రారండి మా ఇంటికి.. మంచి విందు ఉన్నది | variety of forest meals | Sakshi
Sakshi News home page

రారండి మా ఇంటికి.. మంచి విందు ఉన్నది

Published Fri, Dec 26 2014 12:10 AM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM

రారండి మా ఇంటికి.. మంచి విందు ఉన్నది - Sakshi

రారండి మా ఇంటికి.. మంచి విందు ఉన్నది

వింతైన వంటకాల వివాహ భోజనంబు ఆహా ! అనేలా ఉంటుంది. వనభోజనం మన్‌పసంద్‌గా ఉంటుంది. ట్రెడిషనల్‌గా వస్తున్న సహపంక్తి భోజన విధానాన్ని అప్‌డేట్ చేస్తూ ఆన్‌లైన్‌లో కొత్త రకం విందు చవులూరిస్తోంది. మెనూ, ప్రైస్, గెస్టులు.. మీరే ఎంచుకోండి అంటూ నగరంలోకి కొత్త కల్చర్ వచ్చింది. నలుగురిని కలుసుకోవడం.. ముచ్చట్ల మధ్య ముద్దలు కలుపుకుని తినడం తాతల జమానా నాటిది. బిజీలైఫ్‌లో నలుగురిని కలుసుకోవడం, నలుగురితో కలసి భోజనం చేయడం మరచిన జనానికి తిరిగి ఇంటి రుచిని అందించి ఆ పాత కమ్మదనాన్ని గుర్తు చేయడమే ఫీస్ట్
- ఓ మధు
 

మనకు నచ్చిన వాళ్లింట్లో అప్పుడప్పుడూ చేయి కడుగుతూనే ఉంటాం. మన ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉందనుకోండి.. చుట్టాలను భోజనానికి పిలవడమూ మామూలే. సోషలైజింగ్ అంటే ఈ రోజుల్లో ఫేస్‌బుక్, ట్విట్టర్‌గా మారిపోయింది. వీటిని బేస్ చేసుకునే అసలైన సోషలైజింగ్‌కు శ్రీకారం చుట్టడమే ఫీస్ట్ ఉద్దేశం. ఇంట్లో చేసే పాలతాలికలు, పనస పొట్టు స్పెషల్స్ ఏ రెస్టారెంట్లో దొరకవు. ఉద్యోగాల వల్ల ఇళ్లకు, ఇంట్లో వాళ్లకు దూరంగా ఉంటున్న వారికి దేశీయ వంటల రుచిని చేరువ చేస్తోందీ ఫీస్ట్.
 
అన్ని ప్రాంతాల రుచులు..
మన విందులు, వినోదాలు మన చుట్టాల వరకే పరిమితం అవుతాయి. ఈ ఫీస్ట్‌లో మన వంటకాలను పంజాబీలకు వడ్డించొచ్చు. తెలుగింటి రుచులు దగ్గరుండి వడ్డిస్తూ.. దేని తర్వాత దేన్ని ఆస్వాదించాలో చెప్పొచ్చు. ముద్దపప్పులో నెయ్యి.. గడ్డపెరుగులో ఆవకాయ బద్ద.. ఇలా మన టేస్ట్ వారికి చూపించొచ్చు. అంతేనా మనం కూడా గుజరాతీ రుచులను ఎలా తినాలో అడిగి మరీ లాగించేయొచ్చు. భిన్న ప్రాంతాల వంటలు, రుచులు అందరూ ఆరగించేలా చేస్తోంది ఈ ఫీస్ట్.
 
ఇంటింటా ఈవెంట్..
ఫీస్ట్ ప్లాట్‌ఫాంపై మీరు అతిథులను ఆహ్వానించాలంటే..  ఫీస్ట్ వెబ్‌సైట్ లేదా ఫేస్‌బుక్ పేజ్‌కి వెళ్లి ఈవెంట్ క్రియేట్ చేస్తే చాలు. ఎవరైనా ఓ ముగ్గురిని వాళ్లింటికి పిలవొచ్చు. ప్రైస్ కూడా హోస్టే ఫిక్స్ చేస్తారు. మీ మెనూ, మీరు పెట్టిన కాస్ట్ నచ్చిన వారు మీ ఇంటికి అనుకోని అతిథులుగా వచ్చేస్తారు. మీ ఇంటి రుచులను టేస్ట్ చేసి మీ ఇంట్లో వాళ్ల మధ్య కూర్చుని ఆరగిస్తారు. ఆపై అతిథ్యంలోని మాధుర్యాన్ని ఆన్‌లైన్‌లో పొగిడేస్తారు.
 
