Nyutrin factory
-
న్యూట్రిన్ కార్మికుల నిరసన
► కుటుంబసభ్యులతో కలిసి ఫ్యాక్టరీ వద్ద బైఠాయింపు ► వైఎస్సార్సీపీ, సీఐటీయూ నాయకుల మద్దతు ► ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసేశారని ఆందోళన చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులు గురువారం కుటుం బసభ్యులతో కలిసి ఫ్యాక్టరీ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఫ్యాక్టరీని మూసివేయడాన్ని నిరసిస్తూ కార్మికులు దాదాపు 150 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం చేపట్టిన దీక్షలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పీవీ.గాయత్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చైతన్య తదితరులు పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ అరవై ఏళ్ల చరిత్ర ఉన్న న్యూట్రిన్ ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసేసి, కార్మికులను రోడ్డున పడేయడం మంచిదికాదన్నారు. ముఖ్యమంత్రి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, టీపీడీ ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు చిత్తూరులో ఉన్నా కార్మికుల కష్టాలను పట్టించుకోవడంలో విఫలమయ్యారన్నారు. కలెక్టర్ సైతం చోద్యం చూస్తున్నారే తప్ప కార్మికులకు న్యాయం చేయడం లేదన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కుట్రపన్ని శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికుల్ని తొలగించి, కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయించడానికి చూస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కార్మికుల కష్టాలను గుర్తించాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులు జ్ఞానజగదీష్, దినకరన్, నరేష్ చంద్రారెడ్డి, కుట్టిరాయల్, సీఐటీయూ నాయకులు చంద్రయ్య, ఆరోగ్యదాస్, న్యూట్రిన్ కార్మిక సంఘ నాయకులు పూర్ణచంద్రారెడ్డి, మురుగేశ్, వేలుస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం దీక్షలో పాల్గొన్న కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు గాయత్రీదేవి భోజనాలను అందజేశారు. రూ.7ల కూలి నుంచి పనిచేస్తున్నారు మా ఇంటాయన రూ.7ల కూలి నుంచి న్యూట్రిన్లోనే పనిచేస్తా ఉండారు. ఉన్నట్టుండి పని లేదని బయటకు పొమ్మన్నారు. ఆర్నెలలుగా పనిలేదు. ఇల్లు గడిచేదే కష్టంగా ఉంది. ఏసీల్లో పనిచేసే వాళ్లకు లక్షలు ఇస్తా ఉండారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తా ఉండేవారిని పట్టించుకోరు. ఇదేనా న్యాయం? - శివగామి, చిత్తూరు కంటి నిండా నిద్రలేదు.. నా భర్త చనిపోయాడు. ఉన్న కొడుకు ఫ్యాక్టరీలో పనిచేసి వచ్చే జీతంలో మేమంతా బతకతా ఉండాము. పనిలేకుండా చెట్టంత కొ డుకు రాత్రులు ఆలోచనలు చేస్తా ఉండాడు. నిద్ర లేకుండా గడప తా ఉండాము. మాకు ఏదో ఒకటి చేయండి. - కన్నమ్మ, చిత్తూరు -
లాకౌట్ దిశగా న్యూట్రిన్ ఫ్యాక్టరీ
చిత్తూరు (అర్బన్): ఆరు దశాబ్దాలకుపైగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న చిత్తూరు న్యూట్రిన్ ఫ్యాక్టరీ(ప్రస్తుత హర్షీస్) లాకౌట్ బాట పడుతోంది. ఫ్యాక్టరీలో ఏ క్షణంలో అయినా లాకౌట్ ప్రకటించవచ్చని యాజమాన్యం నుంచి సంకేతాలు రావడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మికుల ఆందోళన ఫ్యాక్టరీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ కార్మికులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి దీన్నే నమ్ముకుని పనిచేస్తున్న తమ కడుపులు కొట్టి ఫ్యాక్టరీను మూసివేయడం మంచిది కాదని వాపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్, చిత్తూరు యువజన కన్వీనర్ నారాయణ, బీసీ కన్వీనర్ జ్ఞాన జగదీష్ తదితరులు న్యూట్రిన్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులకు అండగా నిలిచారు. అలాగే వైఎస్ఆర్టీయూసీనాయకులు రమేష్, పూర్ణచంద్రారెడ్డి, గోవిందు, గంగాధరం, రమేష్, మురుగేష్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలో వైఎస్ఆర్టీయూసీ సమక్షంలో రెండేళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకున్న యాజమాన్యం ఉన్నపళంగా కార్మికులను రోడ్డున పడేయడం మంచిది కాదని గాయత్రీదేవి ధ్వజమెత్తారు. దీనికి తోడు ఫ్యాక్టరీలో ఉన్న వైఎస్సార్టీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ యూనియన్లలో ఒక్కో యూనియన్ నుంచి ఏడుగురు చొప్పున చర్చలకు పిలిచిన ఉన్నతాధికారులు కార్మికులు స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే వారికి అందించాల్సిన ప్రోత్సాహకాలు అందుతాయని చెప్పినట్లు కార్మిక సంఘాలు తెలిపారు. మరో 15 రోజుల వరకు అవకాశం ఇస్తామని అప్పటిలోపు వీఆర్ఎస్ ఇవ్వాలని చెప్పినట్లు కార్మికులు పేర్కొన్నారు. అయితే ఈ నెల 2వ తేదీ నుంచే ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు సమాచారం అందిందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. భారీ భద్రత ఫ్యాక్టరీ మూత పడుతున్నట్లు వార్తలు రావడం, కార్మికులు ఫ్యాక్టరీ వద్దకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టూటౌన్ సీఐ సూర్యమోహనరావు ఆదేశాలతో ఎస్ఐ లక్ష్మణ్‌రెడ్డి, ఇతర సిబ్బందితో కలిసి ఫ్యాక్టరీ వద్ద పెద్ద ఎత్తున భద్రత కల్పించారు. దాదాపు 50 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. ఆరు దశాబ్దాల సేవలు 1953లో న్యూట్రిన్ కన్ఫెక్షనరీ పేరిట చిత్తూరులో చాక్లెట్ల తయారీ ప్రారంభమైంది. దాని తరువాత 2006లో గోద్రెజ్ కంపెనీ దీన్ని కొనుగోలు చేసింది. 2008లో గోద్రెజ్, హర్షీస్ సంయుక్తంగా నడిపాయి. 2012 నుంచి ఫ్యాక్టరీ పూర్తిగా హర్షీస్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 300 మంది వరకు శాశ్వత కార్మికులు, 300 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అయితే నెలకు 4 వేల టన్నుల ఉత్పత్తి ఉన్న చాక్లెట్లు ఒక్క సారిగా 400 టన్నులకు పడిపోవడంతో ఫ్యాక్టరీను లాకౌట్ చేయడానికి నిర్ణయించుకున్నట్లు యాజ మాన్యం ప్రకటించింది. దీంతో ఈ నెల 9న ఇక్కడ పనిచేస్తున్న అధికారులకు, కార్మికుల నుంచి సలహాలు కోరింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో అదనపు భారం పడుతోందని, దీనిపై సలహాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసినట్లు యాజమాన్యం చెబుతోంది. ఉద్యోగుల నుంచి స్పందన రాకపోవడంతో ఈ నెల 18న మరో నోటీసును బోర్డులో ఉంచారు. అక్టోబరు నుంచి ఉత్పత్తి అనుమానమేనంటూ నోటీసులో స్పష్టం చేశారు. దీంతో ఒక్క సారిగా కార్మికుల్లో ఆందోళన నెలకొంది.