బాలనేరస్తులను జైళ్లకు పంపరు
న్యూఢిల్లీ: చట్టాన్ని అతిక్రమించే 16-18 ఏళ్ల వయసున్న బాలనేరస్థులకు బేడీలు వేయకుండా, లాకప్‌లో పెట్టకుండా పునరావాస కేంద్రాలకు తరలించేలా ‘జువెనైల్ జస్టిస్ చట్టం-2015’ను రూపొందించినట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆమె ఈ చట్టం ముసాయిదాను విడుదల చేశారు. బాలనేరస్తులతో పోలీసులు, జువెనైల్ జస్టిస్ బోర్డులు(జేజేబీ) వ్యవహరించాల్సిన తీరు, ఈ కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులకు సంబంధించిన వివరాలు చెప్పాలి.. ముసాయిదా ప్రకారం కేసు నమోదైన 30 రోజుల్లోపు నేరస్తుని వయసును జేజేబీ నిర్ధారించాలి. ప్రతి రాష్ట్రం వీరి పునరావాసాకి కనీసం ఒక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి.
పౌష్టికాహార సమీక్షకు సాఫ్ట్వేర్: అంగన్వాడీల్లో అందిస్తున్న పౌష్టికాహార సేవలను ఎప్పటికప్పుడు సమీక్షించే సాఫ్ట్‌వేర్‌ను మేనక ప్రారంభించారు. దీన్ని బిల్‌గేట్స్ ఫౌండేషన్ రూపొందించింది. అంగన్వాడీ సూపర్వైజర్లు ట్యాబ్‌ల్లోని యాప్ ద్వారా వివరాలను అప్డేట్ చేస్తారు.