Nursing Courses
-
'దేశంలో మగ టీచర్లే అధికం'
ముంబై: మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలోని ఉపాధ్యాయులపై చేపట్టిన లింగ నిష్పత్తి సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోని బోధన సిబ్బందిలో ఆడవారి కంటే ఎక్కువ మంది మగ ఉపాధ్యాయులు ఉన్నారని వెల్లడించింది. అంతేకాక ఉపాధ్యాయుల లింగనిష్పత్తి అత్యల్పంగా బీహార్‌లో నమోదైనట్లు పేర్కొంది. కానీ ఒక్క నర్సింగ్ కోర్సులోని ఉపాధ్యాయుల్లో మాత్రం భిన్నంగా.. మగవారి కంటే ఎక్కువగా ఆడవారు ఉన్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లోని బోధనేతర సిబ్బందిలోనూ మహిళల కంటే ఎక్కువగా మగవారే ఉన్నట్లు ఈ సర్వేలో నిరూపితమయింది. దేశంలో బోధన సిబ్బంది సంఖ్య మొత్తం 14 లక్షలకు పైగా ఉపాధ్యాయులు ఉండగా.. అందులో మగవారు 57.8 శాతం, మహిళలు 42.2 శాతం ఉన్నారు. బీహార్ మాత్రం అతి తక్కువ మహిళ టీచర్లను కలిగి.. అత్యల్ప లింగ నిష్పత్తితో ప్రథమ స్థానంలో ఉంది. అక్కడి ఉపాధ్యాయుల్లో 78.97 శాతం మగవారు ఉండగా, 21.03 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇదేకోవలో జార్ఖండ్ రెండవ స్థానాన్ని, ఉత్తరప్రదేశ్ మూడవ స్థానాన్ని ఆక్రమించాయి. అయితే వీటికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాల్లో (కేరళ, పంజాబ్, హర్యానా, చంఢీగర్, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ, గోవా) మగ ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని సర్వే నివేదిక వెల్లడించింది. అఖిల భారత స్థాయి బోధన సిబ్బందిలో.. ప్రతి 100 మంది మగ ఉపాధ్యాయులకు.. విశ్వవిద్యాలయ స్థాయిలో 58 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా కళాశాల, స్టాండ్-అలోన్ సంస్థల వారిగా చూసినట్లయితే వరుసగా.. 76, 71 శాతం మంది మహిళలు ఉన్నారు. ముస్లిం మైనారిటీకి చెందిన వారిలో 57 శాతం మంది మహిళలు ఉండగా, ఇతర మైనారిటీల్లో ప్రతి 100 మంది మగవారికి 151 మంది మహిళలు ఉన్నారు. ఇక వికలాంగ(పీడబ్ల్యూడీ) వర్గానికి చెందిన బోధన సిబ్బందిలో.. మగవారికంటే తక్కువగా 37 మంది మహిళలు ఉన్నారు. అయితే మగవారి కంటే అత్యధిక మహిళా ఉపాధ్యాయులు కలిగిన ఏకైక కోర్సు నర్సింగ్. మగ ఉపాధ్యాయులను తోసిరాజని మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. నర్సింగ్ కోర్సులలో 100 మంది మగ ఉపాధ్యాయులకు అత్యధికంగా 330 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని సర్వే తెలిపింది. -
నాసిగా.. ‘నర్సింగ్’
సాక్షి, హైదరాబాద్ : వైద్య రంగంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమైంది. కేవలం వైద్యులతోనే రోగులకు చికిత్స జరగదు. వారికి సాయంగా అత్యంత కీలకపాత్ర పోషించేది నర్సులే. కానీ నర్సింగ్ విద్య రాష్ట్రంలో అత్యంత నాసిరకంగా తయారైంది. ముఖ్యంగా ప్రైవేటు కాలేజీల్లో నర్సింగ్ విద్య మిథ్యగా మారింది. అనేకచోట్ల కేవలం కాగితాలపైనే నర్సింగ్ స్కూళ్లు నడుస్తున్నాయి. బోగస్ అడ్రస్‌లు పెట్టి విద్యార్థులను చేర్చుకొని వారిని నిట్టనిలువునా ముంచుతున్నాయి. కాలేజీలు లేకుండా, తరగతులు నిర్వహించకుండా నడుస్తున్న నర్సింగ్ స్కూళ్లయితే మరీ ఘోరం. ఆ స్కూళ్ల విద్యార్థులు కేవలం పరీక్షల సమయంలోనే వస్తారు. వారిని ఎలాగోలా పాస్ చేయిస్తారు. అలా వారికి సర్టిఫికెట్లు ఇస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్, అదనపు ఫీజు, పాస్ చేయించినందుకు మరికొంత గుంజుతున్నారు. కోర్సు చివరి ఏడాదిలో ఏదో ఆస్పత్రిలో శిక్షణ ఇప్పిస్తారు. ఆ శిక్షణ సమయంలో సంబంధిత