నలభీములు రెడీ..
ఈవెంట్‌కు ముందు హోస్ట్ ఇంటిని నిర్వాహకులు వెళ్లి చూస్తారు. అతిథ్యానికి అనువుగా ఉందో లేదో తెలుసుకుంటారు. మీ ఇంట్లో పదిమందీ కూర్చునే చోటు లేదనుకోండి.. ఫీస్ట్ స్టూడియోలో ఈవెంట్ ఆర్గనైజ్ చేయొచ్చు. అంతేకాదు మీరు అనుకున్న వంటకాలను అదరహో అనిపించేలా చేసి మెప్పించగల నలభీములను కూడా వీరు అరేంజ్ చేస్తారు. నగరంలో 22 ఈవెంట్‌లు నిర్వహించిన వీరికి బెంగళూరు నుంచీ ఆహ్వానాలు అందడంతో అక్కడ మూడు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారు.
 
మరోసారి ఆ చాన్స్..
రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తుంటాను. ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్లను కలుస్తుంటాను. ఒకసారి ఫీస్ట్ ఆర్గనైజ్ చేసిన ఇఫ్తార్ విందుకు వెళ్లాను. భలే సరదాగా అనిపించింది. నా వంటలు కూడా పరిచయం చేయాలని ఈవెంట్ హోస్ట్ చేశాను. ఇంట్లో వాళ్లు తింటారు. బాగుంది అంటారు. కొన్నాళ్లకు బాగుందని చెప్పడం కూడా మరచిపోతారు. కానీ ఈ ఈవెంట్ వల్ల నా వంట గురించి మరోసారి మంచి మాటలు వినడానికి అవకాశం వచ్చింది. కలసి భోంచేస్తూ అందరం ట్రావెల్ ఎక్స్‌పీరియన్సెస్ గురించి మాట్లాడుకోవడం అందమైన అనుభూతి.
 - జయభారతి, హోస్ట్
 
మాటలు పంచుకుంటూ..

‘నేను ఒరాకిల్‌లో మేనేజర్‌గా చేశాను. మంచి ఫుడీని మాత్రమే కాదు వంట కూడా బాగా చేస్తాను. హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల వారు, అన్ని సంప్రదాయాల వారూ ఉన్నారు. వాళ్ల వాళ్ల వంటలు రుచికరంగా చేయడంలో స్పెషలిస్ట్‌లు ఉంటారు. ఈ రుచులను అందరూ చూడాలనే ఫీస్ట్ ఏర్పాటు చేశాను. అందరినీ భోజనానికి పిలిచి మాటలు పంచుకుంటూ, ఆత్మారాముడ్ని శాంతింపజేస్తే కలిగే పాజిటివ్ ఎనర్జీ మనకే కాదు అక్కడికి వచ్చిన వారందరిలో చేరుతుంది.
 - గోపీ కిశోర్, ఫౌండర్
 
అదే ఆనందం..

మాది జైపూర్. 13 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. లకిడికాపూల్ దగ్గర ఓ కేఫ్‌లో టీ సర్వ్ చేస్తుంటాను. మాస్టర్ చెఫ్-2లో 3 రౌండ్స్ వరకూ వెళ్లాను. దిల్లీ, ముంబై, జైపూర్ ఇలా ఏ ప్రాంతంలో ఉంటే అక్కడి వంటకాలు నేర్చుకున్నాను. 28 రకాల సొంత రెసిపీలు చేస్తాను. ఫీస్ట్ ఈవెంట్స్‌లో నా వంటకాలను అతిథులు మెచ్చుకుంటుంటే ఆనందం కలుగుతుంది.
- అమీర్, చెఫ్
 
కలలో కూడా వంటలే
నాకు కలలో కూడా వంటలే వస్తుంటాయి. తెల్లవారి వాటిని ట్రై చేస్తాను. ఓ టీవీ చానల్‌లో చెఫ్ నంబర్ 1 పోటీలో గెలుపొందాను. అయినా ఏ ఉద్యోగమూ రాలేదు. సపోర్ట్ స్టాఫ్‌గా మాల్‌లో పని చేస్తున్నాను. ఉద్యోగం చేసుకుంటూ ఫీస్ట్ ఈవెంట్స్‌లో నా పనితనం చూపిస్తున్నాను.
- గౌరీనాథ్, చెఫ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement