O madhu
-
ప్రేమతో..
www.youtube.com/watch?v=4EzmS5pcZuQ ప్రేమ.. మనసుల్లో చిగురించి మనుషుల్లో రాగబంధాలు పూయిస్తుంది. ప్రేమ అతి సున్నితం... అపురూపం. అందుకే ప్రేమించడం కన్నా ప్రేమను గౌరవించడం ఎంతో ముఖ్యమంటాడు యువ దర్శకుడు రాజు వరికుప్పల. తన షార్ట్ ఫిలిం ‘లవ్ మెయిల్’ ద్వారా ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఎంబీఏ చదివి హెచ్ఆర్గా పనిచేస్తూనే తనకిష్టమైన గ్లామర్ ఫీల్డ్‌లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. తపన ఉంటే అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించిన రాజు రూపొందించిన ఈ చిత్రం హీరో కావాలనుకొనే యువకుడు గౌతమ్ స్టోరీ. స్నేహితుడితో కలిసి బస్టాప్‌లో ఉన్న గౌతమ్... అక్కడ రోజాతో ఓ లెటర్ పట్టుకు నిలుచున్న అమ్మాయి అందానికి ఫిదా అయిపోతాడు. కొంత కాలం తరువాత ఆ విషయాన్ని ఆ బ్యూటీకి చెప్పాలనుకుంటాడు. రోజూ తనకు రోజాతో లెటర్స్ అక్కడ పెడుతుంది గౌతమేనని ఆమె అనుకుంటుంది. తను కూడా ప్రేమను ఓ లెటర్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటుంది. బస్టాప్‌కు వస్తుంది. షాక్..! గౌతమ్ కనిపించడు. కానీ... ఉత్తరాలు మాత్రం అందుతుంటాయి. ఇవి ఇక్కడ ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలని ఓ రోజు ముందే వస్తుంది. గౌతమ్ అక్కడ లెటర్ పెట్టడం చూసిన అమ్మాయి... అతడిని నిలదీస్తుంది. అవి తాను రాసినవి కాదంటాడు అతడు. పెద్ద ట్విస్ట్! అసలా లెటర్స్ రాస్తున్న అజ్ఞాత వ్యక్తి కార్తీక్. ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. ఆ విషయం చెప్పేలోపు యాక్సిడెంట్ అయి అతడు కోమాలోకి వెళతాడు. విషయం తెలిసిన గౌతమ్... వారి ప్రేమను బతికించడానికి ఆ లెటర్స్ పెడుతుంటాడు. ఆమెకు విషయం అర్థమవుతుంది. ప్రేమిస్తున్న అమ్మాయితో అవి తనవి కావని ఎందుకు చెప్పావని అతడి ఫ్రెండ్ గౌతమ్‌ను అడుగుతాడు. మోసం చేసి పెళ్లి చేసుకోవచ్చని... కానీ ఆ తరువాత నిజం తెలిసి ఆమె కళ్లతో ప్రశ్నిస్తే అది చూసి తాను తట్టుకోలేనంటాడు గౌతమ్. ‘ప్రేమలో ఓడిపోయినా... ఓ అమ్మాయి మనసు, ఆమె ఇష్టాన్ని గౌరవించిన నువ్వు హీరో’వంటూ అభినందించడంతో కథ ముగుస్తుంది. - ఓ మధు -
పేపర్.. సూపర్
తెల్లారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడే అన్నీ, అంతటా.. ప్లాస్టిక్‌మయం. ఆధునికత పేరిట ఆడంబరాన్ని చాటుకునేందుకు పర్యావరణానికి చేటు తెచ్చే వస్తువులను ఎడాపెడా వాడేస్తున్నాం. అయితే, వాటి వాడకాన్ని తగ్గించాలని చెప్పడమే కాదు.. అటువంటి వాటికి ప్రత్యామ్నాయాలను సృష్టిస్తున్నారు ఇద్దరు యువతులు. అంతేనా.. మహిళా సాధికారతకు దారి చూపిస్తున్నారు. వారి పరిచయం.. - ఓ మధు ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన అనుభవం గౌరీ మహేంద్రది. టీచ్ ఫర్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రెండేళ్లు ఆమె ఇక్కడ పనిచేసినపుడు స్కూల్లో హాజరు శాతం పెరగకపోవడం కలవరపరిచింది. సమీపంలోని మురికివాడల్లో తిరిగి పరిశీలించింది. పూట గడవడానికి పిల్లలు బడి మాని పనికి వెళ్తున్న పరిస్థితి కళ్లకుకట్టింది. కడు పేదరికంతో ఉన్న ఆ కుటుంబాలకు కాసింత ఉపాధి చూపితే్త తప్ప వారి పిల్లలను బడికి మళ్లించడం కష్టమని అర్థమైంది ఆమెకు. వారందరికీ ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలి! ‘ఈ ఆలోచన నన్ను తొలిచేసింది. ఈ సమయంలో రాజస్థాన్‌లో బేర్‌ఫుట్ కాలేజీ కమ్యూనిటీకి వెళ్లాను. అక్కడ అరుణారాయ్ వద్ద ఉపాధి శిక్షణ ఇవ్వదగ్గ వివిధ అంశాల గురించి తెలుసుకున్నా. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక.. నాలాంటి ఆలోచనలతోనే ఉన్న ఉదితా చడ్డాతో కలిసి ఆర్గనైజేషన్ ప్రారంభించాను. దాని పేరే ఉమీద్’ అని వివరించింది గౌరీ. మహిళా సాధికారత... ‘దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలి. అలాగే ముడి సరుకు కోసం ఎక్కువ ఖర్చు కాకూడదు. పర్యావరణానికి హాని కలిగించకూడదు. ఇలా ఆలోచించి వేస్ట్ న్యూస్‌పేపర్‌తో విభిన్నమైన వస్తువులు రూపొందించేలా శిక్షణ ఇస్తున్నాం. యూసుఫ్‌గూడ, ఓల్డ్‌సిటీ, అబిడ్స్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పది మంది మహిళలు పేపర్‌తో అద్భుతమైన కళాకృతులు తయారు చేశారు. వాటిని లామకాన్‌లో ప్రదర్శనకు పెట్టినప్పుడు మంచి స్పందన లభించిందని’ చెప్పింది ఒకే ఆశయం కోసం గౌరీతో కలిసి నడుస్తున్న ఉదితా చడ్డా. పెన్ స్టాండ్స్, టేబుల్ డెకరేటివ్ ఐటెమ్స్, వాల్ హ్యాంగింగ్స్... ఇలా ప్రదర్శనలో ఏది చూసినా వాటి వెనుక కళాకారుల అద్భుత పనితనం కనిపిస్తుంది. కాగితంతో వివిధ కళాత్మక ఐటెమ్స్ తయారు చేయించడమే కాదు.. స్కిల్ ట్రైనింగ్, మైండ్‌సెట్ మార్చడానికి టీమ్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, మహిళలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే వేదికను కల్పించడం కూడా తమ బాధ్యతగా భావిస్తున్నారు వీరిద్దరూ. స్నేహితుల సహకారంతో మొదలుపెట్టిన ‘ఉమీద్’కు ‘అన్లిమిటెడ్ ఇండియా’ హైదరాబాద్ చాప్టర్ నుంచి ఎల్ వన్ స్టేజ్‌లో కొంత ఫండింగ్ అందుతోంది. నిఫ్ట్ కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది వాలంటీర్లుగా డిజైనింగ్, క్రాఫ్ట్స్, ప్రమోషన్స్‌లో సంస్థకు సహకారం అందిస్తున్నారు. ‘రాబోయే రోజుల్లో మా సంస్థ ద్వారా మహిళా సాధికారత సాధించాలన్నది మా ప్రయత్నం’ అంటూ చెప్పుకొచ్చారు గౌరీ, ఉదిత. ఉమీద్లో భాగస్వాములు కావాలనుకొంటే లాగిన్ అవ్వండి. www.facebook.com/UMEEDsocialmedia/info?tab=page_info -
ఇంద్రధనుస్సు
దక్షిణాసియాలోనే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్ విబ్జీఆర్. ప్రతి ఏడాది కేరళలో జరిగే ఈ పండుగ ఈసారి బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో రెండురోజులపాటు జరిగింది. మానవత్వం, లైవ్లీహుడ్, పర్యావరణం, అభివృద్ధి, ప్రజాస్వామ్యం, ఆరోగ్యం, సెక్యులరిజం, లింగవివక్ష, మానవహక్కులు, సంప్రదాయాలు... ఇలా సమాజం చర్చించడానికి వెనుకాడుతున్న అనేక కీలక అంశాలపై తీసిన ఫిల్మ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. - ఓ మధు మణిపూర్ చట్టాలకు వ్యతిరేకంగా 11 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ షర్మిల గురించిన చిత్రం ‘మై బాడీ మై వెపన్’ను కవితా జోషి రూపొందించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న యురేనియం మైనింగ్ మానవ జాతికి, పర్యావరణానికి ఎంతటి హానికారిగా మారనుందో అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైన్.. చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. కాకినాడ, కోనసీమ జాలర్లు, రైతులు భూదోపిడీకి గురవుతున్న తీరు గురించిన చిత్రం ‘ ఏ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్’. అరుణాచల్‌ప్రదేశ్, డమ్రూలో ఆదివాసీలు నిర్మించిన బ్రిడ్జ్ ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తోంది. వారి నైపుణ్యం తెలిపే చిత్రం ఇన్ ది ఫారెస్ట్ హ్యాంగ్స్. ఇలా సామాజికాంశాలపై తీసిన చిత్రాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. 3డీ స్టీరియో క్యాస్ట్ సంగీతానికి భాష, జాతి, లింగ విబేధాలు లేవంటారు. కానీ కుల వివక్ష వుందనిపిస్తుంది ఈ చిత్రం చూస్తే. మలయాళ సంగీత, నృత్య కళాకారులతో రూపొందిన ఈ చిత్రానికి దర్శకత్వం అజిత్ కుమార్ ఏఏస్. కులం వల్ల కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యల కళ్లకు కట్టారాయన. కుల వ్యవస్థకు సంబంధించిన మరో సమస్యాత్మక కోణాన్ని జాడు కట్ట చిత్రం ఆవిష్కరిస్తుంది. టామ్ గాళ్ కొడుకులు లేకపోతే విలువ ఉండదని భావించిన ఓ తండ్రి కూతురిని అబ్బాయిలా పెంచుతాడు. ఆమె, ఆయనగా 70 ఏళ్ల జీవితాన్ని గడుపుతుంది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇన్నేళ్ల తర్వాత తాను ఆడైనా, మగైనా ఒరిగేదేమీ లేదని చెప్పే టామ్ కళ్లలోకి చూస్తే... ఆ జీవితంలో వేదన కనిపిస్తుంది. స్త్రీత్వానికి దూరంగా గడిపిన టామ్ కథ చూసిన ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. లెట్ ద బటర్‌ఫ్లైస్ ఫ్లై స్త్రీగా జీవితం గడపాలనుకుని జెండర్ మార్చుకుంది శిల్ప. అది బలవంతపు ప్రక్రియగా భావించిన పోలీసులు అందుకు సహకరించినవారిని అరెస్టు చేశారు. శిల్పను మళ్లీ పురుషుడిగా మార్చేందుకు సర్జరీ చేశారు. ఈ క్రమంలో శిల్ప తల్లిదండ్రులు, సన్నిహితులు ఎదుర్కొన్న పరిస్థితులు, వారు దగా పడ్డ తీరును