Nuroddin
-
మహిళను కాపాడి.. తాను మరణించాడు
* విద్యుదాఘాతంతో ఒకరి మృతి * గోదావరిఖనిలో ఘటన కోల్‌సిటీ : విద్యుత్‌షాక్‌కు గురైన ఓ మహిళను రక్షించబోయిన ఎస్కే.నూరొద్దీన్(38) మృతి చెందిన సంఘటన గోదావరిఖనిలో మంగళవారం జరిగింది. వన్‌టౌన్ ఎస్సై కె.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పవర్‌హౌస్‌కాలనీకి చెందిన నూరొద్దీన్ మున్సిపల్ మార్కెట్లోని చికెన్షాపుల్లో కోళ్లను శుభ్రం చేసే పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం పక్కింటి మహిళ కుంచం నాగమణి ఇనుప తీగపై దుప్పటి ఆరవేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురైంది. ఆమె అరుపులు విన్న నూరొద్దీన్ రక్షించేందుకు తీగను కర్రతో కొట్టాడు. దీంతో ఆ తీగ తెగి నూరొద్దీన్పై పడింది. షాక్‌కు గురైన నూరొద్దీన్ కుప్పకూలిపోయాడు. స్థానికులు నూరోద్దీన్తోపాటు, నాగమణిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నూరొద్దీన్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నాగమణి చికిత్స పొందుతోంది. మృతుడికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. అతడి భార్య హసీనా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. -
సౌండ్ తగ్గించమన్నాడని హత్య
చాదర్‌ఘాట్: లౌడ్ స్పీకర్ విషయంలో జరిగిన ఘర్షణ వృద్ధుడి హత్యకు దారి తీసింది. చాదర్‌ఘాట్ పోలీసుల కథనం ప్రకారం... అజంపురాలో నివాసం ఉండే సయ్యద్ నూరోద్దిన్ (65) ఇంటి పక్కనే ఎలక్ట్రీషియన్ రాజేష్ (28) నివాసం ఉంటున్నాడు. రాజేష్ రెండు నెలలుగా తన ఇంటిపైభాగంలో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి ఎక్కువ సౌండ్ పెడుతున్నాడు. తమకు ఇబ్బందిగా ఉంటోందని సౌండ్ తగ్గించమని నూరోద్దిన్... రాజేష్ తల్లితో రోజూ గొడవ పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లి రాజేష్‌కు చెప్పగా... కోపోద్రిక్తుడైన రాజేష్ ఇంట్లోని తల్వార్‌తో నూరోద్దిన్ చెయ్యి నరకడంతో పాటు తలపై దాడి చేశాడు. దీంతో నూరోద్దిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నూరోద్దిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. స్థానికంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా చాదర్‌ఘాట్ సీఐ వెంకట్‌రెడ్డి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు రాజేష్‌ను పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.