nuclear warheads
-
2035 కల్లా చైనా చేతిలో... 1,500 అణు వార్‌హెడ్స్!
వాషింగ్టన్: అణు పాటవంలో అమెరికాకు దీటుగా నిలవడమే లక్ష్యంగా చైనా 2035కల్లా ఏకంగా 1,500 అణు వార్హెడ్లను సమకూర్చుకోనుందని పెంటగాన్ అంచనా వేసింది. ప్రస్తుతం చైనా వద్ద 400కు పైగా అణు వార్‌హెడ్లున్నాయని అభిప్రాయపడింది. అంతేగాక వచ్చే పదేళ్లలో అణ్వస్త్ర బలగాలను ఆధునీకరించి, విస్తృతం చేసుకోవడంపై డ్రాగన్ కంట్రీ దృష్టి పెట్టిందని అమెరికా కాంగ్రెస్‌కు తాజాగా సమర్పించిన వార్షిక నివేదికలో పేర్కొంది. ‘‘ఇందుకోసం ఫ్లుటోనియం ఉత్పత్తిని విపరీతంగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను భారీగా నిర్మించుకుంటోంది. భూ, సముద్ర, గగనతల అణ్వస్త్ర ప్రయోగ వేదికలను వీలైనంతగా పెంచుకోవడంపై విపరీతంగా నిధులు వెచ్చిస్తోంది. 2035కల్లా సైనిక పాటవాన్ని పూర్తిగా ఆధునీకరించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దేశీయ, విదేశాంగ విధానాల ద్వారా ప్రపంచ వేదికపై తన బలాన్ని మరింతగా పెంచుకోవడమే చైనా లక్ష్యం. ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా దూకుడు వెనక కారణమిదే’’ అని వివరించింది. పెంటగాన్ నివేదికను చైనా కొట్టిపారేసింది. -
పాక్‌లోనే అధికంగా అణ్వాయుధాలు
లండన్: భారత్ కన్నా పాకిస్థాన్‌లో అధిక సంఖ్యలో అణు వార్‌హెడ్లున్నాయని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చీ ఇనిస్టిట్యూట్(సిప్రి) వార్షిక నివేదిక తెలిపింది. పాక్‌లో 110 నుంచి 130, భారత్‌లో 100 నుంచి 120 వార్హెడ్లు ఉన్నట్లు అంచనా. అమెరికా, రష్యా అణ్వాయుధాలు తగ్గించుకుంటున్నాయని.. అణు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాయని సిప్రి వెల్లడించింది. చైనా కూడా అణ్వాయుధాలు పెంచుకుంటోందని తెలిపింది. -
130 అణ్వాయుధాలతో భారత్‌పై గురి!
వాషింగ్టన్: ఏ క్షణంలోనైనా భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా పరోక్షంగా చెప్పింది. భారత్‌ను నిరోధించేందుకు ఆ దేశం అణ్వాయుధ సామాగ్రిని కుప్పలుగా సమకూర్చుకుంటుందని, కొనగోళ్లు, తయారీ ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని అమెరికా ఓ రిపోర్ట్ లో వెల్లడించింది. ముఖ్యంగా ఇస్లామాబాద్ దాడి నిరోధక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని తెలిపింది. ఒక వేళ పాకిస్థాన్ పై భారత్ సైనిక చర్య తీసుకుంటే దానిని అడ్డుకుని, నిరోధించేందుకు 110 నుంచి 130 వరకు అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఉందని, అంతకంటే ఎక్కువ ఆయుధాలు కూడా ఉండొచ్చని వెల్లడించింది. అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) అనే సంస్థ ఈ వివరాలను తెలియజేసింది. భారత్‌లో కూడా అణ్వాయుధ సామాగ్రి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆయుధాల విషయంలో రెండు దేశాల మధ్య పోటీ ఏర్పడి అదొక కొత్త సమస్యకు దారి తీయొచ్చని కూడా ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తాము అణ్వాయుధాలుగల దేశంగా ప్రపంచానికి విశ్వాసం కలిగించేందుకు ఇప్పటికే పలుమార్లు పాకిస్థాన్ తన అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించిందని కూడా తెలిపింది.