డాక్యుమెంటరీలో చిత్రీకరించారు దర్శకులు గోపాల్ మీనన్. సేవింగ్ ఫేస్ భర్త, ప్రేమించిన వ్యక్తుల చేతుల్లో అలాంటి దాడులకు గురైన పాకిస్తానీ స్త్రీల గాథ ఈ చిత్రం. ఈ దాడులను చూసి చలించిన లండన్‌లోని ప్రముఖ డాక్టర్ మహమ్మద్ జావేద్ ఈ స్త్రీలకు అందిస్తున్న సేవలు, వారి నిజ జీవిత గాథలను కళ్లకు కట్టారు డేనియల్ జంగ్, షర్మీన్ ఒబైద్ షెనాయ్. మంచి ప్రయత్నం... పారలల్ సినిమాలతో సమాజాన్ని సెన్సిటైజ్ చేసే ప్రక్రియకు ఆద్యుడు చార్లీచాప్లిన్. ప్రస్తుత సెమీ ఫాసిస్ట్ సొసైటీని సెన్సిటైజ్ చేసే సినిమాలు చాలా అవసరం. ఫాసిజానికి వ్యతిరేకంగా చిత్రాలు తీసినప్పుడు దాడులు జరుగుతున్నాయి. పీకే సినిమాపై దాడి ఇందుకు నిదర్శనం. సామాజిక సమస్యలపై చిత్రాలు తియ్యటం, చర్చించటం మంచి ప్రయత్నం. - ప్రొఫెసర్ హరగోపాల్ ఆనందంగా ఉంది... డైవర్సిటీని, మానవ హక్కులను గౌరవించటం చాలా ముఖ్యం. అందుకు ఉపకరించే ఇలాంటి చిత్రాలు ప్రదర్శించటం ఆనందంగా వుంది. - వసంత కన్నభిరన్ -
రారండి మా ఇంటికి.. మంచి విందు ఉన్నది
వింతైన వంటకాల వివాహ భోజనంబు ఆహా ! అనేలా ఉంటుంది. వనభోజనం మన్పసంద్గా ఉంటుంది. ట్రెడిషనల్‌గా వస్తున్న సహపంక్తి భోజన విధానాన్ని అప్డేట్ చేస్తూ ఆన్లైన్లో కొత్త రకం విందు చవులూరిస్తోంది. మెనూ, ప్రైస్, గెస్టులు.. మీరే ఎంచుకోండి అంటూ నగరంలోకి కొత్త కల్చర్ వచ్చింది. నలుగురిని కలుసుకోవడం.. ముచ్చట్ల మధ్య ముద్దలు కలుపుకుని తినడం తాతల జమానా నాటిది. బిజీలైఫ్‌లో నలుగురిని కలుసుకోవడం, నలుగురితో కలసి భోజనం చేయడం మరచిన జనానికి తిరిగి ఇంటి రుచిని అందించి ఆ పాత కమ్మదనాన్ని గుర్తు చేయడమే ఫీస్ట్ - ఓ మధు మనకు నచ్చిన వాళ్లింట్లో అప్పుడప్పుడూ చేయి కడుగుతూనే ఉంటాం. మన ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉందనుకోండి.. చుట్టాలను భోజనానికి పిలవడమూ మామూలే. సోషలైజింగ్ అంటే ఈ రోజుల్లో ఫేస్బుక్, ట్విట్టర్‌గా మారిపోయింది. వీటిని బేస్ చేసుకునే అసలైన సోషలైజింగ్‌కు శ్రీకారం చుట్టడమే ఫీస్ట్ ఉద్దేశం. ఇంట్లో చేసే పాలతాలికలు, పనస పొట్టు స్పెషల్స్ ఏ రెస్టారెంట్లో దొరకవు. ఉద్యోగాల వల్ల ఇళ్లకు, ఇంట్లో వాళ్లకు దూరంగా ఉంటున్న వారికి దేశీయ వంటల రుచిని చేరువ చేస్తోందీ ఫీస్ట్. అన్ని ప్రాంతాల రుచులు.. మన విందులు, వినోదాలు మన చుట్టాల వరకే పరిమితం అవుతాయి. ఈ ఫీస్ట్‌లో మన వంటకాలను పంజాబీలకు వడ్డించొచ్చు. తెలుగింటి రుచులు దగ్గరుండి వడ్డిస్తూ.. దేని తర్వాత దేన్ని ఆస్వాదించాలో చెప్పొచ్చు. ముద్దపప్పులో నెయ్యి.. గడ్డపెరుగులో ఆవకాయ బద్ద.. ఇలా మన టేస్ట్ వారికి చూపించొచ్చు. అంతేనా మనం కూడా గుజరాతీ రుచులను ఎలా తినాలో అడిగి మరీ లాగించేయొచ్చు. భిన్న ప్రాంతాల వంటలు, రుచులు అందరూ ఆరగించేలా చేస్తోంది ఈ ఫీస్ట్. ఇంటింటా