
‘అక్కడ ర్యాగింగ్ వాస్తవమే’
సాక్షి, నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ జరిగింది వాస్తవమేనని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, ప్రొఫెసర్ వీరంకి వెంకటదాసు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. క్యాంపస్ లోని కొందరు సీనియర్లు తమ జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు.
ఇందుకు కొందరు ట్రిపుల్ ఐటీ సిబ్బంది కూడా సహకరించారని సంచలన విషయాలు వెల్లడించారు. తమపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీనియర్లతో పాటు సిబ్బంది కూడా జూనియర్లను బెదిరించినట్లు చెప్పారు. ప్రాథమికంగా ర్యాగింగ్‌కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను గుర్తించామన్నారు. వారిపై చర్యలు తీసుకుంటామని ప్రొఫెసర్ వెంకటదాసు వివరించారు.
'తలెత్తుకుని ఎందుకు వెళ్తున్నావు.. ఫోన్ లో వాట్సాప్ ఎందుకు వాడటం లేదు. కొడితే ఏడుస్తావా?.. ఇవన్నీ బయటకు చెబితే ప్రాణాలు తీస్తామంటూ' ట్రిఫుల్ ఐటీలోని నాల్గో సంవత్సరం విద్యార్థులు థర్డ్ ఇయర్ విద్యార్థులను బెదిరించిన తీరిది. దీంతో పాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులకు ఈ3కి చెందిన కొందరు విద్యార్థులు ఇన్ఫార్మర్లుగా ఉన్నారని ద్వేషం పెంచుకున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు మంగళవారం అర్ధరాత్రి దాటిన 20 మందికి పైగా జూనియర్లను ఒక్కొక్కరినీ గదిలోకి రప్పించి కొట్టి బయటకు పంపించడం కలకలం రేపింది.
మూడు రోజులు గడుస్తున్నా సీనియర్లపై చర్యలు తీసుకోకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని ఈ3 విద్యార్థులు హెచ్చరించిన నేపథ్యంలో డైరెక్టర్, ప్రొఫెసర్ వీరంకి వెంకటదాసు మాట్లాడుతూ.. ర్యాగింగ్ కు పాల్పడిన వారిని గుర్తించామని, చర్యలు తీసుకుంటామని పేర్కొనడం బాధిత విద్యార్థులకు ఊరట కలిగించే విషయమే.