ఆహా కళ్యాణం.. పెళ్లి మీది.. సినిమా మాది
పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులే కాదు.. ఇదివరకెరుగని మనసులను పెనవేసే మధుర జ్ఞాపిక. చెరిసగమవమని తనువులు ముడివేసే సంప్రదాయ వేదిక. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు.. మెరుపుతీగ తోరణాలు, కన్నెపిల్లల తళుకుబెళుకులు.. సన్నాయిల సవరింపులు, వియ్యాల వారి రుసరుసలు.. ఇలా పెళ్లి వేడుకంతా ఓ కలర్‌ఫుల్ మూవీలా కనిపిస్తుంటుంది. ఈ వేడుకను శాశ్వతంగా పదిల పరుచుకునేందుకు ఫొటో, వీడియోగ్రాఫర్లు ఉండనే ఉంటారు. అయితే ఎన్ని మిక్సింగ్‌లు చేసినా వీడియో.. మూవీలా మారదు కదా! అందుకే కళ్ల ముందు కదలాడే వివాహ వేడుకను సినిమాలా రూపొందించేందుకు ఇప్పుడు తెరపైకి వచ్చారు ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఫిలిం మేకర్స్. నాలుగు కాలాల పాటు నిలిచిపోయే మూడు ముళ్ల బంధాన్ని ముప్ఫయ్ నిమిషాల్లో చూపించేందుకు రెడీ అయ్యారు. సిటీలో మొదలైన ఈ నయా ట్రెండ్ కళ్యాణాన్ని కనులవిందుగా మారుస్తోంది.
పెళ్లి వేడుకను ఇంకొంచెం కలర్‌ఫుల్‌గా వీడియోలో చూపడమే కదా ఈ ట్రెండ్.. ఇది పాతదే కదా అనుకుంటున్నారా! ఇది కూడా వెడ్డింగ్ షూటింగే కానీ.. ఇందులో మనుషులే కాదు, మీ మనసులు కనిపిస్తాయి. వధూవరుల పర్సనాలిటీలను బట్టి వారి ఇష్టాలు, అభిరుచులు అర్థం చేసుకుని ఈ వీడియోలు రూపొందిస్తారు. వధూవరుల కదలికలే కాదు, పెళ్లికి వచ్చే అతిథుల రియాక్షన్స్ ఈ సినిమాలో అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే స్క్రిప్ట్ లేకుండా చిన్న సైజ్ సినిమా షూట్ చేస్తారన్నమాట. వధూవరుల స్టోరీని అల్లడానికి వారి బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంటారు. లవ్ మ్యారేజ్ అయితే ఆ ప్రేమ ఎలా మొదలైంది.. ఎలా నడిచింది.. ఎలా పెళ్లి పీటలకెక్కింది.. ఇలా సినిమాల్లో చూసిన విధంగా మీ వెడ్డింగ్ వీడియో అదిరిపోతుంది. అరేంజ్‌డ్ మ్యారేజ్ అయితే పెళ్లి చూపుల నుంచి పెళ్లి తంతు వరకు జరిగిన కథాకమామీషు ఇందులో చూపిస్తారు.
అరగంట అదుర్స్
క్రికెట్లో 50 ఓవర్ల మ్యాచ్ బోర్ కొట్టే కదా.. టీ20 ఫార్మాట్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అదే ట్రెండ్ వెడ్డింగ్ వీడియోల్లోనూ వచ్చేసింది. ఈ స్పీడ్ జమానాలో రెండు, మూడు గంటలు కూర్చుని పెళ్లి వీడియోలు చూసే తీరిక ఎవరికీ లేదు. అలా తీసిన వీడియోలు ఆన్‌లైన్లో షేర్ చేసుకోలేరు కూడా. అందుకే అరగంటలో ఇమిడిపోయే పెళ్లిపుస్తకాన్ని కెమెరాలో బంధిస్తున్నారు ప్రొఫెషనల్ ఫిలిం మేకర్స్. ముప్ఫయ్ నుంచి నలభై నిమిషాల నిడివి ఉండే ఈ చిత్రం.. పెళ్లి వేడుకనే కాదు, పెళ్లివారి ఎమోషన్స్‌ను క్యారీ చేసే విధంగా కూడా ఫినిషింగ్ టచ్ ఇస్తారు. అందుకే ఈ తరహా ఫిలిం మేకింగ్‌కు ఇటీవల ఆదరణ పెరుగుతోంది.
