనలో ఒబామా పేర్కొన్నారు.
అణుబాంబు తయారీ అసాధ్యం
ఇరాన్ అణు కార్యక్రమాలపై ఈ ఒప్పందం పదేళ్ల పాటు కఠిన పరిమితులను విధిస్తుంది. ఐరాస నిశిత పరిశీలనకు అవకాశమిస్తుంది. దీనివల్ల అణుబాంబు తయారీ ఇరాన్‌కు అసాధ్యమవుతుంది. ఇరాన్ ఆయుధాలు సమకూర్చుకోవడాన్ని నిరోధించే అంతర్జాతీయ ఆయుధ నిషేధాజ్ఞలు మరో ఐదేళ్లు అమల్లో ఉంటాయి. అయితే, ఐరాస భద్రతామండలి నుంచి ప్రత్యేక అనుమతితో ఇరాన్ అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవచ్చు’ అని రష్యా తెలిపింది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలను, ఆయుధ కేంద్రాలను ఐరాస అణ్వాయుధ నిఘా సంస్థ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) పరిశీలించేందుకు ఇరాన్ అంగీకరించిందని ఆ దేశ ఉన్నతాధికారి తెలిపారు. రహస్యంగా అణుబాంబు తయారీకి ఇరాన్ ప్రయత్నిస్తోందా? అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఇరాన్ అణుకేంద్రాలను, సైనిక స్థావరాలను ఐఏఈఏ పరిశీలించడానికి ఇరాన్ అంగీకరించాలనేదే ఇన్నాళ్లూ సాగిన చర్చల్లో పశ్చిమ దేశాల ప్రధాన డిమాండ్. అయితే, తనిఖీల పేరుతో తమ సైనిక రహస్యాలను తెలుసుకునే అవకాశం ఆయా దేశాలకు లభిస్తుందనేది ఇరాన్ అనుమానం. అగ్రరాజ్యాల ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. ఈ ఒప్పందం వల్ల చమురు ఎగుమతులు పెరిగి, అగ్రరాజ్యాలతో పాటు ఇతర దేశాల నుంచి వివిధ అవసరాలకు నిధులు పొందే అవకాశం ఇరాన్‌కు లభిస్తుంది.
ఈ ఒప్పందం కింద..
ఇరాన్ తన అపకేంద్ర యంత్రాల(సెంట్రిఫ్యుజెస్) సంఖ్యను 19 వేల నుంచి 6,104కి తగ్గించాల్సి ఉంటుంది. ఈ యంత్రాలు అణుబాంబు తయారీకి అవసరమైన అత్యంత శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేస్తాయి.మరో పదేళ్ల పాటు తమ దగ్గరున్న ఆధునిక అపకేంద్ర యంత్రాలను యురేనియం ఉత్పత్తికి ఇరాన్ ఉపయోగించరాదు.తమ వద్ద ఇప్పటికే ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో 98% నిల్వలను తొలగించాలి.తమ దేశంలోని అణు కేంద్రాలను, సరఫరా వ్యవస్థను, యురేనియం గనులను, యురేనియం ఉత్పత్తి, నిల్వ కేంద్రాలను, ప్రయోగ కేంద్రాలను.. అన్నింటినీ అంతర్జాతీయ సమాజం ఎప్పుడైనా తనిఖీ చేసేందుకు ఇరాన్ అంగీకరించాలి.అణ్వాయుధ తయారీకి ఉపయోగపడే ఫ్లుటోనియం ఉత్పత్తిని నిలిపేయాలి.ఈ ఒప్పందంలోని కొన్ని పారదర్శక నిబంధనలు 25 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి.
భారత్ హర్షం
ఇరాన్‌తో ఆరు అగ్రదేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. అణు సంబంధ వివాదాలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్ అభిమతమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో ఇరాన్ ఆర్థిక రంగం తిరిగి గాడిన పడుతుందని భారత్ ఆశిస్తోందన్నారు.