ఈవెంట్.. ఫీస్ట్ ప్లాట్‌ఫాంపై మీరు అతిథులను ఆహ్వానించాలంటే.. ఫీస్ట్ వెబ్సైట్ లేదా ఫేస్బుక్ పేజ్‌కి వెళ్లి ఈవెంట్ క్రియేట్ చేస్తే చాలు. ఎవరైనా ఓ ముగ్గురిని వాళ్లింటికి పిలవొచ్చు. ప్రైస్ కూడా హోస్టే ఫిక్స్ చేస్తారు. మీ మెనూ, మీరు పెట్టిన కాస్ట్ నచ్చిన వారు మీ ఇంటికి అనుకోని అతిథులుగా వచ్చేస్తారు. మీ ఇంటి రుచులను టేస్ట్ చేసి మీ ఇంట్లో వాళ్ల మధ్య కూర్చుని ఆరగిస్తారు. ఆపై అతిథ్యంలోని మాధుర్యాన్ని ఆన్లైన్లో పొగిడేస్తారు. నలభీములు రెడీ.. ఈవెంట్‌కు ముందు హోస్ట్ ఇంటిని నిర్వాహకులు వెళ్లి చూస్తారు. అతిథ్యానికి అనువుగా ఉందో లేదో తెలుసుకుంటారు. మీ ఇంట్లో పదిమందీ కూర్చునే చోటు లేదనుకోండి.. ఫీస్ట్ స్టూడియోలో ఈవెంట్ ఆర్గనైజ్ చేయొచ్చు. అంతేకాదు మీరు అనుకున్న వంటకాలను అదరహో అనిపించేలా చేసి మెప్పించగల నలభీములను కూడా వీరు అరేంజ్ చేస్తారు. నగరంలో 22 ఈవెంట్లు నిర్వహించిన వీరికి బెంగళూరు నుంచీ ఆహ్వానాలు అందడంతో అక్కడ మూడు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారు. మరోసారి ఆ చాన్స్.. రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తుంటాను. ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్లను కలుస్తుంటాను. ఒకసారి ఫీస్ట్ ఆర్గనైజ్ చేసిన ఇఫ్తార్ విందుకు వెళ్లాను. భలే సరదాగా అనిపించింది. నా వంటలు కూడా పరిచయం చేయాలని ఈవెంట్ హోస్ట్ చేశాను. ఇంట్లో వాళ్లు తింటారు. బాగుంది అంటారు. కొన్నాళ్లకు బాగుందని చెప్పడం కూడా మరచిపోతారు. కానీ ఈ ఈవెంట్ వల్ల నా వంట గురించి మరోసారి మంచి మాటలు వినడానికి అవకాశం వచ్చింది. కలసి భోంచేస్తూ అందరం ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకోవడం అందమైన అనుభూతి. - జయభారతి, హోస్ట్ మాటలు పంచుకుంటూ.. ‘నేను ఒరాకిల్‌లో మేనేజర్‌గా చేశాను. మంచి ఫుడీని మాత్రమే కాదు వంట కూడా బాగా చేస్తాను. హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల వారు, అన్ని సంప్రదాయాల వారూ ఉన్నారు. వాళ్ల వాళ్ల వంటలు రుచికరంగా చేయడంలో స్పెషలిస్ట్‌లు ఉంటారు. ఈ రుచులను అందరూ చూడాలనే ఫీస్ట్ ఏర్పాటు చేశాను. అందరినీ భోజనానికి పిలిచి మాటలు పంచుకుంటూ, ఆత్మారాముడ్ని శాంతింపజేస్తే కలిగే పాజిటివ్ ఎనర్జీ మనకే కాదు అక్కడికి వచ్చిన వారందరిలో చేరుతుంది. - గోపీ కిశోర్, ఫౌండర్ అదే ఆనందం.. మాది జైపూర్. 13 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. లకిడికాపూల్ దగ్గర ఓ కేఫ్‌లో టీ సర్వ్ చేస్తుంటాను. మాస్టర్ చెఫ్-2లో 3 రౌండ్స్ వరకూ వెళ్లాను. దిల్లీ, ముంబై, జైపూర్ ఇలా ఏ ప్రాంతంలో ఉంటే అక్కడి వంటకాలు నేర్చుకున్నాను. 28 రకాల సొంత రెసిపీలు చేస్తాను. ఫీస్ట్ ఈవెంట్స్‌లో నా వంటకాలను అతిథులు మెచ్చుకుంటుంటే ఆనందం కలుగుతుంది. - అమీర్, చెఫ్ కలలో కూడా వంటలే నాకు కలలో కూడా వంటలే వస్తుంటాయి. తెల్లవారి వాటిని ట్రై చేస్తాను. ఓ టీవీ చానల్లో చెఫ్ నంబర్ 1 పోటీలో గెలుపొందాను. అయినా ఏ ఉద్యోగమూ రాలేదు. సపోర్ట్ స్టాఫ్‌గా మాల్లో పని చేస్తున్నాను. ఉద్యోగం చేసుకుంటూ ఫీస్ట్ ఈవెంట్స్‌లో నా పనితనం చూపిస్తున్నాను. - గౌరీనాథ్, చెఫ్ -
