Nutrition for pregnant
-
గర్భిణిపై దాడి... పిండం బయటకు...
టేకులపల్లి: గర్భిణిలకు చిన్నారులకు పోషకాహారం అందించి, వారి ఆరోగ్య సంరక్షణకు కృషి చేయాల్సిన అంగన్వాడీ కేంద్రం రణరంగమైంది. ఓ గర్భిణికి శాపంగా మారింది. ఆమె గర్భంలో పెరుగుతున్న ఆరు నెలల (గర్భస్థ) శిశువు.. ఈ లోకంలోకి రాకుండానే కన్ను మూసింది. పిండం బయటకు వచ్చింది. పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.... మండలంలోని మద్దిరాలతండా గ్రామస్తుడు బాదావత్ లక్ష్మణ్ భార్య పద్మ ఆరు నెలల గర్భిణి. వీరి ఇద్దరు పిల్లలు మేఘనశ్రీ, అభిశ్రీ... స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. ఈ పాఠశాల ఆవరణలోనే అంగన్వాడీ కేంద్రం ఉంది. ఈ నెల 3వ తేదీన మేఘనశ్రీ, మధ్యాహ్న భోజనం ప్లేటుతో అంగన్వాడీ కేంద్రంలోకి వచ్చింది. అక్కడే కూర్చుని తింటోంది. ఆ సమయంలో ఆయా మాలోత్ నీల వచ్చింది. ‘‘నీకు జబ్బు ఉంది. అందరికీ అంటుకుంటుంది. బయటకు వెళ్లిపో’’ అంటూ, తిట్టింది. ఆ చిన్నారి, ఇంటికి వెళ్లిన తరువాత ఈ విషయాన్ని తన తల్లి పద్మతో చెప్పింది. సోమవారం రోజున అంగన్వాడీ కేంద్రానికి పద్మ వెళ్లింది. ‘‘నా బిడ్డను ఎందుకు తిట్టావు...? అంగన్వాడీ కేంద్రంలో ఎందుకు కూర్చోనీయలేదు..?’’ అని, ఆయ మాలోతు నీలను అడిగింది. దీనికి సమాధానంగా, ఆమెను ఆ ఆయా బూతులు తిట్టసాగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అంగన్వాడీ టీచర్ జ్యోతి, పక్కనే ఉన్న పాఠశాల హెచ్ఎం వారించినప్పటికీ గొడవ ఆగలేదు. కొద్దిసేపటి తరువాత, ఆ ఆయా తన భర్త వీరుని పిలిపించింది. ఆ తరువాత గొడవ ఇంకా ఎక్కువైంది. అంగన్వాడీ ఆయా నీల, ఆమె భర్త వీరు కలిసి పద్మను జుట్టు పట్టుకుని విపరీతంగా కొట్టారు. కడుపుపై పిడి గుద్దులు గుద్దారు. ఆరు నెలల గర్భవతయిన పద్మకు తీవ్రంగా రక్త స్రావమైంది. ఆ వెంటనే గర్భస్రావమైంది. పిండం పూర్తిగా బయటపడింది. ఆమె స్పృహ కోల్పోయింది. అంగన్వాడీ టీచర్, గ్రామస్తులు చూస్తుండగానే ఇదంతా జరిగింది. పద్మను ఆమె భర్త లక్ష్మణ్, కుటుంబీకులు కలిసి 108 అంబులెన్స్‌లో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను కొత్తగూడెం రూరల్ సీడీపీఓ కనకదుర్గ పరామర్శించారు. కుటుంబీకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పిండానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ గ్రామంలో టేకులపల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ విచారణ చేపట్టారు. పద్మ భర్త లక్ష్మన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. -
అంగన్వాడీల్లో నెల రోజులుగా గుడ్డు బంద్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మాతా శిశువులు, గర్భిణులకు పోషకాహారం అందించాల్సిన ‘అనుబంధ పౌష్టికాహార’ పథకాన్ని జిల్లా యంత్రాంగం అటకెక్కించింది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు చిన్నారులు, యుక్త వయస్సు ఆడపిల్లలకు ప్రతిరోజూ సరఫరా చేయాల్సిన కోడి గుడ్లకు ఎసరు పెట్టింది. దాదాపు నెల రోజులుగా జిల్లాలో