ఫీల్డ్ లో క్రికెటర్ల కొట్లాట
బెర్ముడా:సాధారణంగా క్రికెటర్లు మాటల యుద్ధానికే పరిమితమవడం మనం చూస్తూ ఉంటాం. అయితే తొలుత ఇలా స్లెడ్జింగ్ కు దిగిన క్రికెటర్లు ఏకంగా ఒకరినొకరు కొట్టుకున్న ఘటన బెర్ముడాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బెర్ముడాలో క్లబ్ క్రికెట్ లో భాగంగా క్లెవలాండ్ కంట్రి క్లబ్ - విల్లో కట్స్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య క్రికెట్ పోటీ జరిగింది. ఈ మ్యాచ్ లో క్లెవ్ లాండ్ కంట్రీ క్లబ్ తరపున జాసన్ అండర్సన్ ఆడుతుండగా, విల్లో కట్స్ క్రికెట్ క్లబ్ తరపున జార్జ్ ఒబ్రాయిన్ ఆడుతున్నాడు. ఆ సమయంలో ఒబ్రాయిన్ బౌలింగ్ చేస్తుండగా, అండరన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తొలుత వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగింది. అయితే నియంత్రణ కోల్పోయిన అండర్సన్ ఒక్కసారిగా ఒబ్రాయిన్ పై విరుచుకుపడ్డాడు. ఒబ్రాయిన్ పై బ్యాట్ తో దాడి చేసి గాయపరిచాడు. దీంతో ఫీల్డ్ నుంచి అండర్సన్ ను పంపించి వేశారు. అనంతరం జరిగిన ఈ మ్యాచ్ లో క్లెవ్ లాండ్ క్రికెట్ క్లబ్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై టీవీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు చేపట్టిన బెర్ముడా క్రికెట్ బోర్డు అండర్సన్ పై జీవిత కాలం నిషేధం విధించగా, ఒబ్రాయిన్ పై ఆరు నెలల నిషేధం పడింది. బెర్ముడా జట్టు తరపున అండర్సన్ తొమ్మిది వన్డే మ్యాచ్ లతో పాటు ఐదు ట్వంటీ 20 మ్యాచ్ లో ఆడాడు.