విచారణకు భయపడి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ : నంబర్ లేకుండా ఉన్న ద్విచక్ర వాహనం విషయంలో విచారణ నిమిత్తం పోలీసులు ఓ వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించగా అతడు బయటికి వచ్చి ఇంటికి వెళ్లి ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలో రెండో బస్తీ కాలనీకి చెందిన ఎస్కె.అన్వర్, సల్మా దంపతులు గత రెండేళ్లుగా మానుకోట పట్టణంలో నివాసముంటున్నారు. గత రెండు నెలలుగా పట్టణంలోని ముబీన్ చికెన్ సెంటర్లో అన్వర్ పనిచేస్తున్నాడు. అన్వర్‌కు ఇద్దరు బావమరుదులు ఉన్నారు.
చిన్నబావమరిది యాకూబ్ కొన్నిరోజుల క్రితం ఒక ద్విచక్ర వాహనాన్ని తీసుకొచ్చి తన వద్దే ఉంచుకున్నాడు. ఈ వాహనాన్ని యాకూబ్ అన్న సాధిక్‌తోపాటు అన్వర్ కూడా పట్టణంలో నడిపారు. నంబర్ లేని ఈ వాహనాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు మంగళవారం పట్టణంలోని రైల్వేస్టేçÙన్ దగ్గర ఉన్న సబ్‌కంట్రోల్ వద్ద అతడితో మాట్లాడారు. ఆ బైక్‌ను ఎక్కడ ఎత్తుకొచ్చావని అతడిపై చేయి చేసుకున్నారు. దీంతో అన్వర్ తప్పు తనది కాదని తన ఇద్దరు బావమరుదులను టౌన్ పోలీస్‌స్టేçÙన్కు తీసుకెళ్లాడు. వారితోపాటు అన్వర్ భార్య సల్మా కూడా వెళ్లింది. పోలీసులు విచారణ పేరుతో కొడతారనే భయంతో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అన్వర్ ఇంటికి వెళ్లి కిటికీకి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
గమనించిన స్థానికులు తలుపులు తొలగించి అన్వర్‌ను కాపాడి స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇల్లందు పోలీస్‌స్టేçÙన్లో తనపై కేసు ఉందని ఆ విషయంలోనే తనపై కూడా ఇతర కేసులు బనాయిస్తారనే భయంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపాడు. ఈ విషయమై టౌన్ సీఐ నందిరామ్నాయక్ను వివరణ కోరగా పోలీసులు మంగళవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా నంబర్ లేని ద్విచక్రవాహనం ఉండటంతో ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి సంబంధిత వ్యక్తులను పిలిచినట్లు తెలిపారు. ద్విచక్రవాహన విషయంలో వారిని ఒక్కమాట కూడా అనలేదని బదులిచ్చారు.