సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మాతా శిశువులు, గర్భిణులకు పోషకాహారం అందించాల్సిన ‘అనుబంధ పౌష్టికాహార’ పథకాన్ని జిల్లా యంత్రాంగం అటకెక్కించింది. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు చిన్నారులు, యుక్త వయస్సు ఆడపిల్లలకు ప్రతిరోజూ సరఫరా చేయాల్సిన కోడి గుడ్లకు ఎసరు పెట్టింది. దాదాపు నెల రోజులుగా జిల్లాలో గుడ్ల పంపిణీ నిలిచిపోయింది. కోడిగుడ్ల సరఫరాకు సంబంధించిన పంపిణీదారు (ఏజెన్సీ)లను ఖరారు చేయడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి త లెత్తింది. టెండర్ల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమయిందని తెలుస్తోంది.
ధరల ఖరారు తేడాలెన్నో!
జిల్లా వ్యాప్తంగా 13 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఒక ప్రాజెక్టు పరిధిలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆహారాన్ని సరఫరా చేస్తుండగా.. మిగిలిన 12ప్రాజెక్టుల పరిధిలోని 50వేల అంగన్‌వాడీ పిల్లలు, 42వేల మంది బాలింతలు, గర్భిణులు సహా 10వేల మంది యుక్తవయస్సు పిల్లలకు రోజూ మధ్యాహ్నం ఉడకబెట్టిన గుడ్డను ఐసీడీఎస్ పంపిణీ చేస్తోంది. ఏడాది కాలంగా అమలుచేస్తున్న ఈ పథకం ఆగ స్టునాటి వరకు సజావుగానే సాగింది. అయితే గుడ్ల సరఫరా పంపిణీదారుల కాంట్రాక్టు గడువు ముగియడంతో కొత్త ఏజెన్సీల నియామకానికి జాయింట్ కలెక్టర్-2 నేతృత్వంలోని జిల్లా కొనుగోలు కమిటీ(డీపీసీ) చర్యలు చేపట్టింది. అయితే గుడ్ల ధరలను కోట్ చేసే అంశంలో ప్రాజెక్టుల వారీగా తేడాలను పసిగట్టిన జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా పక్కనపెట్టారు. గుడ్ల రవాణా ఖర్చును 75 పైసల చొప్పున కోట్ చేయడాన్ని చూసి అవాక్కయిన ఆయన.. ఈ వ్యవహారంపై లోతుగా విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. గత ఏడాది 78 పైసలు కోట్ చేశామని, ఈసారి సంప్రదింపుల్లో భాగంగా 3 పైసలు కుదించి 75 పైసలకు పరిమితం చేశామని పలువురు పంపిణీదారులు సెలవిచ్చారు.
ఒక పంపిణీదారు ఒక్కో గుడ్డు రవాణా ఖర్చును 39 పైసలు కోట్ చేశారని, అలాంటప్పుడు మీకెందుకు గిట్టుబాటుకాదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో నాలుక్కరుచుకున్న పంపిణీదారులు.. మరో పది పైసలు తగ్గించేందుకు అంగీకరించారు. సంక్షేమ హాస్టళ్లకు 40 పైసల్లోపే గుడ్లను రవాణా చేస్తున్నారని, ధరలను తగ్గిస్తే తప్ప టెండర్లను ఖరారు చేసేదిలేది తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే టెండర్ల ప్రక్రియకు బ్రేక్ పడ్డట్లు తెలిసింది. మరోవైపు గుడ్ల సరఫరాలోను భారీ అవకతవకలు జరుగుతున్నట్లు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు అందాయి. పలువురు ఐసీడీఎస్ సీడీపీఓలు గుడ్ల పంపిణీలో తప్పుడు లెక్కలు చూపుతున్నట్లు తేలింది. వీటిపై ఇప్పటికే అంతర్గత విచారణకు ఆదేశించిన ఆ శాఖ ఉన్నతాధికారులు.. ఈ గుట్టును రట్టు చేసేందుకు రికార్డులను పరిశీలించాలని నిర్ణయించినట్లు సమాచారం.
టెండర్లను రద్దు చేస్తాం: జేసీ-2 ఎంవీరెడ్డి
‘కోడిగుడ్ల పంపిణీలో పంపిణీదారులు గుడ్డు రవాణా ఖర్చును అసాధారణంగా కోట్ చేశారు. ప్రాజెక్టుల వారీగా వీటిలో భారీ వ్యత్యాసం ఉంది. గుడ్డు రవాణా ఖర్చును కోట్ చేసిన దానికంటే 30పైసలు తగ్గిస్తే టెండర్లను ఖరారుచేసే అంశాన్ని పరిశీలిస్తాం. లేనిపక్షంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి.. రీ టెండర్లను పిలుస్తాం..’
అంగన్‌వాడీల్లో నెల రోజులుగా గుడ్డు బంద్
Published Thu, Sep 19 2013 11:45 PM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM
Advertisement
Advertisement