పాక్ అణ్వాయుధాలపై హిల్లరీ ఆందోళన
పాకిస్థాన్‌లోని అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే కనుక జరిగితే పరిస్థితులు భయానకంగా ఉంటాయని చెప్పారు. హిల్లరీ ఈ విషయాలను సన్నిహితుడి వద్ద ప్రస్తావించినట్టు ద న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. 50 నిమిషాల నిడివిగల హిల్లరీ సంభాషణల ఆడియోను డెమొక్రటిక్ పార్టీ కార్యాలయం నుంచి సేకరించింది.
పాకిస్థాన్ భారత్ పట్ల శత్రుత్వ వైఖరిని కొనసాగిస్తూ, కవ్వింపు చర్యలను తీవ్రం చేస్తోందని హిల్లరీ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో జిహాదీలు ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే అణ్వాయుధాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇదే జరిగితే జిహాదీలు సూసైడ్ న్యూక్లియర్ బాంబర్లుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత్ సర్జికల్ దాడులు చేయడం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో హిల్లరీ అభిప్రాయాలను ద న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే, అణ్వాయుధాలను ఉపయోగించి భారత్‌ను నాశనం చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. కశ్మీర్లో మరిన్ని దాడులకు పాల్పడితే భారత్ ఇక సహనంతో ఉండబోదని, ఉగ్రవాదం విషయంలో పాక్ ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రపంచంలో ఏకాకి అయ్యే ప్రమాదముందని ద వాల్ స్ట్రీట్ జర్నల్ హెచ్చరించింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఇవ్వడం మానుకోవాలని, జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు పాక్ మిలటరీ సాయం చేస్తోందని పేర్కొంది. పాకిస్థాన్‌తో ఆర్థిక, దౌత్య సంబంధాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, పాక్ తమ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కొత్త విజన్ ఎంచుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.