హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ నర్సింగ్ కళాశాలల్లో ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్), ఎంఎస్‌సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్‌టీ, బీపీటీ, ఎంపీటీ కోర్సులకు సంబంధించిన ఫీజులు నిర్ణయించారు. ఆయా కళాశాలలు ఇచ్చిన వివరాలను బట్టి ఏ కళాశాలలో ఎంత ఫీజు ఉండాలో అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నివేదిక ఇచ్చిందని, దీని ఆధారంగా ఫీజులు నిర్ణయించినట్టు చెప్పారు. ప్రైవేటు అన్ ఎయిడెడ్ నర్సింగ్, పారామెడికల్ కళాశాలల్లో 2014-15 నుంచి 2016-17 వరకూ నిర్ణయించిన ఫీజులు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.