ఫేస్బుక్ ఫ్రెండ్స్ & ఎన్వరాన్‌మెంటలిస్ట్
ఇంటిపంట సాగుదారులంతా ఫేస్బుక్లో ఫ్రెండ్స్. ఏయే పంటలు పండిస్తున్నారు? ఏం తింటున్నారు? ఏం వండుతున్నారు?.. ఇవన్నీ పోస్ట్స్, షేర్స్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో మీట్ అయ్యారు. ముచ్చటపడి ఇంట్లో పండించే ఆకు, కాయగూరలను ఆహారంగా ఎలా తీసుకోవాలనే విషయమై వర్క్‌షాపు నిర్వహించుకున్నారు. దీనికి హాజరైన ఎన్వరాన్‌మెంటలిస్ట్ సీతా ఆనంద్ వారందరికీ చెప్పిన విషయాలు మనకీ ఉపయోగపడేవే..
- ఓ మధు
మనం ఇంట్లో పండించుకునే ఆకుకూరలు వారం.. పదిహేను రోజులకు చేతికొచ్చేవై ఉంటే మంచిది. ఇక మనం మోజుపడి పెరటిలోనే పండించుకునే వాటిని ఎలా తింటున్నామన్నది ముఖ్యం. ఉదాహరణకు చిక్కుడు, వంకాయ వంటివి వండేటప్పుడు బాగా నూనె వేసి డీప్ ఫ్రై చేసేస్తుంటాం. అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ కూరగాయలైనా, పప్పులైనా ఎంత పచ్చివి తినగలిగితే ఆరోగ్యానికి అంత మంచిది. శ్రీరామ నవమికి తినే వడపప్పు చక్కటి రా ఫుడ్ రెసిపీ. అలాంటివి రెగ్యులర్‌గా అన్ని పప్పులతో కలిపి కాంబినేషన్‌గా చేసుకోవచ్చు.
పచ్చివి తింటేనే..
సలాడ్ చేసుకునేందుకు వీలైన కూరగాయలను కూడా ఇంట్లో పెంచవచ్చు. చాలా కూరగాయలను సలాడ్స్ చేసుకోవటం కుదరదని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. బీరకాయ, సొరకాయ, బూడిద గుమ్మడి కాయలు వంటివి పచ్చివి తినటమే ఉత్తమం. నీటి పరిమాణం ఎక్కువగా ఉండే కూరగాయల్ని వేడి చేయకూడదు. అంటే వండకూడదు. ఆ నీటిలో చాలా పోషకాలుంటాయి. వండటం వలన నీరు పోయి పోషకాలు నశిస్తాయి. ఆ కూరగాయల్లో ఉండే రసాయనాలు మారిపోతాయి. అలా కాంపోజిషన్స్ మారిపోతే ఆరోగ్యానికే హాని. తీగకూరగాయలన్నిటినీ సలాడ్స్‌గా చేసుకుని తింటేనే మంచిది. టమోటా, బాదం లాంటివి ఆ సలాడ్స్‌లోకి చేరిస్తే మంచి రుచి వస్తుంది. గంగవాయిలీ, పాలకూరలు కూడా సలాడ్‌లో వేసుకోవచ్చు. తోటకూర తినటం కొంచెం కష్టం. దీంట్లో కీరదోస, టమోటా, పచ్చిమిర్చి, నువ్వులు, పచ్చి నూనె.. ఇలా కాంబినేషన్స్‌తో ట్రై చేస్తే టేస్టీగా మారుతుంది. గానుగ నూనె వాడాలి.
ఆహార క్రమం..
మనం తీసుకునే ఆహారంలో మొదటి స్థానంలో ఫ్రూట్స్ ఉండాలి. ఆ తరువాత స్థానం ఆకు, కూరగాయలకు ఇవ్వాలి. పప్పులకు కూడా ప్రాధాన్యమివ్వాలి. సమ్మర్లో ఎక్కువగా సలాడ్స్, ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సీజనల్ ఫుడ్నుసమపాళ్లతో తీసుకోవాలి.
సమ్మర్ స్పెషల్ స్మూదీ..
నచ్చిన ఆకుకూర ఒక కప్పు, అరటిపండు, బాదం లేదా కొబ్బరిపాలు మిక్సీలో వేసుకోవాలి. అరటిపండు... లేకపోతే ఖర్జూరాన్ని వేసుకోండి. జ్యూస్‌లా చేసుకోవాలి. దానిలో సబ్జా గింజలు వేస్తే.. సమ్మర్ స్పెషల్ స్మూదీ రెడీ. ఇందులో కావాలంటే కొంచెం కొబ్బరి కూడా కలపొచ్చు.