ఆస్పత్రి ఎంతోకొంత విద్యార్థులకు వేతనం చెల్లిస్తుంది. అందులో కూడా సగం మేరకు యాజమాన్యాలు తీసుకుంటున్నాయి. దీంతో నర్సింగ్ విద్య తెలియక ఆస్పత్రుల్లో రోగులకు సరైన సేవలు చేయలేక ఇక్కడ చదివిన నర్సులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా నర్సింగ్ కౌన్సిల్ చర్యలూ తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. అనేక నర్సింగ్ స్కూళ్లు విద్యార్థుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. అడ్రస్ లేని నర్సింగ్ స్కూళ్లు.. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 145 నర్సింగ్ స్కూళ్లు ఉన్నాయి. ఇంటర్ అర్హతతో కూడిన మూడేళ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం) కోర్సు అందిస్తున్నాయి. ఈ కోర్సు చేశాక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉద్యోగం వస్తుందని బాలికలు చేరుతుంటారు. ఒక్కో స్కూలులో 45 నుంచి 60 సీట్ల వరకు వాటి సామర్థ్యాన్ని బట్టి ఉన్నాయి. ఈ కోర్సు కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.45 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్కో విద్యార్థికి చెల్లిస్తుంది. దీంతోపాటు ఇతరత్రా ఖర్చులంటూ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నాయి. అంటే 60 సీట్లున్న ఒక్కో కాలేజీకి కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ నుంచే మూడేళ్ల కోర్సులకు ఏడాదికి రూ.81 లక్షలు వస్తుంటాయి. ఇవిగాక విద్యార్థుల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇంతింత పొందుతూ కనీసం తరగతులు నిర్వహించని పరిస్థితి నెలకొంటుంది. అంతేకాదు కనీసం వాటికి సొంత భవనం కూడా లేదు. నర్సింగ్ కౌన్సిల్ జాబితాలో పేర్కొన్న అడ్రస్‌లను పట్టుకొని వెళితే దాదాపు 50 నర్సింగ్ స్కూళ్లు బోగస్ అడ్రస్‌లు ఇచ్చినట్లు సమాచారం. ఒకే భవనంలో 14 స్కూళ్లు.. ఇక ఒకే భవనంలో 14 నర్సింగ్ స్కూళ్లు నడుపుతున్నట్లు సమాచారం. అంటే ఒకే భవనంలో 14 నర్సింగ్ స్కూళ్లు నడుస్తున్నాయని అనుకోవద్దు. ఒక నర్సింగ్ స్కూలు యజమానే, అడ్రస్ లేకుండా కేవలం సర్టిఫికెట్లతో నడిపించే మిగిలిన 13 నర్సింగ్ స్కూళ్లతో ఒప్పందం చేసుకొని వారి విద్యార్థులకు ఇక్కడే తరగతులు చెబుతున్నారు. ఇలా నర్సింగ్ విద్యను ఒక దూరవిద్య విధానంలా ప్రైవేటు యాజమాన్యాలు నడుపుతున్నాయి. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక నర్సింగ్ స్కూలు ఏర్పాటు చేయాలంటే, తప్పనిసరిగా 20 వేల చదరపు అడుగుల వైశాల్యంలో భవనం ఉండాలి. నర్సిం గ్ ల్యాబ్, పీడియాట్రిక్ ల్యాబ్, ప్రీ క్లినికల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, స్టాఫ్ రూం, లైబ్రరీ, ఫ్యాకల్టీ రూం, లెక్చర్ హాల్ ఇలా 11 రకాల అంశాలకు సంబంధించినవి ఉండాలి. అంతేకాదు 100 పడకల ఆస్పత్రితో ఒప్పందం చేసుకొని ఉండాలి. క్లినికల్ ప్రాక్టీస్ చేయిస్తుండాలి. ఒక్కో నర్సింగ్ కాలేజీలో 14 మంది బోధనా సిబ్బంది ఉండాలి. అందులో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, 10 మంది ట్యూటర్లు, ఇద్దరు అదనపు ట్యూటర్లు ఉండాలి. కానీ ఏ స్కూల్లోనూ ఒకరిద్దరు మినహా ఉండటం లేదు. ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లది మరో గోల ప్రైవేటు స్కూళ్ల పరిస్థితి ఇలాగుంటే, ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లది మరో గోలలా ఉంది. అనేక స్కూళ్లకు పక్కా భవనాలు లేవు. మౌలిక సదుపాయాలు అంతంతే. కొన్ని ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లల్లో విద్యార్థుల నుంచే డబ్బులు వసూలు చేసి సరైన ఆహారం కూడా అందించడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్లయితే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి కళాశాల వర్కర్లకు జీతాలు చెల్లిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల హాస్టల్ నిర్వహణ పేరుతో ప్రతీ విద్యార్థి నుంచి నెలకు రూ.50 వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి ఇటీవల నర్సింగ్ విద్యార్థుల ప్రతినిధులు తీసుకొచ్చారు. అలాగే స్టేషనరీ ఖర్చులంటూ నెలకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. విచారించి చర్యలు చేపట్టాలి.. ఇక ప్రతీ చిన్న విషయానికి విద్యార్థులకు జరిమానాలు విధిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. బోగస్ అడ్రస్‌లు పెట్టి, కాగితాలపై కోర్సులు నడుపుతున్న నర్సింగ్ స్కూళ్లను గుర్తించి.. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. బోగస్ స్కూళ్లు స్థాపించి ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతుండటం దారుణం. దీనివల్ల నర్సింగ్ విద్య నాణ్యత తగ్గిపోతుంది. నర్సింగ్ కౌన్సిల్ పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లు, కాలేజీలకు పక్కా భవనాలు లేకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఇటీవల మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేశాను. – గోవర్ధన్, తెలంగాణ నర్సింగ్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు -
నామ్‌కే వాస్తే.. నర్సింగ్ విద్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేకచోట్ల కేవలం కాగితాలపైనే నర్సింగ్ స్కూళ్లు నడుస్తున్నాయి. బోగస్ అడ్రస్‌లు పెట్టి విద్యార్థులను చేర్చుకొని వారిని నిట్టనిలువునా ముంచుతున్నాయి. తరగతులు నిర్వహించకుండానే పరీక్ష రాయించి వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. దీంతో నర్సింగ్ విద్య తెలియక ఆసుపత్రుల్లో రోగులకు సరైన సేవలు చేయలేక వారు ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు చూసి ఉద్యోగమిచ్చిన కార్పొరేట్ ఆసుపత్రులు, వారికి పని రాకపోవడంతో బయటకు గెంటేస్తున్నాయి. దీంతో మూడేళ్ల నర్సింగ్ సర్టిఫికెట్లు పొందినవారు లబోదిబోమంటున్నారు. ఇంత జరుగుతున్నా నర్సింగ్ కౌన్సిల్ ఏ విధమైన చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే ప్రాధాన్యం రాష్ట్రంలో ప్రైవేటురంగంలో 145 నర్సింగ్ స్కూళ్లు ఉన్నాయి. ఇంటర్ అర్హతతో కూడిన మూడేళ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సు అందిస్తున్నాయి. ఈ కోర్సుల కోసం విద్యార్థులు ఎగబడుతుంటారు. ఈ కోర్సు చేశాక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉద్యోగం వస్తుందని బాలికలు చేరుతుంటారు. అయితే నర్సింగ్ స్కూల్ యాజమాన్యాలు వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఒక్కో స్కూలులో 45 నుంచి 60 సీట్ల వరకు వాటి సామర్థ్యాన్ని బట్టి ఉన్నాయి. ఈ కోర్సు కోసం ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఏడాదికి రూ.45 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లిస్తుంది. దీంతోపాటు ఇతరత్రా ఖర్చులంటూ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నాయి. అంటే 60 సీట్లున్న ఒక్కో కాలేజీకి కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ నుంచే ఏడాదికి రూ.27 లక్షలు వస్తుంటాయి. ఇలా మూడేళ్ల కోర్సులకు ఏడాదికి రూ. 81 లక్షలు వస్తుంటాయి. ఇవిగాక విద్యార్థుల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. అవి కలిపితే మరో రూ. 36 లక్షలు వస్తాయి. మొత్తం రూ. 1.17 కోట్లు ఫీజుల రూపంలోనే వస్తున్నాయి. అయితే, ఇంతింత ఫీజులు వసూలు చేస్తున్నా కనీసం తరగతులు కూడా నిర్వహించని పరిస్థితి నెలకొంది. అంతేకాదు కనీసం వాటికి సొంత భవనాలు కూడా లేవు. ఈ అక్రమాలపై కొరడా ఝళిపించాల్సిన అధికారులు మామూళ్లకు కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. బోగస్ అడ్రస్‌లు హైదరాబాద్ ఎల్బీనగర్లో ఒక నర్సింగ్ స్కూలు ఉంది. అలాగే వనస్థలిపురంలో ఒక నర్సింగ్ స్కూలుంది. అవెక్కడున్నాయో ఎవరికీ తెలియదు. దాని ఇంటి నెంబర్, వీధి పేరు ఎక్కడా పేర్కొనలేదు. ఏ అడ్రస్‌కు వెళ్లాలో కూడా తెలియదు. నర్సింగ్ కౌన్సిల్ జాబితాలో పేర్కొన్న అడ్రస్‌లను పట్టుకొని వెళితే దాదాపు 50 నర్సింగ్ స్కూళ్లు బోగస్ అడ్రస్‌లు ఇచ్చినట్లు సమాచారం. విచిత్రమేంటంటే ఒకే భవనంలో 14 నర్సింగ్ స్కూళ్లు నడుస్తున్నాయి. అంటే ఒకే భవనంలో 14 నర్సింగ్ స్కూళ్లు నడుస్తున్నాయని కాదు, ఒక నర్సింగ్ స్కూలు యజమానే, అడ్రస్ లేకుండా కేవలం సర్టిఫికెట్లతో నడిపించే మిగిలిన 13 నర్సింగ్ స్కూళ్లతో ఒప్పందం చేసుకొని వారి విద్యార్థులకు అక్కడే తరగతులు నిర్వహిస్తున్నామని చూపిస్తున్నారు. అందుకోసం కొంత వసూలు చేస్తున్నారు. ఒక్క పూర్వ మెదక్ జిల్లాలోనే 8 నర్సింగ్ స్కూళ్లు ఇలా అక్రమంగా నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకోవాలి బోగస్ అడ్రస్‌లు పెట్టి, కాగితాలపై కోర్సులు నడుపుతున్న నర్సింగ్ స్కూళ్లను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలి. బోగస్ స్కూళ్లతో ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతుండటం దారుణం. దీనివల్ల నర్సింగ్ విద్య నాణ్యత తగ్గిపోతున్నది. –గోవర్ధన్, చైర్మన్, తెలంగాణ నర్సుల సమితి ఫ్యాకల్టీలు ఏరీ? నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక నర్సింగ్ స్కూలు ఏర్పాటు చేయాలంటే, తప్పనిసరిగా 20 వేల చదరపు అడుగుల వైశాల్యంలో భవనం ఉండాలి. నర్సింగ్ ల్యాబ్, పీడియాట్రిక్ ల్యాబ్, ప్రి క్లినికల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, స్టాఫ్ రూం, లైబ్రరీ, ఫ్యాకల్టీ రూం, లెక్చర్ హాల్ ఇలా 11 రకాల అంశాలకు సంబంధించినవి ఉండాలి. అంతేకాదు 100 పడకల ఆసుపత్రితో ఒప్పం దం చేసుకొని ఉండాలి. క్లినికల్ ప్రాక్టీస్ చేయిస్తుండాలి. అంతేకాకుండా ఒక్కో నర్సింగ్ కాలేజీలో 14 మంది బోధనా సిబ్బంది ఉండాలి. అందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్, 10 మంది ట్యూటర్లు, ఇద్దరు అదనపు ట్యూటర్లు ఉండాలి. కానీ ఏ స్కూల్లోనూ ఒకరిద్దరు మినహా ఉండటం లేదు. అసలు కాలేజీ లేకుండా, తరగతులే నిర్వహించకుండా నడుస్తున్న నర్సింగ్ స్కూళ్లు అయితే మరీ ఘోరం. ఆ స్కూళ్ల విద్యార్థులు కేవలం పరీక్షల సమయంలోనే వస్తారు. యాజమాన్యాలు పాస్ చేయిస్తాయి. ఫీజు రీయింబర్స్మెంట్, అదనపు ఫీజు కాకుండా, పాస్ చేయించినందుకు మరికొంత గుంజుతున్నారు. కోర్సు చివరి సంవత్సరంలో ఏదో ఒక ఆసుపత్రిలో శిక్షణ ఇప్పిస్తారు. ఆ శిక్షణ సమయంలో సంబంధిత ఆసుపత్రి ఎంతోకొంత విద్యార్థులకు వేతనం చెల్లిస్తుంది. అందులోనూ సగం యాజమాన్యాలే తీసుకుంటున్నాయి. -