ఆహా కళ్యాణం.. పెళ్లి మీది.. సినిమా మాది
పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులే కాదు.. ఇదివరకెరుగని మనసులను పెనవేసే మధుర జ్ఞాపిక. చెరిసగమవమని తనువులు ముడివేసే సంప్రదాయ వేదిక. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు.. మెరుపుతీగ తోరణాలు, కన్నెపిల్లల తళుకుబెళుకులు.. సన్నాయిల సవరింపులు, వియ్యాల వారి రుసరుసలు.. ఇలా పెళ్లి వేడుకంతా ఓ కలర్‌ఫుల్ మూవీలా కనిపిస్తుంటుంది. ఈ వేడుకను శాశ్వతంగా పదిల పరుచుకునేందుకు ఫొటో, వీడియోగ్రాఫర్లు ఉండనే ఉంటారు. అయితే ఎన్ని మిక్సింగ్‌లు చేసినా వీడియో.. మూవీలా మారదు కదా! అందుకే కళ్ల ముందు కదలాడే వివాహ వేడుకను సినిమాలా రూపొందించేందుకు ఇప్పుడు తెరపైకి వచ్చారు ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఫిలిం మేకర్స్. నాలుగు కాలాల పాటు నిలిచిపోయే మూడు ముళ్ల బంధాన్ని ముప్ఫయ్ నిమిషాల్లో చూపించేందుకు రెడీ అయ్యారు. సిటీలో మొదలైన ఈ నయా ట్రెండ్ కళ్యాణాన్ని కనులవిందుగా మారుస్తోంది. పెళ్లి వేడుకను ఇంకొంచెం కలర్ఫుల్గా వీడియోలో చూపడమే కదా ఈ ట్రెండ్.. ఇది పాతదే కదా అనుకుంటున్నారా! ఇది కూడా వెడ్డింగ్ షూటింగే కానీ.. ఇందులో మనుషులే కాదు, మీ మనసులు కనిపిస్తాయి. వధూవరుల పర్సనాలిటీలను బట్టి వారి ఇష్టాలు, అభిరుచులు అర్థం చేసుకుని ఈ వీడియోలు రూపొందిస్తారు. వధూవరుల కదలికలే కాదు, పెళ్లికి వచ్చే అతిథుల రియాక్షన్స్ ఈ సినిమాలో అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే స్క్రిప్ట్ లేకుండా చిన్న సైజ్ సినిమా షూట్ చేస్తారన్నమాట. వధూవరుల స్టోరీని అల్లడానికి వారి బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంటారు. లవ్ మ్యారేజ్ అయితే ఆ ప్రేమ ఎలా మొదలైంది.. ఎలా నడిచింది.. ఎలా పెళ్లి పీటలకెక్కింది.. ఇలా సినిమాల్లో చూసిన విధంగా మీ వెడ్డింగ్ వీడియో అదిరిపోతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే పెళ్లి చూపుల నుంచి పెళ్లి తంతు వరకు జరిగిన కథాకమామీషు ఇందులో చూపిస్తారు. అరగంట అదుర్స్ క్రికెట్లో 50 ఓవర్ల మ్యాచ్ బోర్ కొట్టే కదా.. టీ20 ఫార్మాట్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అదే ట్రెండ్ వెడ్డింగ్ వీడియోల్లోనూ వచ్చేసింది. ఈ స్పీడ్ జమానాలో రెండు, మూడు గంటలు కూర్చుని పెళ్లి వీడియోలు చూసే తీరిక ఎవరికీ లేదు. అలా తీసిన వీడియోలు ఆన్లైన్లో షేర్ చేసుకోలేరు