‘మేం షాక్.. ఆరుబయట నగ్నంగా తిప్పుతున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ హయాంలో నడుస్తోన్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమం గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి అధికారుల నిర్లక్ష్యం, నిర్లజ్జ వ్యవహారాలు బయటకొచ్చాయి. కనీసం ఉండాల్సిన మానవతా విలువలు కూడా ఆ ఆశ్రమంలో లేకపోవడంపట్ల ఢిల్లీ మహిళా కమిషన్ విస్తుపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే..
ఢిల్లీలో ఆశా కిరణ్ అనే ఓ సంస్థ ఉంది. ఇందులో మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తారు. దీని బాధ్యతలు ప్రభుత్వం చూసుకుంటుంది. అయితే, గత రెండు నెలల్లోనే దాదాపు 11మంది ప్రాణాలుకోల్పోయారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు అక్కడికి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్, మరో సభ్యురాలు ప్రమీలా గుప్తా వెళ్లారు. శనివారం రాత్రంతా అక్కడే ఉండి అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఆ సంస్థలో ఉన్నాయో వారి మాటల్లోనే చూస్తే..
‘స్నానం చేసేందుకు ఆరు బయటే మహిళలను వివస్త్రలను చేసి వరుసగా నిలబెడుతున్నారు. పూర్తి నగ్నంగా ఉన్న స్త్రీలు కారిడార్లో అటు ఇటూ తిరుగుతున్నారు. అదే కారిడార్లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వాటిని ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు పురుషులు. ఈ దృశ్యాలు చూసి మేం దిగ్భ్రాంతి చెందాం. పరిశుభ్రత కొరవడింది. సరిపోయే ఉద్యోగులు లేరు. మానసిక వికలాంగులకు కనీస హక్కులు లేవు. పెద్ద మొత్తంలో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. 350మందికి మాత్రమే సరిపోయే చోటులో 450 మందిని ఉంచారు. దీనిపై ఇప్పటికే మేం సాంఘిక సంక్షేమ శాఖకు నోటీసులు ఇచ్చాం. 72గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించాం. అలాగే మేం కూడా ఒక ప్రత్యేక కమిటీని వేశాం. శర వేగంగా అది దర్యాప్తు పూర్తి చేస్తుంది. ఆ కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం’ అని స్వాతి మాలివాల్ తెలిపారు.