న్యూట్రిన్ కార్మికుల నిరసన
► కుటుంబసభ్యులతో కలిసి ఫ్యాక్టరీ వద్ద బైఠాయింపు
► వైఎస్సార్‌సీపీ, సీఐటీయూ నాయకుల మద్దతు
► ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసేశారని ఆందోళన
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులు గురువారం కుటుం బసభ్యులతో కలిసి ఫ్యాక్టరీ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఫ్యాక్టరీని మూసివేయడాన్ని నిరసిస్తూ కార్మికులు దాదాపు 150 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం చేపట్టిన దీక్షలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పీవీ.గాయత్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చైతన్య తదితరులు పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ అరవై ఏళ్ల చరిత్ర ఉన్న న్యూట్రిన్ ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసేసి, కార్మికులను రోడ్డున పడేయడం మంచిదికాదన్నారు. ముఖ్యమంత్రి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, టీపీడీ ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు చిత్తూరులో ఉన్నా కార్మికుల కష్టాలను పట్టించుకోవడంలో విఫలమయ్యారన్నారు.
కలెక్టర్ సైతం చోద్యం చూస్తున్నారే తప్ప కార్మికులకు న్యాయం చేయడం లేదన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కుట్రపన్ని శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికుల్ని తొలగించి, కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయించడానికి చూస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కార్మికుల కష్టాలను గుర్తించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులు జ్ఞానజగదీష్, దినకరన్, నరేష్ చంద్రారెడ్డి, కుట్టిరాయల్, సీఐటీయూ నాయకులు చంద్రయ్య, ఆరోగ్యదాస్, న్యూట్రిన్ కార్మిక సంఘ నాయకులు పూర్ణచంద్రారెడ్డి, మురుగేశ్, వేలుస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం దీక్షలో పాల్గొన్న కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు గాయత్రీదేవి భోజనాలను అందజేశారు.
రూ.7ల కూలి నుంచి పనిచేస్తున్నారు
మా ఇంటాయన రూ.7ల కూలి నుంచి న్యూట్రిన్‌లోనే పనిచేస్తా ఉండారు. ఉన్నట్టుండి పని లేదని బయటకు పొమ్మన్నారు. ఆర్నెలలుగా పనిలేదు. ఇల్లు గడిచేదే కష్టంగా ఉంది. ఏసీల్లో పనిచేసే వాళ్లకు లక్షలు ఇస్తా ఉండారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తా ఉండేవారిని పట్టించుకోరు. ఇదేనా న్యాయం? - శివగామి, చిత్తూరు
కంటి నిండా నిద్రలేదు..
నా భర్త చనిపోయాడు. ఉన్న కొడుకు ఫ్యాక్టరీలో పనిచేసి వచ్చే జీతంలో మేమంతా బతకతా ఉండాము. పనిలేకుండా చెట్టంత కొ డుకు రాత్రులు ఆలోచనలు చేస్తా ఉండాడు. నిద్ర లేకుండా గడప తా ఉండాము. మాకు ఏదో ఒకటి చేయండి. - కన్నమ్మ, చిత్తూరు