కూడా. అందుకే అరగంటలో ఇమిడిపోయే పెళ్లిపుస్తకాన్ని కెమెరాలో బంధిస్తున్నారు ప్రొఫెషనల్ ఫిలిం మేకర్స్. ముప్ఫయ్ నుంచి నలభై నిమిషాల నిడివి ఉండే ఈ చిత్రం.. పెళ్లి వేడుకనే కాదు, పెళ్లివారి ఎమోషన్స్‌ను క్యారీ చేసే విధంగా కూడా ఫినిషింగ్ టచ్ ఇస్తారు. అందుకే ఈ తరహా ఫిలిం మేకింగ్‌కు ఇటీవల ఆదరణ పెరుగుతోంది. ఎప్పుడూ గుర్తొచ్చేలా.. పెళ్లి అనగానే వధూవరుల్లో ఓ వెలుగు కనిపిస్తుంది. సరికొత్త జీవితానికి నాంది పలికే ఈ వేడుకలో మరింత అందంగా కనిపించాలని నవజంట తాపత్రయపడుతుంది. పెళ్లినాటి జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తొచ్చినా.. కలర్ఫుల్గా ఉండాలని వారు కోరుకుంటారు. వధూవరులను మరింత అందంగా చిత్రీకరించేందుకు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ఈ ఫిలిం మేకర్స్. అందుకే ఈ బుల్లి సినిమాలో వాళ్లు సహజమైన నాయికానాయకుల్లా కనిపిస్తారు. కేవలంపెళ్లి జంటనే కాదు.. పెళ్లి తంతులో వారికి కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని, బంధువులతో పంచుకున్న ఆప్యాయతను కూడా మధుర జ్ఞాపకంగా ఈ లఘు చిత్రం కళ్లముందుంచుతుంది. ఈ పొట్టి చిత్రాలు స్క్రిప్ట్ రాసుకుని రూపొందించేవి కావు. అవుట్‌పుట్‌ని బట్టి.. దానిని అందంగా, క్రియేటివ్ స్టోరీగా రూపొందేవి. స్పాంటేనిటీతో కొత్తదనం.. స్పాంటేనియస్‌గా రూపొందించడంతో ఈ వీడియోల్లో కొత్తదనం కనిపిస్తుంది. వధూవరుల ప్రతి కదిలిక, భావోద్వేగం, సంప్రదాయంలో దాగున్న అందమైన అనుభూతుల్ని పదిల పరచడమే ఈ చిత్రాల ప్రత్యేకత. రియాక్షన్ కోసం ఎదురుచూడటం, దానిని చక్కటి టైమింగ్‌తో కవర్ చేయాల్సి ఉంటుంది. అందమైన విజువల్స్ రావాలంటే అవతలివారి సహకారం కూడా చాలా అవసరం. అందుకు ఈ ఫిలిం మేకర్స్‌ని ఫ్రెండ్స్‌గా ట్రీట్ చేసి సహకరిస్తేనే మీ పెళ్లి చిత్రం సక్సెస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. లేదంటే మీ మధుర జ్ఞాపకం ఓ వీడియో ఫిల్మ్‌గా మిగిలిపోతుంది. న్యూ ప్రొడక్షన్స్ క్రియేటివిటీ, ఫిలిం మేకింగ్ మీదున్న ఆసక్తితో ఇలా ఎంతోమంది ఈ తరహా వీడియోలను రూపొందిస్తున్నారు. కొత్త సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్నారు. యూకే, న్యూజిలాండ్‌లలో ఫిలిం మేకింగ్ కోర్సులు చేసిన శ్రీకౌండిన్య ముట్నూరి , బాలకృష్ణ కొడవటిలు మరికొందరు ప్రొఫెషనల్స్‌తో కలసి ప్రారంభించిన జోటికస్ ప్రొడక్షన్స్ ఇలాంటివాటిలో ఒకటి. ‘ట్రెడిషనల్ ఈవెంట్ ఫొటోస్, వీడియోస్‌తో పాటు ఈ బుల్లి సినిమా ప్యాకేజ్‌లా మాట్లాడుకుంటే ఒక ఈవెంట్‌కు రూ. రెండు లక్షల వరకు అవుతుంది. కేవలం వెడ్డింగ్ రోజుకి మాత్రమే అయితే రూ.లక్ష వరకు చార్జ్ చేస్తాం’ అన్నారు కౌండిన్య. పెళ్లి వారు కోరుకునే ఆప్షన్స్‌ను బట్టి రేటు మారుతుంటుందని ముక్తాయించారు. - ఓ మధు