గుడ్ల పంపిణీ నిలిచిపోయింది. కోడిగుడ్ల సరఫరాకు సంబంధించిన పంపిణీదారు (ఏజెన్సీ)లను ఖరారు చేయడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి త లెత్తింది. టెండర్ల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమయిందని తెలుస్తోంది. ధరల ఖరారు తేడాలెన్నో! జిల్లా వ్యాప్తంగా 13 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఒక ప్రాజెక్టు పరిధిలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆహారాన్ని సరఫరా చేస్తుండగా.. మిగిలిన 12ప్రాజెక్టుల పరిధిలోని 50వేల అంగన్వాడీ పిల్లలు, 42వేల మంది బాలింతలు, గర్భిణులు సహా 10వేల మంది యుక్తవయస్సు పిల్లలకు రోజూ మధ్యాహ్నం ఉడకబెట్టిన గుడ్డను ఐసీడీఎస్ పంపిణీ చేస్తోంది. ఏడాది కాలంగా అమలుచేస్తున్న ఈ పథకం ఆగ స్టునాటి వరకు సజావుగానే సాగింది. అయితే గుడ్ల సరఫరా పంపిణీదారుల కాంట్రాక్టు గడువు ముగియడంతో కొత్త ఏజెన్సీల నియామకానికి జాయింట్ కలెక్టర్-2 నేతృత్వంలోని జిల్లా కొనుగోలు కమిటీ(డీపీసీ) చర్యలు చేపట్టింది. అయితే గుడ్ల ధరలను కోట్ చేసే అంశంలో ప్రాజెక్టుల వారీగా తేడాలను పసిగట్టిన జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా పక్కనపెట్టారు. గుడ్ల రవాణా ఖర్చును 75 పైసల చొప్పున కోట్ చేయడాన్ని చూసి అవాక్కయిన ఆయన.. ఈ వ్యవహారంపై లోతుగా విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. గత ఏడాది 78 పైసలు కోట్ చేశామని, ఈసారి సంప్రదింపుల్లో భాగంగా 3 పైసలు కుదించి 75 పైసలకు పరిమితం చేశామని పలువురు పంపిణీదారులు సెలవిచ్చారు. ఒక పంపిణీదారు ఒక్కో గుడ్డు రవాణా ఖర్చును 39 పైసలు కోట్ చేశారని, అలాంటప్పుడు మీకెందుకు గిట్టుబాటుకాదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో నాలుక్కరుచుకున్న పంపిణీదారులు.. మరో పది పైసలు తగ్గించేందుకు అంగీకరించారు. సంక్షేమ హాస్టళ్లకు 40 పైసల్లోపే గుడ్లను రవాణా చేస్తున్నారని, ధరలను తగ్గిస్తే తప్ప టెండర్లను ఖరారు చేసేదిలేది తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే టెండర్ల ప్రక్రియకు బ్రేక్ పడ్డట్లు తెలిసింది. మరోవైపు గుడ్ల సరఫరాలోను భారీ అవకతవకలు జరుగుతున్నట్లు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు అందాయి. పలువురు ఐసీడీఎస్ సీడీపీఓలు గుడ్ల పంపిణీలో తప్పుడు లెక్కలు చూపుతున్నట్లు తేలింది. వీటిపై ఇప్పటికే అంతర్గత విచారణకు ఆదేశించిన ఆ శాఖ ఉన్నతాధికారులు.. ఈ గుట్టును రట్టు చేసేందుకు రికార్డులను పరిశీలించాలని నిర్ణయించినట్లు సమాచారం. టెండర్లను రద్దు చేస్తాం: జేసీ-2 ఎంవీరెడ్డి ‘కోడిగుడ్ల పంపిణీలో పంపిణీదారులు గుడ్డు రవాణా ఖర్చును అసాధారణంగా కోట్ చేశారు. ప్రాజెక్టుల వారీగా వీటిలో భారీ వ్యత్యాసం ఉంది. గుడ్డు రవాణా ఖర్చును కోట్ చేసిన దానికంటే 30పైసలు తగ్గిస్తే టెండర్లను ఖరారుచేసే అంశాన్ని పరిశీలిస్తాం. లేనిపక్షంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి.. రీ టెండర్లను పిలుస్తాం..’