నర్సింగ్ కోర్సులకు ఫీజుల నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ నర్సింగ్ కళాశాలల్లో ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్), ఎంఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఎంపీటీ కోర్సులకు సంబంధించిన ఫీజులు నిర్ణయించారు. ఆయా కళాశాలలు ఇచ్చిన వివరాలను బట్టి ఏ కళాశాలలో ఎంత ఫీజు ఉండాలో అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నివేదిక ఇచ్చిందని, దీని ఆధారంగా ఫీజులు నిర్ణయించినట్టు చెప్పారు. ప్రైవేటు అన్ ఎయిడెడ్ నర్సింగ్, పారామెడికల్ కళాశాలల్లో 2014-15 నుంచి 2016-17 వరకూ నిర్ణయించిన ఫీజులు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ప్రజ్ఞాపూర్‌కు నర్సింగ్ కళాశాల
గజ్వేల్: వైద్య రంగంలో కీలకమైన నర్సిం గ్ కోర్సులను గ్రామీణ విద్యార్థులకు చేరువ చేయాలన్నదే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లోని ఈశ్వరీబాయి మెమోరియల్ నర్సింగ్ కళాశాలను ప్రజ్ఞాపూర్‌కు మార్చనున్న ట్లు ఈశ్వరీబాయి మెమోరియల్ నర్సిం గ్ కళశాల డెరైక్టర్ డాక్టర్ రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రజ్ఞాపూర్‌లోని ఆ ట్రస్ట్ రూరల్ క్యాంపు కార్యాలయంలో వయోవృద్ధులకు ఆరోగ్య సలహాలు, నర్సింగ్ విద్య ప్రాముఖ్యత తదితర అంశాలపై నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. నర్సింగ్ విద్య పై చిన్నచూపు సరికాదన్నారు. సికింద్రాబాద్‌లోని నర్సింగ్ కళాశాలను ప్రజ్ఞాపూర్‌కు మార్చి, ఈ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడేలా చూస్తామన్నారు. ఈ కేంద్రంలో నర్సింగ్కు సంబంధించి పీజీ, గ్రాడ్యుయేషన్ కోర్సులను నడుపుతామన్నారు. కేంద్రానికి అనుబంధంగా బాలికలకు వృత్తి విద్య శిక్షణా కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు. ఈ ప్రాంతంలోని వయోవృద్ధులకు ఆరోగ్య సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. గతంలో తన సతీమణి డాక్టర్ జే గీతారెడ్డి ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్రమంత్రిగా పనిచేయడానికి అన్ని విధాలుగా సహకరించిన ప్రజలు ఈ కేంద్రం విజయవంతంగా నడవడానికి సహకరించాలని కోరారు. సమావేశంలో ఈశ్వరీబాయి మెమోరియల్ కళశాల బాధ్యురాలు మేఘన, గజ్వేల్ మాజీ ఎంపీపీ పొన్నాల రఘుపతిరావు, మాజీ మార్కెట్ కమటీ చైర్మన్ డాక్టర్ వీ యాదవరెడ్డి, జెడ్పీటీసీ జే వెంకటేశం గౌడ్, గజ్వేల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు మల్లయ్య, కుమారస్వామి, కాంగ్రెస్ ఎస్సీ జిల్లా ఉపాధ్యక్షుడు జీ నర్సింలు, నర్సింగ్ కళాశాల డీన్ హేమలత సరోజిని, ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారి, నర్సింగ్ పాఠశాల ప్రిన్సిపాల్ ఏ జోస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ కళాశాల విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
నర్సింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
2013-14 విద్యాసంవత్సరంలో ఎంఎస్సీ(నర్సింగ్), పోస్టు బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) కోర్సుల ప్రవేశ పరీక్షకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మాస్టర్ ఆఫ్ ఫిజయోథెరపీ కోర్సులో ప్రవేశానికి (ఎంట్రెన్స్ లేకుండా) కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ బాబూలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకూ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి దరఖాస్తులను పొందవచ్చని చెప్పారు. ఎంఎస్సీ (నర్సింగ్) ప్రవేశ పరీక్ష దరఖాస్తులు హెచ్‌టీటీపీ://పీజీఎన్టీఆర్యూహెచ్ఎస్.ఓఆర్జీ వెబ్సైట్లోను, పోస్టు బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) దరఖాస్తులు హెచ్‌టీటీపీ://యూజీఎన్టీ ఆర్యూహెచ్ఎస్.ఓఆర్జీ వెబ్సైట్లోను అందుబాటులో ఉంటాయని వివరించారు.