మే నెలలో ‘పీఎం’ ఫుట్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ఫుట్‌బాల్ క్రీడకు ప్రాచుర్యం తెచ్చేందుకు మే నెలలో దేశమంతటా ‘ప్రధానమంత్రి’ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. అండర్–19 బాలబాలికల స్థాయిలో దేశంలోని ప్రతి రాష్ట్రంలో మే 1 నుంచి 10 వరకు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో క్రీడల నిర్వహణ కోసం సోమవారం సీఐఎస్ఎఫ్ అధికారులు, శాట్స్, రాష్ట్ర ఫుట్‌బాల్ సంఘం, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ) అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఈ పోటీలను సీఐఎస్ఎఫ్ నిర్వహించనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.
బాలబాలికల విభాగంలో 8 జట్లు ఇందులో పాల్గొంటాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, కేంద్రీయ విద్యాలయ పబ్లిక్ స్కూల్, ఫుట్‌బాల్ సంఘానికి చెందిన బాలబాలికల జట్లు ఇందులో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల అనంతరం జూన్‌లో జోనల్‌స్థాయి టోర్నమెంట్లు నిర్వహిస్తారు. జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన జట్లతో జూలైలో ఆలిండియా స్థాయిలో ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ ఫిఫా అండర్–17 వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ఈ టోర్నీ ద్వారా దేశంలో ఫుట్‌బాల్ క్రీడకు ప్రాచుర్యాన్ని కల్పించాలని కేంద్రం భావిస్తుందని అధికారులు తెలిపారు. ఒకప్పుడు రాష్ట్రం నుంచి 8 మంది ఒలింపియన్లు ఉండేవారని, ప్రస్తుతం ఈ క్రీడలతో రాష్ట్రంలో పునర్ వైభవం తీసుకువచ్చేందుకు వీలవుతుందని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో సీఐఎస్ఎఫ్ ఐజీ జగ్బీర్ సింగ్, డీఐజీలు విక్రమ్, ఎంఆర్ నాయక్, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి, ఎండీ దినకర్ బాబు, రాష్ట్ర ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ అలీ రఫత్, కార్యదర్శి జీపీ ఫాల్గుణ, ఓఏటీ అధ్యక్షులు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్ రాజ్‌లతో పాటు కేంద్రీయ విద్యాలయ, ఎస్జీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.