OBrien
-
నిద్రలేవగానే ఏడుపు ఆపుకోలేకపోయా
వెల్లింగ్టన్: ఇంగ్లండ్‌లో ఉన్న భార్యాపిల్లలను కలిసేందుకు విమాన టికెట్ల డబ్బుల కోసం అభిమానులతో వీడియో చాటింగ్‌కు సిద్ధమైన న్యూజిలాండ్ మాజీ పేసర్ ఇయాన్ ఓబ్రైన్కు ఊరట లభించింది. అతను తన ఇంటికి వెళ్లేందుకు కావాల్సిన 2,250 పౌండ్లు (సుమారు రూ. 2.07 లక్షలు) జమ కావడంతో అతను కన్నీళ్లపర్యంతమవుతూ కృతజ్ఞతలు వ్యక్తం చేశాడు. ‘మీరంతా నిజంగా చాలా మంచివారు. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నిద్ర లేవగానే ఏడుపు ఆపుకోలేకపోయాను’ అని ఓబ్రైన్ వీడియోలో చెప్పాడు. ఇంగ్లండ్‌లో ఉన్న తన భార్యకు అనారోగ్యమని, వారికి సహాయం చేయాల్సిన స్థితిలో డబ్బుల్లేక న్యూజిలాండ్‌లో ఇరుక్కుపోయానని చెప్పిన ఓబ్రైన్ మాటలకు క్రికెట్ అభిమానులు వేగంగా స్పందించి సహాయమందించారు. అతని స్వదేశం న్యూజిలాండే అయినా భార్య, ఇద్దరు పిల్లలతో ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. తన తల్లిదండ్రులను కలిసేందుకు అతను స్వస్థలం వచ్చాడు. అయితే కరోనా కారణంగా దాదాపు అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఏదోలా వెళ్దామనుకొని అందుబాటులో ఉన్న మూడు ఫ్లయిట్లలో అతను బుకింగ్ చేశాడు. అయితే ఆ మూడు చివరి నిమిషంలో రద్దు కాగా, డబ్బులు కూడా తిరిగివ్వలేదు. (‘నరకం అంటే ఏమిటో చూశా’) ఇంగ్లండ్‌లో ఉన్న తన కుటుంబం గురించి అతను తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాడు. ‘నా భార్య ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతోంది. ఇప్పుడు ఛాతీకి ఇన్‌ఫెక్షన్‌లాంటిదేమైనా వస్తే కరోనా కారణంగా ఆమె ప్రాణాలకే ప్రమాదం. పైగా ఇద్దరు చిన్నపిల్లలు, 80 ఏళ్ల తల్లి కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆమె బాధను కొంత పంచుకోవాలని భావిస్తుంటే ఇప్పుడు నా కారణంగా అది మరింత పెరిగేటట్లు అనిపిస్తోంది’ అని ఓబ్రైన్ ఆవేదన వ్యక్తం చేశాడు.. తాను ఇంగ్లండ్ వెళ్లడానికి డబ్బుల్లేక పోయానంటూ అభిమానుల ముందుకొచ్చాడు. దీనిపై వెంటనే స్పందించిన అభిమానులు అతను వెళ్లడానికి కావాల్సిన మొత్తాన్ని సమకూర్చారు. న్యూజిలాండ్ తరఫున 22 టెస్టులు, 10 వన్డేలు ఒబ్రైన్ ఆడాడు. ఇక దేశవాళీ క్రికెట్లో 58 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడగా, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు పరంగా చూస్తే 91 మ్యాచ్‌లు ఆడాడు. -
నా కుటుంబాన్ని కలవాలి... ఆర్థిక సహాయం చేయండి!
