మహిళను కాపాడి.. తాను మరణించాడు
* విద్యుదాఘాతంతో ఒకరి మృతి
* గోదావరిఖనిలో ఘటన
కోల్‌సిటీ : విద్యుత్‌షాక్‌కు గురైన ఓ మహిళను రక్షించబోయిన ఎస్‌కే.నూరొద్దీన్(38) మృతి చెందిన సంఘటన గోదావరిఖనిలో మంగళవారం జరిగింది. వన్‌టౌన్ ఎస్సై కె.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పవర్‌హౌస్‌కాలనీకి చెందిన నూరొద్దీన్ మున్సిపల్ మార్కెట్‌లోని చికెన్‌షాపుల్లో కోళ్లను శుభ్రం చేసే పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం పక్కింటి మహిళ కుంచం నాగమణి ఇనుప తీగపై దుప్పటి ఆరవేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురైంది.
ఆమె అరుపులు విన్న నూరొద్దీన్ రక్షించేందుకు తీగను కర్రతో కొట్టాడు. దీంతో ఆ తీగ తెగి నూరొద్దీన్‌పై పడింది. షాక్‌కు గురైన నూరొద్దీన్ కుప్పకూలిపోయాడు. స్థానికులు నూరోద్దీన్‌తోపాటు, నాగమణిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నూరొద్దీన్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నాగమణి చికిత్స పొందుతోంది. మృతుడికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. అతడి భార్య హసీనా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.