ఎప్పుడూ గుర్తొచ్చేలా..
పెళ్లి అనగానే వధూవరుల్లో ఓ వెలుగు కనిపిస్తుంది. సరికొత్త జీవితానికి నాంది పలికే ఈ వేడుకలో మరింత అందంగా కనిపించాలని నవజంట తాపత్రయపడుతుంది. పెళ్లినాటి జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తొచ్చినా.. కలర్‌ఫుల్‌గా ఉండాలని వారు కోరుకుంటారు. వధూవరులను మరింత అందంగా చిత్రీకరించేందుకు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ఈ ఫిలిం మేకర్స్. అందుకే ఈ బుల్లి సినిమాలో వాళ్లు సహజమైన నాయికానాయకుల్లా కనిపిస్తారు. కేవలంపెళ్లి జంటనే కాదు.. పెళ్లి తంతులో వారికి కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని, బంధువులతో పంచుకున్న ఆప్యాయతను కూడా మధుర జ్ఞాపకంగా ఈ లఘు చిత్రం కళ్లముందుంచుతుంది. ఈ పొట్టి చిత్రాలు స్క్రిప్ట్ రాసుకుని రూపొందించేవి కావు. అవుట్‌పుట్‌ని బట్టి.. దానిని అందంగా, క్రియేటివ్ స్టోరీగా రూపొందేవి.
స్పాంటేనిటీతో కొత్తదనం..
స్పాంటేనియస్‌గా రూపొందించడంతో ఈ వీడియోల్లో కొత్తదనం కనిపిస్తుంది. వధూవరుల ప్రతి కదిలిక, భావోద్వేగం, సంప్రదాయంలో దాగున్న అందమైన అనుభూతుల్ని పదిల పరచడమే ఈ చిత్రాల ప్రత్యేకత. రియాక్షన్ కోసం ఎదురుచూడటం, దానిని చక్కటి టైమింగ్‌తో కవర్ చేయాల్సి ఉంటుంది. అందమైన విజువల్స్ రావాలంటే అవతలివారి సహకారం కూడా చాలా అవసరం. అందుకు ఈ ఫిలిం మేకర్స్‌ని ఫ్రెండ్స్‌గా ట్రీట్ చేసి సహకరిస్తేనే మీ పెళ్లి చిత్రం సక్సెస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. లేదంటే మీ మధుర జ్ఞాపకం ఓ వీడియో ఫిల్మ్‌గా మిగిలిపోతుంది.
న్యూ ప్రొడక్షన్స్
క్రియేటివిటీ, ఫిలిం మేకింగ్ మీదున్న ఆసక్తితో ఇలా ఎంతోమంది ఈ తరహా వీడియోలను రూపొందిస్తున్నారు. కొత్త సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్నారు. యూకే, న్యూజిలాండ్‌లలో ఫిలిం మేకింగ్ కోర్సులు చేసిన శ్రీకౌండిన్య ముట్నూరి , బాలకృష్ణ కొడవటిలు మరికొందరు ప్రొఫెషనల్స్‌తో కలసి ప్రారంభించిన జోటికస్ ప్రొడక్షన్స్ ఇలాంటివాటిలో ఒకటి. ‘ట్రెడిషనల్ ఈవెంట్ ఫొటోస్, వీడియోస్‌తో పాటు ఈ బుల్లి సినిమా ప్యాకేజ్‌లా మాట్లాడుకుంటే ఒక ఈవెంట్‌కు రూ. రెండు లక్షల వరకు అవుతుంది. కేవలం వెడ్డింగ్ రోజుకి మాత్రమే అయితే రూ.లక్ష వరకు చార్జ్ చేస్తాం’ అన్నారు కౌండిన్య. పెళ్లి వారు కోరుకునే ఆప్షన్స్‌ను బట్టి రేటు మారుతుంటుందని ముక్తాయించారు.
- ఓ మధు