క్రైస్ట్‌చర్చ్: ‘యూకే వెళ్లేందుకు విమాన టికెట్లకు కొంత డబ్బు కావాలి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. స్కైప్/ వీడియో కాల్ ద్వారా నాతో ఎవరైనా 20 నిమిషాలు మాట్లాడవచ్చు. క్రికెట్, రాజకీయాలు, వంటలు, మానసిక ఒత్తిడి, సచిన్ టెండూల్కర్ ఏదైనా సరే...మీకు నచ్చితే కొన్ని డాలర్లు/పౌండ్లు నాకు పంపండి’... ఒక మాజీ క్రికెటర్ ఆవేదన ఇది. న్యూజిలాండ్‌కు చెందిన పేస్ బౌలర్ ఇయాన్ ఓబ్రైన్ జాతీయ జట్టు తరఫున 22 టెస్టులు, 10 వన్డేలు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. అతని స్వదేశం న్యూజిలాండే అయినా భార్య, ఇద్దరు పిల్లలతో ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. తన తల్లిదండ్రులను కలిసేందుకు అతను స్వస్థలం వచ్చాడు. అయితే కరోనా కారణంగా దాదాపు అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఏదోలా వెళ్దామనుకొని అందుబాటులో ఉన్న మూడు ఫ్లయిట్లలో అతను బుకింగ్ చేశాడు. అయితే ఆ మూడు చివరి నిమిషంలో రద్దు కాగా, డబ్బులు కూడా తిరిగివ్వలేదు. ఇప్పుడు ఎంత ఎక్కువ మొత్తమైనా ఇచ్చి వెళ్లాలనుకుంటున్నానని, దాంతో ఇలా చేయక తప్పడం లేదని అతను వాపోయాడు (2009 హామిల్టన్ టెస్టులో అతను సచిన్‌ను అవుట్ చేశాడు. అందుకే దాని గురించి కూడా ఎవరైనా అడగవచ్చని సచిన్ పేరు కూడా జత చేశాడు). ఇంగ్లండ్‌లో ఉన్న తన కుటుంబం గురించి అతను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. ‘నా భార్య ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతోంది. ఇప్పుడు ఛాతీకి ఇన్‌ఫెక్షన్‌లాంటిదేమైనా వస్తే కరోనా కారణంగా ఆమె ప్రాణాలకే ప్రమాదం. పైగా ఇద్దరు చిన్నపిల్లలు, 80 ఏళ్ల తల్లి కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆమె బాధను కొంత పంచుకోవాలని భావిస్తుంటే ఇప్పుడు నా కారణంగా అది మరింత పెరిగేటట్లు అనిపిస్తోంది’ అని ఓబ్రైన్ బాధపడుతున్నాడు. -
ఫీల్డ్ లో క్రికెటర్ల కొట్లాట
బెర్ముడా:సాధారణంగా క్రికెటర్లు మాటల యుద్ధానికే పరిమితమవడం మనం చూస్తూ ఉంటాం. అయితే తొలుత ఇలా స్లెడ్జింగ్ కు దిగిన క్రికెటర్లు ఏకంగా ఒకరినొకరు కొట్టుకున్న ఘటన బెర్ముడాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బెర్ముడాలో క్లబ్ క్రికెట్ లో భాగంగా క్లెవలాండ్ కంట్రి క్లబ్ - విల్లో కట్స్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య క్రికెట్ పోటీ జరిగింది. ఈ మ్యాచ్ లో క్లెవ్ లాండ్ కంట్రీ క్లబ్ తరపున జాసన్ అండర్సన్ ఆడుతుండగా, విల్లో కట్స్ క్రికెట్ క్లబ్ తరపున జార్జ్ ఒబ్రాయిన్ ఆడుతున్నాడు. ఆ సమయంలో ఒబ్రాయిన్ బౌలింగ్ చేస్తుండగా, అండరన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తొలుత వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగింది. అయితే నియంత్రణ కోల్పోయిన అండర్సన్ ఒక్కసారిగా ఒబ్రాయిన్ పై విరుచుకుపడ్డాడు. ఒబ్రాయిన్ పై బ్యాట్ తో దాడి చేసి గాయపరిచాడు. దీంతో ఫీల్డ్ నుంచి అండర్సన్ ను పంపించి వేశారు. అనంతరం జరిగిన ఈ మ్యాచ్ లో క్లెవ్ లాండ్ క్రికెట్ క్లబ్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై టీవీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు చేపట్టిన బెర్ముడా క్రికెట్ బోర్డు అండర్సన్ పై జీవిత కాలం నిషేధం విధించగా, ఒబ్రాయిన్ పై ఆరు నెలల నిషేధం పడింది. బెర్ముడా జట్టు తరపున అండర్సన్ తొమ్మిది వన్డే మ్యాచ్ లతో పాటు ఐదు ట్వంటీ 20 మ్యాచ్ లో ఆడాడు.