సాక్షి, హైదరాబాద్ : వైద్య రంగంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమైంది. కేవలం వైద్యులతోనే రోగులకు చికిత్స జరగదు. వారికి సాయంగా అత్యంత కీలకపాత్ర పోషించేది నర్సులే. కానీ నర్సింగ్ విద్య రాష్ట్రంలో అత్యంత నాసిరకంగా తయారైంది. ముఖ్యంగా ప్రైవేటు కాలేజీల్లో నర్సింగ్ విద్య మిథ్యగా మారింది. అనేకచోట్ల కేవలం కాగితాలపైనే నర్సింగ్ స్కూళ్లు నడుస్తున్నాయి. బోగస్ అడ్రస్‌లు పెట్టి విద్యార్థులను చేర్చుకొని వారిని నిట్టనిలువునా ముంచుతున్నాయి. కాలేజీలు లేకుండా, తరగతులు నిర్వహించకుండా నడుస్తున్న నర్సింగ్ స్కూళ్లయితే మరీ ఘోరం. ఆ స్కూళ్ల విద్యార్థులు కేవలం పరీక్షల సమయంలోనే వస్తారు. వారిని ఎలాగోలా పాస్ చేయిస్తారు. అలా వారికి సర్టిఫికెట్లు ఇస్తారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, అదనపు ఫీజు, పాస్ చేయించినందుకు మరికొంత గుంజుతున్నారు. కోర్సు చివరి ఏడాదిలో ఏదో ఆస్పత్రిలో శిక్షణ ఇప్పిస్తారు. ఆ శిక్షణ సమయంలో సంబంధిత ఆస్పత్రి ఎంతోకొంత విద్యార్థులకు వేతనం చెల్లిస్తుంది. అందులో కూడా సగం మేరకు యాజమాన్యాలు తీసుకుంటున్నాయి. దీంతో నర్సింగ్ విద్య తెలియక ఆస్పత్రుల్లో రోగులకు సరైన సేవలు చేయలేక ఇక్కడ చదివిన నర్సులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా నర్సింగ్ కౌన్సిల్ చర్యలూ తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. అనేక నర్సింగ్ స్కూళ్లు విద్యార్థుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి.
అడ్రస్ లేని నర్సింగ్ స్కూళ్లు..
రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 145 నర్సింగ్ స్కూళ్లు ఉన్నాయి. ఇంటర్ అర్హతతో కూడిన మూడేళ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్‌ఎం) కోర్సు అందిస్తున్నాయి. ఈ కోర్సు చేశాక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉద్యోగం వస్తుందని బాలికలు చేరుతుంటారు. ఒక్కో స్కూలులో 45 నుంచి 60 సీట్ల వరకు వాటి సామర్థ్యాన్ని బట్టి ఉన్నాయి. ఈ కోర్సు కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.45 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఒక్కో విద్యార్థికి చెల్లిస్తుంది. దీంతోపాటు ఇతరత్రా ఖర్చులంటూ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నాయి. అంటే 60 సీట్లున్న ఒక్కో కాలేజీకి కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ నుంచే మూడేళ్ల కోర్సులకు ఏడాదికి రూ.81 లక్షలు వస్తుంటాయి. ఇవిగాక విద్యార్థుల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇంతింత పొందుతూ కనీసం తరగతులు నిర్వహించని పరిస్థితి నెలకొంటుంది. అంతేకాదు కనీసం వాటికి సొంత భవనం కూడా లేదు. నర్సింగ్ కౌన్సిల్ జాబితాలో పేర్కొన్న అడ్రస్‌లను పట్టుకొని వెళితే దాదాపు 50 నర్సింగ్ స్కూళ్లు బోగస్ అడ్రస్‌లు ఇచ్చినట్లు సమాచారం.
ఒకే భవనంలో 14 స్కూళ్లు..
ఇక ఒకే భవనంలో 14 నర్సింగ్ స్కూళ్లు నడుపుతున్నట్లు సమాచారం. అంటే ఒకే భవనంలో 14 నర్సింగ్ స్కూళ్లు నడుస్తున్నాయని అనుకోవద్దు. ఒక నర్సింగ్ స్కూలు యజమానే, అడ్రస్ లేకుండా కేవలం సర్టిఫికెట్లతో నడిపించే మిగిలిన 13 నర్సింగ్ స్కూళ్లతో ఒప్పందం చేసుకొని వారి విద్యార్థులకు ఇక్కడే తరగతులు చెబుతున్నారు. ఇలా నర్సింగ్ విద్యను ఒక దూరవిద్య విధానంలా ప్రైవేటు యాజమాన్యాలు నడుపుతున్నాయి. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక నర్సింగ్ స్కూలు ఏర్పాటు చేయాలంటే, తప్పనిసరిగా 20 వేల చదరపు అడుగుల వైశాల్యంలో భవనం ఉండాలి. నర్సిం గ్ ల్యాబ్, పీడియాట్రిక్ ల్యాబ్, ప్రీ క్లినికల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, స్టాఫ్ రూం, లైబ్రరీ, ఫ్యాకల్టీ రూం, లెక్చర్ హాల్ ఇలా 11 రకాల అంశాలకు సంబంధించినవి ఉండాలి. అంతేకాదు 100 పడకల ఆస్పత్రితో ఒప్పందం చేసుకొని ఉండాలి. క్లినికల్ ప్రాక్టీస్ చేయిస్తుండాలి. ఒక్కో నర్సింగ్ కాలేజీలో 14 మంది బోధనా సిబ్బంది ఉండాలి. అందులో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, 10 మంది ట్యూటర్లు, ఇద్దరు అదనపు ట్యూటర్లు ఉండాలి. కానీ ఏ స్కూల్‌లోనూ ఒకరిద్దరు మినహా ఉండటం లేదు.
ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లది మరో గోల
ప్రైవేటు స్కూళ్ల పరిస్థితి ఇలాగుంటే, ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లది మరో గోలలా ఉంది. అనేక స్కూళ్లకు పక్కా భవనాలు లేవు. మౌలిక సదుపాయాలు అంతంతే. కొన్ని ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లల్లో విద్యార్థుల నుంచే డబ్బులు వసూలు చేసి సరైన ఆహారం కూడా అందించడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్లయితే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి కళాశాల వర్కర్లకు జీతాలు చెల్లిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల హాస్టల్ నిర్వహణ పేరుతో ప్రతీ విద్యార్థి నుంచి నెలకు రూ.50 వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి ఇటీవల నర్సింగ్ విద్యార్థుల ప్రతినిధులు తీసుకొచ్చారు. అలాగే స్టేషనరీ ఖర్చులంటూ నెలకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు.
విచారించి చర్యలు చేపట్టాలి..
ఇక ప్రతీ చిన్న విషయానికి విద్యార్థులకు జరిమానాలు విధిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. బోగస్ అడ్రస్‌లు పెట్టి, కాగితాలపై కోర్సులు నడుపుతున్న నర్సింగ్ స్కూళ్లను గుర్తించి.. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. బోగస్ స్కూళ్లు స్థాపించి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతుండటం దారుణం. దీనివల్ల నర్సింగ్ విద్య నాణ్యత తగ్గిపోతుంది. నర్సింగ్ కౌన్సిల్ పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లు, కాలేజీలకు పక్కా భవనాలు లేకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఇటీవల మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేశాను.
– గోవర్ధన్, తెలంగాణ నర్సింగ్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment