130 అణ్వాయుధాలతో భారత్పై గురి!
వాషింగ్టన్: ఏ క్షణంలోనైనా భారత్ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా పరోక్షంగా చెప్పింది. భారత్ను నిరోధించేందుకు ఆ దేశం అణ్వాయుధ సామాగ్రిని కుప్పలుగా సమకూర్చుకుంటుందని, కొనగోళ్లు, తయారీ ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని అమెరికా ఓ రిపోర్ట్ లో వెల్లడించింది. ముఖ్యంగా ఇస్లామాబాద్ దాడి నిరోధక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని తెలిపింది.
ఒక వేళ పాకిస్థాన్ పై భారత్ సైనిక చర్య తీసుకుంటే దానిని అడ్డుకుని, నిరోధించేందుకు 110 నుంచి 130 వరకు అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఉందని, అంతకంటే ఎక్కువ ఆయుధాలు కూడా ఉండొచ్చని వెల్లడించింది. అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) అనే సంస్థ ఈ వివరాలను తెలియజేసింది. భారత్లో కూడా అణ్వాయుధ సామాగ్రి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆయుధాల విషయంలో రెండు దేశాల మధ్య పోటీ ఏర్పడి అదొక కొత్త సమస్యకు దారి తీయొచ్చని కూడా ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తాము అణ్వాయుధాలుగల దేశంగా ప్రపంచానికి విశ్వాసం కలిగించేందుకు ఇప్పటికే పలుమార్లు పాకిస్థాన్ తన అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించిందని కూడా తెలిపింది.