Nuzvid IIIT
-
నూజివీడు ట్రిపుల్ ఐటీలో డ్రోన్ ఎక్స్‌లెన్స్ సెంటర్
సాక్షి, అమరావతి: డ్రోన్లపై జరుగుతున్న పరిశోధనలకు చేయూతనిచ్చేందుకు నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ సీఈవో ఆళ్ల రవీంద్ర రెడ్డి తెలియజేశారు. డ్రోన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఇన్వెస్ట్మెంట్ పాలసీని రూపొంది స్తున్నట్లు శుక్రవారం ఆయన ‘సాక్షి’కి తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడం కోసం కర్నూలు జిల్లాలో ప్లగ్ అండ్ ప్లే విధానంలో సుమారు 100 ఎకరాల్లో ఒక డ్రోన్ పార్కును ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెప్పారు. అమెరికాకు చెందిన ప్రముఖ డ్రోన్ తయారీ కంపెనీ డీజేఐ రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో సుమారు 600 డ్రోన్లను వినియోగిస్తున్నట్లు అనధికారిక అంచనాగా ఉందని, అయితే వీటి వినియోగానికి సంబంధిత జిల్లా ఎస్పీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రవీంద్రరెడ్డి స్పష్టం చేశారు. డ్రోన్ల వినియోగంపై ఆపరేటర్లకు అవగాహన కల్పించేందుకు డిసెంబర్ రెండో వారంలో రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. -
తెలుగు విద్యార్థికి ఏడాదికి కోటి జీతం
నూజివీడు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించాలనే ఆశయంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీల లక్ష్యం నెరవేరుతోంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2008–14 సంవత్సరాల మధ్య చదివిన మొదటి బ్యాచ్ విద్యార్థి ఆడారి మణికుమార్ అమెరికాలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా ఏడాదికి రూ.కోటికి పైగా వేతనంతో ఉద్యోగాన్ని సాధించారు. విశాఖ జిల్లా మారుమూల గ్రామం నుంచి అమెరికాలో ఆకర్షణీయ ఉద్యోగం వరకు సాగిన మణికుమార్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. విశాఖ జిల్లా చింతలగ్రహారం గ్రామానికి చెందిన ఆడారి రాము, మీనాక్షి దంపతుల ఏకైక కుమారుడు మణికుమార్. ఇతనికి ఇద్దరు తోబుట్టువులు. అదే గ్రామంలోని హైస్కూల్లో 2008లో పదో తరగతిలో 600కు గాను 548 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు దక్కించుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే ప్రముఖ ప్రోగ్రామింగ్ వెబ్సైట్లను అనుసరిస్తూ అల్గారిథమ్ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే నైపుణ్యాన్ని సంపాదించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించారు. మణికుమార్ బీటెక్ మూడో సంవత్సరంలో ఉండగానే అమెజాన్ మిషన్ లెర్నింగ్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇష్టమే నడిపించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆసక్తి ఏర్పడటంతో మణికుమార్ అదే రంగంలో ఉద్యోగం చేయాలనుకున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్కు వచ్చిన కంపెనీల్లో ఉద్యోగం నచ్చకపోవడంతో ఇంటర్వ్యూలకు హాజరు కాలేదు. బీటెక్ పూర్తయిన తర్వాత ఒక స్టార్టప్ కంపెనీలో ఏడాదికి రూ.8 లక్షల వేతనానికి చేరారు. దాన్ని స్నాప్‌డీల్ సంస్థ కొనుగోలు చేసింది. కొద్దికాలం అందులో పనిచేసిన అతనికి 2015లో అమెజాన్ సంస్థలో అవకాశం వచ్చింది. అమెజాన్‌కు ఇండియాలో రెండేళ్లు పనిచేశారు. అప్పట్లో ఏడాదికి రూ.18 లక్షల వేతనం అందుకునేవారు. తర్వాత ప్రమోషన్‌తోపాటు అదే కంపెనీకి అమెరికాలో పనిచేసే అవకాశం వచ్చింది. అమెరికాలో ఏడాదికి రూ.40 లక్షల వేతనంతో ఉద్యోగంలో చేరారు. రెండేళ్లు పనిచేశాక.. ప్రస్తుత వేతనం రూ.కోటి దాటింది. నిరుపేద కుటుంబం నుంచి.. మణికుమార్ తండ్రి ఆడారి రాము గ్రామంలో ఎలక్ట్రీషియన్ కాగా.. తల్లి వ్యవసాయ పనులకు వెళ్తుండేది. తనతోపాటు ఇద్దరు అక్కలను చదివించడానికి తల్లిదండ్రులు నిరంతరం శ్రమించడాన్ని చిన్నతనం నుంచే గమనిస్తూ వారి నుంచే ప్రేరణ పొందానని మణికుమార్ పేర్కొన్నారు. -
54 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
‘నూజివీడు’ ట్రిపుల్ఐటీ యాజమాన్యం నిర్ణయం నూజివీడు: క్రమశిక్షణ ఉల్లంఘించి తోటి విద్యార్థులపై దాడికి తెగబడిన నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థులపై యాజమాన్యం కొరడా ఝుళిపించింది. 54 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. గతనెల 29వ తేదీ అర్ధరాత్రి కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు కలిసి ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారనే అక్కసుతో 12మంది తోటి విద్యార్థులను హాస్టల్లోని తమ గదులకు పిలచి చితకబాదిన సంగతి తెలిసిందే. దీనిపై యాజమాన్యం.. విచారణ జరిపి దాడికి పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకుంది. వివరాలను నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు సోమవారం విలేకర్లకు తెలిపారు. కొందరు విద్యార్థులు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తూ ఫ్యాకల్టీకి ప్రతి విషయాన్ని చేరవేస్తున్నారని వారిపై అక్కసు పెంచుకుని దాడికి పాల్పడినట్లుగా తేలిందని పేర్కొన్నారు. ర్యాగింగ్ అనేదే ట్రిపుల్‌ఐటీలో లేదన్నారు. ఈ సంఘటనపై ఈనెల ఒకటిన కమిటీ నియమించామని, కమిటీ సిఫార్సుల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సంఘటనకు ప్రధాన కారణమైన ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులను శాశ్వతంగా సస్పెండ్ చేశామని, వీరు యాజమాన్యం అనుమతి తీసుకుని పరీక్షలు మాత్రం రాసుకోవచ్చన్నారు. -
ట్రిపుల్ ఐటీలో 15 మంది సీనియర్లపై వేటు
-
నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలన నిర్ణయం
కృష్ణా : నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ర్యాగింగ్‌కు పాల్పడ్డ మొత్తం 54 మంది విద్యార్థులపై సస్పెన్షన్ విధించారు. వీరిలో 15 మంది విద్యార్థులపై ఏడాది పాటు, ఆరుగురిపై శాశ్వతంగా వేటు పడింది. 'తలెత్తుకుని ఎందుకు వెళ్తున్నావు.. ఫోన్ లో వాట్సాప్ ఎందుకు వాడటం లేదు. కొడితే ఏడుస్తావా?.. ఇవన్నీ బయటకు చెబితే ప్రాణాలు తీస్తామంటూ' ట్రిఫుల్ ఐటీలోని నాల్గో సంవత్సరం విద్యార్థులు థర్డ్ ఇయర్ విద్యార్థులను బెదిరించిన తీరిది. దీంతో పాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులకు ఈ3 కి చెందిన కొందరు విద్యార్థులు ఇన్ఫార్మర్లుగా ఉన్నారని ద్వేషం పెంచుకున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు గత నెల 29న అర్ధరాత్రి దాటిన తర్వాత 20 మందికి పైగా జూనియర్లను ఒక్కొక్కరినీ గదిలోకి రప్పించి కొట్టి బయటకు పంపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ జూనియర్లు భయంతో కాలేజీని వదిలిపెట్టేందుకు సిద్దపడ్డారు. దీంతో ర్యాగింగ్ ఘటన పై ప్రత్యేక కమిటీని నియమించారు. దర్యాప్తులో సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తేలడంతో మొత్తం 54 మంది విద్యార్థులపై సస్పెన్షన్ విధించారు. -
‘అక్కడ ర్యాగింగ్ వాస్తవమే’
సాక్షి, నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ జరిగింది వాస్తవమేనని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, ప్రొఫెసర్ వీరంకి వెంకటదాసు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. క్యాంపస్ లోని కొందరు సీనియర్లు తమ జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు. ఇందుకు కొందరు ట్రిపుల్ ఐటీ సిబ్బంది కూడా సహకరించారని సంచలన విషయాలు వెల్లడించారు. తమపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీనియర్లతో పాటు సిబ్బంది కూడా జూనియర్లను బెదిరించినట్లు చెప్పారు. ప్రాథమికంగా ర్యాగింగ్‌కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను గుర్తించామన్నారు. వారిపై చర్యలు తీసుకుంటామని ప్రొఫెసర్ వెంకటదాసు వివరించారు. 'తలెత్తుకుని ఎందుకు వెళ్తున్నావు.. ఫోన్ లో వాట్సాప్ ఎందుకు వాడటం లేదు. కొడితే ఏడుస్తావా?.. ఇవన్నీ బయటకు చెబితే ప్రాణాలు తీస్తామంటూ' ట్రిఫుల్ ఐటీలోని నాల్గో సంవత్సరం విద్యార్థులు థర్డ్ ఇయర్ విద్యార్థులను బెదిరించిన తీరిది. దీంతో పాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులకు ఈ3కి చెందిన కొందరు విద్యార్థులు ఇన్ఫార్మర్లుగా ఉన్నారని ద్వేషం పెంచుకున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు మంగళవారం అర్ధరాత్రి దాటిన 20 మందికి పైగా జూనియర్లను ఒక్కొక్కరినీ గదిలోకి రప్పించి కొట్టి బయటకు పంపించడం కలకలం రేపింది. మూడు రోజులు గడుస్తున్నా సీనియర్లపై చర్యలు తీసుకోకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని ఈ3 విద్యార్థులు హెచ్చరించిన నేపథ్యంలో డైరెక్టర్, ప్రొఫెసర్ వీరంకి వెంకటదాసు మాట్లాడుతూ.. ర్యాగింగ్ కు పాల్పడిన వారిని గుర్తించామని, చర్యలు తీసుకుంటామని పేర్కొనడం బాధిత విద్యార్థులకు ఊరట కలిగించే విషయమే. -
నూజీవీడు ట్రిపుల్‌ఐటీకీ సూపర్ న్యూమరరీ సీట్లు
నూజివీడు ట్రిపుల్ఐటీ పరిధిలోని శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్న 8జిల్లాలకు 96 సూపర్ న్యూమరరీ సీట్లను కేటాయించారు. ఈ సీట్లకు ఈనెల 13న ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ట్రిపుల్ఐటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మేరుగు అర్జునరావు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటీవల నిర్వహించిన ప్రవేశాలలో భాగంగా ఈ ఎనిమిది జిల్లాల్లోని 96మండలాలకు నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీట్లు దక్కలేదు. ఈ విషయం ఈనెల 11న నూజివీడు ట్రిపుల్ఐటీకి విచ్చేసిన ఛాన్సలర్ డీ రాజ్‌రెడ్డి దృష్టికి వెళ్ళడంతో ఆయన వెంటనే అన్ని మండలాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనని ఆదేశించారు. దీంతో సూపర్ న్యూమరరీ సీట్లను కేటాయించి వాటిని భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు 11, విజయనగరానికి 5, విశాఖపట్నంకు 14, తూర్పుగోదావరికి 12, పశ్చిమగోదావరికి 6, కృష్ణాకు 14, గుంటూరుకు 11, ప్రకాశంకు 23 సీట్లు కేటాయించారు.